SGSTV NEWS
Hindu Temple HistorySpiritual

Karimnagar Temple: తెలంగాణలోని ఆ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న దీపం, నిజంగా అద్భుతం!



ఆలయాల్లో నిత్యం పూజలు, దీపారాధనలు జరగడం హిందూ సంప్రదాయంలో సాధారణమే. కానీ కొన్ని ఆలయాల్లో జరిగే ఆచారాలు, అచంచల విశ్వాసాలు మాత్రం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి విశేష ఆలయాల్లోకే తెలంగాణలోని కరీంనగర్ జిల్లా గంభీరావుపేటలో ఉన్న శ్రీ సీతారామస్వామి దేవాలయం ఒకటి. ఇక్కడ ఉన్నది 700 సంవత్సరాలుగా వెలుగుతోన్న ఒక అఖండ నందదీపం. ఈ దీపం వెనుక ఉన్న చరిత్ర, మిస్టరీ, భక్తుల విశ్వాసం… ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

గంభీరావుపేట మండల కేంద్రంలో ఉన్న ఈ ప్రాచీన సీతారామ ఆలయం 1314లో కాకతీయ రాజవంశానికి చెందిన చివరి రాజైన ప్రతాపరుద్రుడు నిర్మించినదిగా శిలాశాసన ఆధారాల ద్వారా తెలుస్తోంది. అప్పటి కాలంలో నిర్మించిన ఆలయంలో ఆ సమయంలో వెలిగించిన నందదీపం, అదే దీపం, 700 ఏళ్లుగా అర్ధరాత్రి అయినా, వర్షం వచ్చినా, ఎండ తట్టినా ఆరిపోకుండా వెలుగుతూనే ఉంది. దీపం వెలుగుతో ఈ ఆలయం భక్తుల నమ్మకానికి ప్రతీకగా మారింది. నిత్యం ఆ దీపాన్ని దర్శించడానికి భక్తులు వస్తుంటారు. దేవాలయం పక్కనే ఉన్న ప్రత్యేక గర్భగృహంలో ఈ నందదీపం ఉంటూ, దీని వెలుగుతో ఆలయం ఆధ్యాత్మికంగా వెలుగుతూ ఉంటుంది.

ఇంతకాలంగా దీపం ఆరిపోకుండా ఉండడంలో రాజుల త్యాగం, గ్రామస్తుల శ్రద్ధ ప్రధాన కారణాలు. అప్పట్లో కాకతీయ రాజులు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల్లో కొంత మొత్తాన్ని ప్రత్యేకంగా ఈ దీప నూనె కోసం ఖర్చు చేసేవారని స్థల పురాణం చెబుతుంది. రాజవంశం అంతరించిన తర్వాతనూ, గ్రామస్తులే దీపానికి అవసరమైన నూనెని దాతృత్వంగా సమకూర్చుతుంటారు. ప్రస్తుతం అయిత రాములు, ఆయన భార్య ప్రమీల అనే దంపతులు ఈ సేవను తమ జీవితకాలం పాటు కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశారు. ఇది కేవలం భక్తి కాదు… ఆ ప్రాంత ప్రజల విశ్వాసానికి, వారి సంస్కృతికి నిలువెత్తు ఉదాహరణ.

ఈ నందదీపాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సమయంలో ఆలయానికి తరలివస్తారు. శ్రీ సీతారాముల కల్యాణాన్ని భారీగా జరుపుకుంటారు. ఆలయం ఎదురుగా ఉన్న రాతి శిల్ప కళతో నిర్మితమైన 16 స్తంభాల కల్యాణ మండపం ఈ ఉత్సవాలకు సాక్షిగా నిలుస్తుంది. ఈ దీపం కేవలం వెలుగు కాదు……… అది స్థానికుల విశ్వాసం, సంప్రదాయం, దైవ సాన్నిధ్యానికి చిహ్నం. ఆ దీపాన్ని ఓసారి చూసినవారిలో ఎంతో శాంతి, ఆధ్యాత్మికమైన భావనలు ఏర్పడతాయి. దీన్ని చూసిన వారు తమ కోరికలు తీర్చుకుంటారని నమ్ముతారు. అలాగే, దీపం వెలుగుతో గ్రామంలో మంచి వర్షాలు పడతాయని, పంటలు పండుతాయని, ప్రజల జీవితాల్లో సంతోషం వెల్లివిరుస్తుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. 700 ఏళ్లుగా వెలుగుతోన్న ఈ నందదీపం ఒక ఆలయ విశేషమే కాదు… అది ఒక చరిత్ర, ఒక నమ్మకం, ఒక జీవితం. మనం ఎంత ఆధునికమైనా, కళ్లతో చూస్తున్నా, మనస్సు నమ్మలేని రహస్యాలు కొన్ని శాస్త్రానికి వెలుపలే ఉంటాయి. ఈ నందదీపం అచ్చం అలాంటి మిస్టరీనే అనే చెప్పాలి.



Related posts

Share this