April 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Kakinada Mining: కాకినాడలో ఆగని మైనింగ్ అక్రమాలు.. ఇక కొండలు మాయమేనా..?

Kakinada Mining: ఏపీలో సర్కార్‌ మారినా వైసీపీ నేతల అక్రమాలు ఆగడం లేదా..! కాకినాడ జిల్లాలోని ఆ మూడు నియోజకవర్గాల్లో మైనింగ్ వ్యాపారంతో నేతలు కోట్లు వెనకేసుకుంటున్నారా..! పట్టపగలే గ్రావెల్‌ రవాణా జరుగుతున్న అధికార పార్టీ నేతలు చూసి చూడనట్టు వదిలేస్తున్నారా..! అటు మైనింగ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని ఆరోపణలు వస్తున్నాయా
Kakinada Mining: ఏపీలో సర్కార్‌ మారినా వైసీపీ నేతల అక్రమాలు ఆగడం లేదా..! కాకినాడ జిల్లాలోని ఆ మూడు నియోజకవర్గాల్లో మైనింగ్ వ్యాపారంతో నేతలు కోట్లు వెనకేసుకుంటున్నారా..! పట్టపగలే గ్రావెల్‌ రవాణా జరుగుతున్న అధికార పార్టీ నేతలు చూసి చూడనట్టు వదిలేస్తున్నారా..! అటు మైనింగ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని ఆరోపణలు వస్తున్నాయా..!

Kakinada Mining: కాకినాడ జిల్లాలోని పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడుకు మెట్ట ప్రాంతంగా మంచి గుర్తింపు ఉంది. ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో పెద్ద ఎత్తున కొండలు ఉన్నాయి. ముఖ్యంగా పత్తిపాడు నియోజవర్గ పరిధిలోని వంతాడ మైనింగ్ దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. అప్పట్లో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీటిపై పోరాటాలు చేశారు. వారు ప్రభుత్వంలోకి వచ్చాక వాటి వైపు చూడడం మానేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. స్థానిక వైసీపీ నేతలు ఎత్తైన కొండలను పిండి చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిన వైసీపీ నేతల మైనింగ్ వ్యాపారం మాత్రం ఆగడం లేదు.. ప్రస్తుతం ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా వరుపుల సత్య ప్రభ ఉన్నారు. ఆమె రాజకీయాలకు కొత్త. ఇలాంటి విషయాలు తెలియదు.

దీంతో రాజమండ్రికి చెందిన కొందరు వైసీపీ నాయకులు వంతాడలో మైనింగ్ చేస్తూ కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కూటమి నాయకులను కూడా ఇక్కడ లెక్కచేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. మహిళా ఎమ్మెల్యే  కావడంతో ఆమె ఇలాంటి విషయంలో జోక్యం చేసుకోవడం లేదని కార్యకర్తలు చెబుతున్నారు. ఇది అక్రమార్కులకు పెద్ద వరంగా మారింది. రాత్రి, పగలు కొండలు తవ్వేసి  తీసుకుపోతున్నారు. మైనింగ్ అధికారులు మాత్రం పూర్తిగా మామూళ్ళు తీసుకుని వదిలేస్తున్నారని సాక్షాత్తు టీడీపీ నాయకులే ఆరోపిస్తున్నారు.


ఇక పెద్దాపురంలో గతంలో వైసిపి ఇంచార్జ్ దొరబాబు పెద్ద ఎత్తున కొండలు తవ్వేసాశారని ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తవ్వకాలపై పోరాటం చేశారు. కానీ ఇప్పుడు చినరాజప్ప తనయుడు, అతని సన్నిహితులు కలిపి ఈ కొండలు తవ్వేస్తున్నట్లు వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. కాకినాడ రూరల్ కు చెందిన కొందరు టీడీపీ నాయకులు కూడా తాము లీజుకి తీసుకున్న కొండల్లో రాజప్ప తనయుడు మైనింగ్ చేస్తున్నాడని సాక్షాత్తు బహిరంగంగా ఆరోపించారు. పెద్దాపురంలో ప్రతిరోజు కొండల్ని తొలిచేస్తున్నారు. అయినా పట్టించుకునే నాధుడు కరువయ్యాడనే టాక్ వినిపిస్తోంది

