ఆశ్వీయుజ మాసంలో వచ్చే పౌర్ణమే కోజాగరి పౌర్ణమి – లక్ష్మి దేవి ఈ విధంగా పూజిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం
Kojagara Puja 2024 : జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉంటే అన్ని ఉన్నట్లే అని పెద్దలంటారు. అందుకే ‘ధనమ్ మూలం ఇదం జగత్’ అనే సూక్తి కూడా వచ్చింది. శుక్రవారం సిరుల తల్లి లక్ష్మీదేవిని ఆరాధించడం హిందూ సంప్రదాయం. అలాగే పౌర్ణమి రోజు చేసే లక్ష్మీ ఆరాధన అఖండ ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని శాస్త్రవచనం. అందునా శరత్కాల పున్నమి మరీ విశేషమైనది. ఈ సందర్భంగా కోజాగరి పౌర్ణమి అంటే ఏమిటి? శరత్ పున్నమికి దానికి ఏమిటి సంబంధం అనే ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
కోజాగరి పౌర్ణమి అంటే
తెలుగు పంచాంగం ప్రకారం ఒక సంవత్సరంలో 12 పున్నములు వస్తాయి. దేనికదే విశేషమైనది. పౌర్ణమి రోజు శ్రీ మహా లక్ష్మీదేవిని పూజిస్తే సంపదలకు లోటుండదని శాస్త్ర వచనం. నిండు పౌర్ణమి లక్ష్మీదేవికి ప్రియమైనవి. ముఖ్యంగా శరత్ ఋతువులో వచ్చే ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి అమ్మవారి ఆరాధనకు విశిష్టమైనదని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమినే కోజాగరి పౌర్ణమి అంటారు.
కోజాగరి పౌర్ణమి ఎప్పుడు
ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమను కోజాగరి పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 16న ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమిని కోజాగరి పౌర్ణమిగా జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈరోజు ఉదయం 7- 9 గంటల వరకు, సాయంత్రం 6 – 8 గంటల వరకు పూజకు శుభసమయం.
పూజా విధానం
బమ్మెర పోతన రచించిన శ్రీమద్భాగవతంలో వివరించిన ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కోజాగరి పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ఇలా పూజించాలి. లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన వ్రతం, దారిద్య్ర వినాశక వ్రతం “కోజాగిరి వ్రతం”. ఈ రోజున ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి శుచియై ఇంట్లో తూర్పు దిక్కున లక్ష్మీదేవి పూజా మంటపం ఏర్పాటు చేయాలి. లక్ష్మీదేవి ప్రతిమను లేదా చిత్రపటాన్ని గంధం కుంకుమలతో అలంకరించాలి. ఆవు నేతితో దీపారాధన చేయాలి. ముందుగా విఘ్నేశ్వర పూజ పూర్తి చేసి, అనంతరం లక్ష్మీదేవిని ఆవాహన చేయాలి. సువాసన కలిగిన సాంబ్రాణి ధూపాన్ని ఇల్లంతా వేయాలి. భక్తి శ్రద్ధలతో శ్రీలక్ష్మీదేవిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. అనంతరం కనకధారా స్తోత్రం చదువుకోవాలి. తేనె కలిపిన పచ్చిపాలు, ఏలకులు, పచ్చ కర్పూరం కలిపిన పరమాన్నం, పులిహోర అమ్మవారికి నివేదించాలి. ఈ రోజంతా ఉపవాసముండాలి.
సాయంత్రం పూజ
సాయంత్రం తిరిగి స్నానం చేసి యధావిధిగా పూజ పూర్తి చేసుకుని చంద్ర దర్శనం కోసం ఎదురు చూడాలి. ఈ రోజు రాత్రి పూర్ణ చంద్రుడు ప్రకాశిస్తున్న సమయంలో లక్షీ దేవి ఆకాశమార్గంలో తిరుగుతూ ఎవరైతే ఉపవాసముండి తనని పూజిస్తారో వారికి అష్టఐశ్వర్యాలు ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ రోజు దేవాలయాలలో, ఇళ్లల్లో రాత్రి వేళ ముందుగా పాలల్లో చంద్రుడుని చూసి తర్వాత ఆ పాలను ప్రసాదంగా స్వీకరిస్తారు. పూజ పూర్తయ్యాక కోజాగరి పౌర్ణమి వ్రత కథను చదువుకుంటారు. అనంతరం పున్నమి కాంతులలో కన్యలు, మహిళలు నృత్యగానాలు చేస్తారు. బెంగాల్, ఒడిశా వంటి కొన్ని ప్రాంతాల్లో జాగారం ఉన్నవారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని ఈ రాత్రంతా జాగారం కూడా చేస్తారు. ఆశ్వయుజ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి, ఆ రాత్రి జాగరణ చేస్తూ, పాచికలు ఆడేవారికి సర్వసంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రాత్రి పాచికలు ఆడటం వ్రత నియమాలలో ఒక భాగం.
భారతదేశం మొత్తం ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో జరుపుకునే ఈ శరత్ పున్నమి రోజు కోజాగరి పౌర్ణమి వ్రతాన్ని మనమందరం కూడా జరుపుకుందాం దారిద్ర నాశిని అయిన ఆ శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొందుదాం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః