*సూర్యగ్రహ జననం – 1*
ఆశ్రమ సమీపంలోని సుందర ప్రాంతంలో అదితి తపస్సు ప్రారంభించింది. పచ్చని పరిసరంలో, ప్రశాంత వాతావరణంలో పూర్వాభిముఖంగా కూర్చున్న అదితి అచిరకాలంలో తాను కూడా ఆ ప్రకృతిలో భాగంగా లీనమైపోయింది. అసామాన్యమైన ఏకాగ్రత ఆమెను వరించింది. ప్రణవ పూర్వకంగా శ్రీ మహావిష్ణు నామం ఆమె హృదయంలో నినదిస్తోంది.
ఆమె ధ్యాననిష్ఠ నిత్య ధ్యానంతో గడిపే కశ్యప ప్రజాపతినే అబ్బుర పరుస్తోంది.
అనతికాలంలోనే శ్రీమహావిష్ణువు ఆమె ముందు సాక్షాత్కరించాడు. అసంకల్పితంగా అదితి కళ్ళు విచ్చుకున్నాయి.
*”పరమాత్మా ! వచ్చావా !”* అదితి ఆనంద బాష్పాలు రాలుస్తూ చేతులు జోడించింది. “”నీ ధ్యాన తరంగాలు ఏకోన్ముఖంగా నా హృదయాన్ని తాకాయి ! నన్ను నీ ముందుకు రప్పించాయి !”* విష్ణువు మందహాసం చేస్తూ అన్నాడు. “”ఏం కావాలో కోరుకో !”*
*”ఈ దీనురాలి కోరిక నీకు తెలియదా స్వామీ !”* అదితి కంఠంలో భావావేశం తొణికింది.
*”తెలుసు ! భక్తుల కోరికలను వాళ్ళ వాక్కులలో వినడం నాకు ఇష్టం ! అడుగు అదితీ !”* శ్రీమహావిష్ణువు కంఠం ఆ ప్రశాంత వాతావరణానికే గిలిగింతలు పెట్టింది.
*”ఈర్ష్యాద్వేషాలు లేని వాడూ, సర్వుల పట్లా సమదృష్టి కలిగిన వాడూ, లోక హితం కోరే వాడు అయిన పుత్రుణ్ని ప్రసాదించు, తండ్రీ, అదితి వినయంతో అడిగింది.
విష్ణువు మొహం మీద దరహాసం మెరిసింది. *”అదితీ ! నువ్వు కోరిన వరం ప్రశంసించదగింది. ఒక్కసారి, నీ ఎదురుగా ఆకాశంలోకి చూడు !”*
అదితి ఆశ్చర్యపోతూ, అప్రయత్నంగా కళ్ళెత్తి, ఆకాశంలోకి చూసింది.
*”ఎవరు కనిపిస్తున్నారు. నింగిలో ?”” విష్ణువు ప్రశ్న ఆమెను హెచ్చరించింది.
“… సూర్యభగవానుడు, స్వామీ…”” అదితి సమాధానమిచ్చింది. *”ఇప్పుడు నీ ఎదురుగా వున్న పూల మొక్కనూ, ముళ్ళపొదనూ చూడు !”* విష్ణువు చిన్నగా నవ్వాడు
అదితి అసంకల్పితంగా చూసింది. పూల మొక్కా. ముళ్ల పొదా రెండూ సూర్యకాంతిలో మెరుస్తున్నాయి.
*”ఆ రెండు మొక్కల మీదా సూర్యరశ్మి సమానంగా పడుతోంది కదా !”” విష్ణువు కంఠ స్వరంలో తేనెలు కురుస్తున్నాయి.
*”అవును…”” అదితి మంత్ర ముగ్ధలా అంది.
*”సకల ప్రాణుల పట్లా, సకల చర – అచర ప్రపంచం పట్లా సమదృష్టి కలిగిన వాడూ సర్వలోక హితం కోరే వాడూ – ఆ సూర్యుడు ! ఆ సూర్యుడే నీ పుత్రుడుగా జన్మిస్తాడు !”*
*”స్వామీ !”* అదితి కంఠం వణికింది. ఆనందబాష్పాలు ఆమె కళ్ళ ముందు మంచు తెరను పట్టుతున్నాయి.
