గోదావరి నదికి తూర్పు తీరాన గల జనార్ధన ఆలయాలల్లో తొమ్మిది ఆలయాలు లోక ప్రసిద్ధి చెందినాయి. వీటిని నవ జనార్ధన క్షేత్రాలుగా పిలుస్తారు. ఇవి మహా విష్ణువుకు అంకితమైన నవ గ్రహ క్షేత్రాలుగా ప్రతీతి చెందాయి. సాధారణంగా నవ గ్రహ దోషములు నుంచి విముక్తి పొందుటకు భక్తులు ఈ నవ జనార్ధన క్షేత్రాలు దర్శిస్తారు. ఇంతకూ ఈ నవ జనార్ధన క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి? వాటి విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
వైష్ణవాలయాల్లో నవగ్రహ మండపాలు
సాధారణంగా శివాలయంలో నవగ్రహ మండపంలో నవగ్రహ విగ్రహాలు ప్రతిష్టించి ఉంటాయి. నవ గ్రహ దోషములు నుంచి విముక్తి కోసం నవగ్రహాలకు నియమానుసారంగా అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అయితే వైష్ణవాలయాల్లో నవగ్రహ మండపం ఉండడం చాలా అరుదైన విషయం. ఇక్కడ శ్రీ వైష్ణవులు నవ గ్రహ దోషములు నుంచి విముక్తి కోసం మహా విష్ణువుకు ప్రత్యేక అర్చనలు జరుపుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం విష్ణువు ఆలయంలో జరుపు నవ గ్రహ అర్చనలు ఉత్తమైనవని అంటారు. అంతే కాదు వైష్ణవాలయాల్లో ప్రతిష్టించిన నవగ్రహాలకు దోష నివారణ పూజలు జరిపించడం వలన గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం లభిస్తుందని చెప్పడం విశేషం. ఈ నవ జనార్ధన క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం.
గోదావరి నదీ తీరాన గల నవ జనార్ధన క్షేత్రాలు
శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి – ధవళేశ్వరం
శ్రీ జనార్ధన స్వామి -మడికి
శ్రీ జనార్ధన స్వామి – జొన్నాడ
శ్రీ జనార్ధన స్వామి – ఆలమూరు
శ్రీ జనార్ధన స్వామి – మండపేట
శ్రీ జనార్ధన స్వామి – కపిలేశ్వరపురం
శ్రీ జనార్ధన స్వామి – మాచర
శ్రీ జనార్ధన స్వామి – కోరుమిల్లి
శ్రీ సిద్ధి జనార్ధన స్వామి – కోటిపల్లి
ఒకప్పుడు ఈ తొమ్మిది జనార్ధన ఆలయాలు తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉండేవి. జిల్లా పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో ఈ క్షేత్రాలలో ఒక్క ధవళేశ్వరం ఆలయం తప్ప మిగిలిన ఆలయాలు కోనసీమ జిల్లా పరిధిలోనికి వస్తాయి.
దర్శనఫలం
నవ జనార్ధనల క్షేత్రాలు దర్శిస్తే సమస్త నవ గ్రహ దోషాలు దూరమవుతాయని విశ్వాసం. అలాగే నవ జనార్ధన క్షేత్రాల దర్శనంతో ఆయురారోగ్య, సకల ఐశ్వర్యాలు సమకూరుతాయనేది భక్తుల విశ్వాసం. గ్రహ దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ క్షేత్రాలను దర్శిస్తే జనార్థన స్వామి అనుగ్రహంతో నవగ్రహములు శాంతించి, సుఖశాంతులు కలుగుతాయని విశ్వాసం. మహావిష్ణువుకు వైశాఖ మాసం ప్రీతి. నవ జనార్ధన క్షేత్రాలు వైశాఖ మాసంలో సందర్శించుట పుణ్యధాయకం. ఇక ధనుర్మాసంలో జనార్థన క్షేత్రాలు దర్శించడానికి ఆర్టీసీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.
ఎలా చేరుకోవాలి?
తూర్పు గోదావరి, కోనసీమ జిల్లా కేంద్రాలైన కాకినాడ, రాజమండ్రి నుంచి నవ జనార్థన క్షేత్రాలు చేరుకోడానికి బస్సు సౌకర్యం కలదు. ప్రత్యేకించి ధనుర్మాసంలో నాలుగు ఆదివారాలు రాజమండ్రి, కాకినాడ నుంచి “నవ జనార్ధన పారిజాత దివ్య దర్శని” పేరుతో ప్రత్యేక సర్వీసులు నిర్వహించుచున్నారు. నవగ్రహ దోషాలు పోగొట్టే ఈ నవ జనార్థన క్షేత్రాలను మనం కూడా దర్శిద్దాం. సకల దోషాల నుంచి ఉపశమనం పొందుదాం. ఓం శ్రీ జనార్థనాయ నమః
Also Read
- నవ జనార్ధనల క్షేత్రాల గురించి తెలుసా? ఒక్కసారి దర్శిస్తే సమస్త నవగ్రహ దోషాలు దూరం!
- నేటి జాతకములు..23 నవంబర్, 2025
- భగవద్గీత పుట్టిన పవిత్ర మాసం- దేవతల వరప్రసాదాల కేంద్రం- ‘మార్గశిర’ ప్రత్యేకత ఇదే!
- 2026లో లక్ష్మీ దేవి అనుగ్రహం వీరిపైనే.. కట్టలు కట్టలుగా డబ్బు సంపాదించడం ఖాయం!
- Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు




