Lord Ganapati: ఇంట్లో కానీ గుడిలో కానీ మరెక్కడైనా కానీ ఏవైనా పూజలు వ్రతాలు, నోములు హోమాలు, జపాలు, యాగాలు ఏవి చేసినా మొదట గణపతిని పూజిస్తారు. గణపతి పూజతోనే ఏ పూజైనా, నోమైనా, వ్రతమైనా, పండగైనా జరపుకుంటారు. ఎందుకు ఫస్ట్ గణపతినే పూజిస్తారు.
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఏ శుభకార్యం ప్రారంభించినా, ఏ పూజ చేసినా మొదట వినాయకుడిని పూజించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు పండితులు.
గణపతికి శివుడు ఇచ్చిన వరం: పురాణాల ప్రకారం, వినాయకుడు తన బుద్ధి బలంతో తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేసి ముల్లోకాలను చుట్టిన ఫలితాన్ని పొందుతాడట. ఆ సందర్భంగా శివుడు వినాయకుడికి ఒక విశిష్టమైన వరాన్ని ఇస్తాడట. అదే దేవతలకు సంబంధించి ఏ పూజలు, యజ్ఞయాగాదులు జరిగినా ఏ వ్యక్తి ఏ కార్యాన్ని తలపెట్టినా అది నిర్విఘ్నంగా (అడ్డంకులు లేకుండా) పూర్తి కావాలంటే మొదట గణపతినే పూజించాలి అని పరమశివుడు వరమిచ్చాడట. అందుకే ఆయనను ప్రథమ పూజ్యుడు అంటారట.
విఘ్నేశ్వరుడు (అడ్డంకులను తొలగించేవాడు):
వినాయకుడికి విఘ్నేశ్వరుడు అనే పేరు ఉంది. అంటే అడ్డంకులకు (విఘ్నాలకు) అధిపతి అని అర్థం వస్తుంది. ఎవరైనా ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అందులో ఆటంకాలు రాకూడదని కోరుకుంటారు. అలాగే విఘ్నేశ్వరుడిని పూజిస్తే ఆయన ఆ పనిలో వచ్చే అడ్డంకులను తొలగించి, కార్యాన్ని విజయవంతం చేస్తాడని నమ్మకమట.
గణపతి ఓంకార స్వరూపం: వినాయకుడి రూపం ప్రణవ నాదం అయిన ఓంకారాన్ని పోలి ఉంటుందట. ఓం అనేది సృష్టికి మూలం. ఏ మంత్రమైనా ఓంకారంతోనే మొదలవుతుంది. అందుకే ఓంకార స్వరూపుడైన గణపతిని పూజించిన తర్వాతే ఇతర పూజలు నిర్వహించాలని శాస్త్రాలు సూచిస్తున్నాయట.
గణపతి అంటే గణాలకి అధిపతి: సృష్టిలోని సమస్త జీవరాశులు, శక్తులు వివిధ గణాల రూపంలో ఉంటాయి. వీటన్నిటికీ నాయకుడు.. గణపతి. మనం చేసే పూజ లేదా పని ప్రకృతిలోని అన్ని శక్తుల సహకారంతో సాగాలంటే, ఆ శక్తుల అధిపతి అయిన గణపతి అనుమతి మరియు ఆశీస్సులు అవసరమని పండితులు సూచిస్తున్నారు.
మూలాధార చక్రం: యోగ శాస్త్రం ప్రకారం, మనిషి శరీరంలోని వెన్నెముక మొదట్లో ఉండే మూలాధార చక్రం వద్ద గణపతి కొలువై ఉంటాడట. మనం ఆధ్యాత్మికంగా లేదా లౌకికంగా ఏదైనా సాధించాలంటే ముందుగా ఈ చక్రం జాగృతం కావాలి. అందుకే ఏ పూజ చేసినా ప్రాథమికంగా గణపతిని స్మరించడం ఒక సంప్రదాయంగా వస్తుందని చెప్తున్నారు పండితులు
ఇక వినాయకుడు బుద్ధికి, జ్ఞానానికి, విజయానికి సంకేతమట. అందుకే మన ఆలోచనలు సక్రమంగా ఉండటానికి, మనం చేసే పని సఫలం కావడానికి శుక్లాంబరధరం విష్ణుం అంటూ ఆ విఘ్నరాజును మొక్కుకుని పనిని ప్రారంభించలని పండితులు సూచిస్తున్నారు.