*”ఆ సూర్యుడు ఎక్కడున్నాడో తెలుసా ?”* విష్ణువు నవ్వుతూ అన్నాడు. “”ఊర్ధ్వ లోకంలో, జ్యోతిర్మండలంలో నీకు కనిపిస్తున్న గోళాకారంలో వున్నాడు ! సూక్ష్మాతి సూక్ష్మమైన రూపంలో – ఇదిగో – నా కుడికంటిలో వున్నాడు !”*
అదితి శరీరంలో ఏదో గగుర్పాటు.
*”చర్మ చక్షువులకు కనిపించని మహా సూక్ష్మరూపంలో నా దక్షిణ నేత్రంలోనూ, కంటికి కనిపిస్తూ, తదేకంగా చూడలేని తీక్షణ గోళాకారంలో నింగిలోనూ వున్న ఆ ‘వెలుగు వేలుపు’ సశరీరంగా నీ పుత్రుడుగా జన్మిస్తాడు!”*
*”స్వామీ ! స్వామీ ! నేనెంత ధన్యురాల్ని! ఎంత అదృష్టవంతురాల్ని…”” అదితి వణికే కంఠంతో అంటోంది.
“అవును, అదితీ ! నీవు మహాభాగ్యశాలినివి ! సకల జీవులూ, ముఖ్యంగా భూలోకంలోని మానవులూ, ఆరాధించుకోవడానికి అనువుగా జ్యోతిర్మండలాలలో కాంతి గోళాలుగా వున్న నవగ్రహాలు తేజోరూపాలతో, శరీరాలతో అవతరించాలని నేను సంకల్పించాను. నీ ద్వారా నవగ్రహాల ఆవిర్భావాలకు ఆరంభం జరుగుతుంది. నా అంశ కలిగిన సూర్యుడు నీ గర్భవాసాన జన్మిస్తాడు !”” శ్రీ మహావిష్ణువు గంభీరంగా అన్నాడు. *”నన్ను అలరించినట్టే, ఆ సూర్యుణ్నీ నీ ధ్యానంతో అలరించు ! అఖండభక్తితో ఆరాధించు ! వరం అర్థించు !””
మాటలు మరిచిపోయిన అదితి వినయంగా చేతులు జోడించింది. విష్ణువు అంతర్ధానమయ్యాడు.
*”నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి, అదితీ !”* శ్రీహరి సాక్షాత్కారం గురించి భార్య చెప్పిందంతా విన్న కశ్యపుడు సంతోషంగా అన్నాడు. “”ఆ పరమ పురుషుడు ఆదేశించిన విధంగా రేపే సూర్యారాధన ప్రారంభించు !”*
అదితి సోదరీమణులు పన్నెండుగురూ చుట్టూ చేరి ఆసక్తిగా వింటున్నారు. *”అదితి అక్క అదృష్టమే అదృష్టం ! విష్ణుమూర్తిని ప్రత్యక్షం చేసుకుంది ! ఇప్పుడు నింగిలోని సూర్యుణ్ణి నేలకు దించి, పుత్రుడిగా పొందబోతోంది !”” వినత మెప్పుగా అంది..
దితి ఎగతాళిగా నవ్వింది. “సంతానం కోసం అంతయాతన ఎందుకు వినతా ? తపస్సు, ధ్యానమూ అనే శ్రమ అవసరం లేకుండానే, సంతానాన్ని యిచ్చే పతిదేవుడు. కళ్ళముందే వుంటే – ఎక్కడో వున్న ఆ దేవుళ్ళెందుకు ?”*
దనూ, సింహకి, కళా పగలబడి నవ్వారు.
కశ్యపుడు . దితివైపు మందలింపుగా చూశాడు. “నీది అజ్ఞానమూ, అవిధేయతా కలిసిన ఆలోచన దితి ! శ్రీ మహావిష్ణువు ఎవరనుకున్నావు ? నీ తండ్రి దక్ష ప్రజాపతికి, నీ నా తండ్రి మరీచి మహర్షికి జన్మనిచ్చిన ఆ సృష్టికర్తకే తండ్రి. ఆయనే సూర్యుడు ! అలాంటి దైవస్వరూపుడైన సూర్యభగవానుడి ఆరాధనను అపహాస్యం చేయడం అపచారం !”.”
