June 29, 2024
SGSTV NEWS
CrimeTelangana

గోదావరిలో మునిగి తల్లీకుమారుడు మృతి



కొడుకు నీళ్లలో మునిగి కొట్టుకుపోతుంటే కాపాడాలని కన్నతల్లి చేసిన ప్రయత్నంలో ఆమె కూడా నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. అప్పటి వరకు భార్య, కుమారుడితో ఆనందంగా గడిపిన ఆ వ్యక్తి కళ్లెదుటే వారు నీళ్లలో మునిగిపోవడాన్ని చూసి అతను పడిన బాధ వర్ణనాతీతం.


దైవ దర్శనానికి వచ్చి స్నానం చేస్తుండగా ఘటన

వేలేరుపాడు, అశ్వారావుపేట : కొడుకు నీళ్లలో మునిగి కొట్టుకుపోతుంటే కాపాడాలని కన్నతల్లి చేసిన ప్రయత్నంలో ఆమె కూడా నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. అప్పటి వరకు భార్య, కుమారుడితో ఆనందంగా గడిపిన ఆ వ్యక్తి కళ్లెదుటే వారు నీళ్లలో మునిగిపోవడాన్ని చూసి అతను పడిన బాధ వర్ణనాతీతం. ఈ విషాదకర ఘటన సోమవారం వేలేరుపాడు మండలం కట్కూరులో చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం..

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని చిన్నశెట్టి బజారులో నివాసం ఉంటున్న అల్లంశెట్టి నాగేశ్వరరావు, అతని బంధువు వంటశాల వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు 11 మందితో కలిసి రెండు ఆటోల్లో కట్కూరులోని ఉమారామలింగేశ్వరాలయానికి వెళ్లారు. దైవ దర్శనం అనంతరం అందరూ కలిసి సమీపంలోని గోదావరిలో స్నానం చేసేందుకు దిగారు. ఆ సమయంలో అల్లంశెట్టి తేజశ్రీనివాస్(22) ప్రమాదవశాత్తు మునుగుతూ కొట్టుకుపోతుండటాన్ని గమనించిన తల్లి నాగమణి(45)  కుమారుడు ని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె కూడా మునిగిపోయింది. కుటుంబీకులు, బంధువులు నీళ్లలో కొట్టుకు పోతున్న వారిని కాపాడాలని యత్నించినా ఫలితం లేకపోయింది. కళ్లెదుటే భార్య, ఒక్కగానొక్క కుమారుడు నీట మునిగి గల్లంతు కావడంతో నాగేశ్వరరావు బోరున విలపించారు. వేలేరుపాడు తహసీల్దార్ చెన్నారావు, ఉప తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో శ్రీహరి, ఎస్సై లక్ష్మీనారాయణ గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి తల్లీకుమారుల మృతదేహాలను బయటకు తీయించారు.

నాగేశ్వరరావు, అతని భార్య నాగమణి తోపుడు బండిపై బత్తాయిరసం విక్రయిస్తూ జీవనం సాగించేవారు. వారి కుమారుడు తేజశ్రీనివాస్ కిరాణా దుకాణంలో గుమస్తాగా పనిచేసేవారు. నాగమణి, తేజశ్రీనివాస్ మృతితో అశ్వారావుపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Also read

Related posts

Share via