April 16, 2025
SGSTV NEWS
Spiritualమాఘ పురాణం

మాఘ పురాణం – 8
8వ అధ్యాయము – దత్తత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచుచుట


మాఘ పురాణం – 8
8వ అధ్యాయము – దత్తత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచుచుట

దత్తత్రేయుడు బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినాదు. అతడు కూడ లోక కళ్యాణముకొరకు ఘనకార్యములు చేసినాడు, త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తత్రేయుని కాలములో కార్తవీర్యర్జునుడను క్షత్రియ వీరుడు ‘మాహిష్మతీ యను నగరమును రాజధానిగా జేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తత్రేయులు, ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి  నమస్కరించి “గురువర్యా! మీ అనుగ్రహమువలన అనేక విషయాలు తెలుసుకొని వుంటిని, కాని మాఘమాసము యొక్క మహత్మ్యమును వినియుండలేదు. కావున, మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను, అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను.

“భూపాలా! భరతఖండములోనున్న పుణ్యనదులకు సమనమైన నదులు ప్రపంచమండెచ్చటనూలేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్కరాశి యందున్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దానధర్మములచరించిన యెడల దానివలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడ సాధ్యము కాదు. అందునా మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్పఫలితము కలుగుటయేకాక జన్మరాహిత్యము కూడ కలుగును. గనుక, యే మానవుడైననూ మాఘమాసములో సూర్యుడు మకర రాశియందుండగా మాఘస్నానముచేసి, ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో పంచమహపాతకములు చేసినవాడైనను ముక్తి పొందగలడు”, అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి యింకనూ యీవిధముగా చెప్పుచున్నాడు. “పూర్వకాలమున గంగానదీతీరపు ఉత్తరభాగమున భాగ్యపురమను పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరులువలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుదు, బంగారునగలు, నాణేములు రాసులకొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను, తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని, యిష్టమువచ్చినటుల పాడు చేయుచుండిరి. ఇద్దరు చెరొక ఉంపుడుకత్తెనూ జేరదీసి, కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటివెంట నురుగలు గ్రక్కుచూ చనిపోయినాడు, ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి, పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవవానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తునితో యిలా అన్నాడు.

“అయ్యా! మేమిద్దరమూ ఒకేతండ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒక విధముగానే పాపములు చేసియున్నాము. అయినా అతనికి నరకమును, నాకు స్వర్గమును యేల ప్రాప్తించును” అని అడిగెను. ఆ మాటలకు చిత్రగుప్తుడు ” ఓయీ వైశ్యపుత్రా! నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము యామెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని యింటికి  వెళ్ళి వచ్చుచుండెడివాడవు. అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాలజల్లులు నీశిరస్సుపై పడినవి. అందు వలన నీవు పవిత్రుడవైనావు మరొక విష్యమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు, ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడ నశించును. కాన విప్రుని చూచుటవలన నీకు మంచిఫలితమే కలిగినది. అదియ్తునుకాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును  కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరము మీదపడినది. గనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను” అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా! ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా” అని వైశ్యకుమారుడు సంతసించి, దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను

Related posts

Share via