*”పోనీలెండి, చెల్లి, దితి అమాయకురాలు. పాపం దానికి ఏమీ తెలీదు !”* అదితి కల్పించుకుంటూ అంది
*ఎందుకు తెలీదు తెలుసు! ఆ మహావిష్ణువు మన తండ్రులకు తాత; మనకు ముత్తాత; అందుకే గదా, మునిమనుమరాలైన యీ దితి కొడుకు హిరణ్యాక్షుణ్ని వరాహరూపంతో వధించాడు. హు !”* దితి అక్కసు వెళ్ళగక్కుతూ అక్కణ్నుంచి వెళ్ళిపోయింది. వినత, కద్రువా, మునీ తప్పించి – మిగతా సోదరీమణులందరూ దితి వెంట వెళ్ళిపోయారు.
*”దితి మాటల్ని మరిచిపో అక్కా నీ సూర్యారాధన ప్రారంభించు !”” అంది వినత.
అదితి ఉపవాస దీక్షతో సూర్యారాధన ప్రారంభించింది. విష్ణువును గురించి తపస్సు చేసిన ప్రదేశంలోనే ఆమె తపోదీక్ష కొనసాగుతోంది.
రోజులు గడుస్తున్నాయి. ఏకాగ్రతలో మునిగిపోయిన అదితి తాను వున్న స్థలాన్నీ, జరుగుతున్న కాలాన్నీ, ఆకలిదప్పుల్నీ, చివరికి తన ఉనికినీ పూర్తిగా మరిచిపోయింది. ఆమె శరీరంలోని ప్రతి అణువూ సూర్యధ్యానం చేస్తోంది. తన చుట్టూ వున్నది వెలుగో చీకటో కూడా తెలుసుకోలేని ఒక దివ్యమైన అవస్థలోకి ప్రవేశించిందామె సర్వస్వమూ !
అమ్మ
ఏదో అంతరాళం నుంచి వినవస్తున్నట్టు, అదితి చెవులకు లీలగా వినిపించిందా పిలుపు. ఆ పిలుపులోని మాధుర్యం అదితి నిమీలిత నేత్రాలు విచ్చుకునేలా చేసింది.
“.అమ్మ..”*
అదితి హృదయంలో ఏదో అవ్యక్తానందం పరవళ్ళు తొక్కింది. కళ్ళు పెద్దవిచేసి చూసిందామె. ఎదురుగా . భూమికి అంటకుండా ఒక కాంతిగోళం కనిపించింది. ఆ కాంతిగోళం లీలగా స్పందిస్తోంది. కనిపించీ కనిపించని కదలిక అది !
*”ఎవరు ?”* అదితి కంఠం వణికింది.
*”నేనే ! సూర్యుణ్ని ! మౌనభాషతో పిలిచావుగా ! వచ్చాను””. కాంతి గోళంలోంచి స్పష్టంగా వినిపించింది సూర్యుడి కంఠం.
‘”తండ్రీ !” ఆనందోద్రేకంతో అదితి కంఠం సన్నగా వణికింది. గగుర్పాటుతో ఆమె లతలాంటి శరీరం వణికింది.
*”వచ్చావా, తండ్రీ…” అంది అదితి పారవశ్యంతో.
“వచ్చావా, తండ్రీ…”” అంది అదితి పారవశ్యంతో.
*”నాకు తల్లి కావాలనుకున్నావుగా ! అందుకే వచ్చాను ! నీ గర్భవాసాన విశ్రాంతి తీసుకుని, నీ బిడ్డగా జన్మించి, నీ వొడిలో ఆడుకుంటాను !”* సూర్యుడి మాటల్లోని మధురిమ అదితిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది !
*”అది… అది… నా అదృష్టం తండ్రీ !” “నీ స్తన్యపానంతో తుష్టినీ, పుష్టినీ పొంది నీ వొడిలో ఆడుకోవడం నా అదృష్టమమ్మా !”*
*”నాయనా…” అదితి కంఠం మాతృభావనతో కంపించింది.
*”అమ్మా ! ఆశ్రమానికి వెళ్ళు ! నా రాక కోసం ఎదురు చూడు !”* కాంతి వలయం లోంచి సూర్యకంఠం పలికింది.
క్షణంలో ఆ కాంతిగోళం అదృశ్యమైంది.
క్షణంలో ఆ కాంతిగోళం అదృశ్యమైంది.
అదితి రెప్పలు టపటపలాడించింది. అంత సేపూ తాను రెప్పవేయడం మరచిపోయినట్టు ఆమె గుర్తించి ఆశ్చర్యపోయింది. నరనరంలోనూ, అణువణువు లోనూ ప్రవహిస్తున్న ఆనందం అదితిని ఆశ్రమం వైపు నడిపించింది.
శ్రీ గురు దత్తా
సేకరణ… ఆధురి భాను ప్రకాష్
