SGSTV NEWS online
Andhra PradeshCrime

భార్య, బిడ్డను కడతేర్చిన భర్త




నరసరావుపేట రూరల్: భార్యతో పాటు ఏడు నెలల చిన్నారిని
కాలువలోకి నెట్టి కడతేర్చాడు ఓ కసాయి భర్త. ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారని డ్రామా ఆడి బంధువులు, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసులు తమదైన శైలిలో విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం కొత్తపల్లికి చెందిన కందారపు శ్రీకాంత్ కు, నాదెండ్లకు చెందిన త్రివేణికి రెండేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడు నెలల వయసుగల కుమారుడు శరత్ ఉన్నాడు. శ్రీకాంత్ పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషీయన్ గా పనిచేస్తున్నాడు.

త్రివేణి గతంలో నర్స్లో పనిచేసేది. వివాహం అనంతరం ఇంటికే పరిమితమైంది. శరత్కు అనారోగ్యంగా ఉండటంతో శుక్రవారం వైద్యం కోసం దంపతులు నరసరావుపేట తీసుకొచ్చారు. ఆస్పత్రిలో పరీక్షల అనంతరం త్రివేణి, శరత్ను బంధువులు ఇంట్లో వదిలి శ్రీకాంత్ డ్యూటీకి వెళ్లాడు. రాత్రి డ్యూటీ ముగిసిన అనంతరం 9.30 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై తమ స్వగ్రామం కొత్తపల్లికి బయలుదేరారు. ఏం జరిగిందో ఏమో కానీ త్రివేణి, శరత్ రావిపాడు సమీపంలోని ఎన్ఎస్పీ కాలువలో పడిపోయారని రాత్రి 10.30గంటల సమయంలో శ్రీకాంత్ బంధువులకు సమాచారం ఇచ్చాడు.

వారు అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టగా ఇక్కుర్రు గ్రామం వద్ద త్రివేణి మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న రూరల్ సీఐ ఎంవి సుబ్బారావు, ఎస్ఐ కిషోర్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఎదురుగా వచ్చన కారు లైటింగ్కు రోడ్డు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పిందని, నిలువరించే ప్రయత్నంలో త్రివేణి, శరత్ నీటిలో పడ్డారని శ్రీకాంత్ పోలీసులకు తెలిపాడు. త్రివేణి మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించి శ్రీకాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

కాగా త్రివేణి మృతి విషయం తెలుసుకున్న బంధువులు ఏరియా ఆస్పత్రికి వచ్చారు. శ్రీకాంతే భార్య, బిడ్డను కడతేర్చాడని ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట పల్నాడు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వచ్చి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, కాలవలో గల్లంతైన శరత్ కోసం  పోలీసులు ఇంకా గాలిస్తున్నారు.

వివాహేతర సంబంధమే కారణమా?

శ్రీకాంతు తన బంధువైన మరో అమ్మాయితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై శ్రీకాంత్, త్రివేణి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనిపై శుక్రవారం బంధువుల ఇంట్లో కూడా ఇద్దరూ ఘర్షణ పడినట్టు సమాచారం. కొత్తపల్లికి ద్విచవాహనంపై బయలుదేరిన ఇద్దరి మధ్య కాలువ వద్ద తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే త్రివేణిపై దాడిచేయడంతో పాటు, ఏడు నెలల బిడ్డతో సహా ఆమెను కాలువలోకి నెట్టి ప్రమాదం జరిగిందని శ్రీకాంత్ డ్రామా ఆడినట్టు పోలీసులు తెలిపారు.

Also Read

Related posts