అటు మైనింగ్ భారీగా జరిగే ప్రాంతం జగ్గంపేట గుర్తింపు సాధించింది. అక్కడ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తనయుడు నవీన్ జడ్పీ చైర్మన్‌గా పనిచేసి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. తాను పేరుకే ఎమ్మెల్యేని. అంతా తన కుమారుడే చూసుకుంటాడని సాక్షాత్తు మీడియా సమావేసంలోనే నెహ్రూ చెప్పారు. అయితే నెహ్రూ స్వగ్రామానికి దగ్గరగా ఉన్న మామిడిలో పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతోంది. వందల సంఖ్యలో టిప్పర్లు గ్రావెల్‌ను తరలించుకుపోతున్నాయి. ఈ విషయం ఎమ్మెల్యేకు కూడా తెలుసు అని స్థానికులు చెబుతున్నారు. అయినా పట్టించుకోవడం లేదు. గతంలో రాజప్ప, నెహ్రూలు  వైసీపీపై పెద్ద ఎత్తున మైనింగ్ దోపిడీ అంటూ ఆరోపణలు చేశారు. రాజప్ప అయితే తన ప్రత్యర్ధిగా ఉన్న చంటిబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి జగ్గంపేట వచ్చి చంటిబాబును టార్గెట్ చేసి మైనింగ్ అక్రమాల గురించి ప్రస్తావించారు. ప్రభుత్వం మారింది. కూటమి అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ ఈ మూడు ప్రాంతాల్లో మాత్రం యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతోంది. గ్రావెల్, ఎర్రమట్టి తరలించకుపోతున్నారు. మరోవైపు పెద్దాపురంలో ఇసుక స్టాక్ పాయింట్ లో ఇసుక కూడా మాయమైందని స్థానికులు ఆరోపించారు. ఇక్కడ టిడిపి జనసేన దొందూ దొందే అన్న విధంగా వ్యవహరిస్తున్నాయని రెండు పార్టీల నాయకులు అంగీకరిస్తున్నారు. ఎటొచ్చీ ఈ మూడు నియోజకవర్గాల్లో ఇలాంటి వ్యవహారాలకు బిజెపి దూరంగా ఉంటోంది. ప్రతిపాడులో మహిళా ఎమ్మెల్యే కూడా దూరంగా ఉంటున్నారు. మిగిలిన రెండు చోట్ల ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా రాజప్ప తనయుడి పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికీ ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతోందని టిడిపి నాయకులే చెబుతున్నారు.

ఇక ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పుణ్యమా అని జిల్లాలో అక్రమ పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా తగ్గిపోయింది. బియ్యం దోపిడీకి పవన్‌ కల్యాణ్ రూపంలో అడ్డుకట్ట పడింది. ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమైందని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. కాకినాడ జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యత వహిస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా పురపాలక శాఖమంత్రి నారాయణ ఉన్నారు. నారాయణ మెతకమనిషి. ఆయన ఎప్పటికీ పూర్తిస్థాయిలో జిల్లాపై దృష్టి పెట్టలేదు. పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి అక్రమంగా మైనింగ్ చేస్తున్నవారు, ఇసుక దోపిడీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు దశాబ్దాల నుంచి ఆరోపణలు వస్తున్న వంతాడ మైనింగ్ పై కూడా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు

మొత్తంమీద పవన్ జోక్యం చేసుకుంటూనే అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట పడుతుందని కాకినాడలో టాక్‌ వినిపిస్తోంది. లేనిపక్షంలో ఈ దోపిడీ ఇలాగే కొనసాగుతుందని స్థానికులు చెబుతున్నారు. అయితే యాదృచ్ఛికంగా ఈ మూడు నియోజకవర్గాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ కంటే ముందు చంద్రబాబు, లోకేష్ స్పందిస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. మొత్తంగా ప్రత్తిపాడు మినహా రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సీనియర్లు. గతంలో వారు మైనింగ్ పై ఆరోపణలు చేసిన వారే. దాంతో ఈ అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చేత దర్యాప్తు జరిపించాలని ప్రజలు కోరుతున్నారు

Also Read

Related posts

Share via