ఇంద్రుడు కోల్పోయిన తన రాజ్యాన్ని తిరిగి పొందిన క్షేత్రం- అశ్వత్థామ కూడా ఇక్కడే విముక్తి పొందాడా? ఈ క్షేత్రంలో నిద్రిస్తే జీవితంలో మారే అద్భుతం ఏమిటో మీకు తెలుసా?
కామాక్షి అనగానే అందరికీ ముందుగా కంచి గుర్తుకు వస్తుంది. కానీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సమీపంలోని జొన్నవాడ గ్రామంలో స్వయంభువుగా వెలసిన కామాక్షితాయి భక్తుల పాలిట కల్పవల్లి. ఈ తల్లిని ఆశ్రయిస్తే సమస్త కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఈ కథనంలో జొన్నవాడ కామాక్షితాయి క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.
జొన్నవాడ కామాక్షితాయి ఆలయం ఎక్కడుంది?
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం మండలం జొన్నవాడ గ్రామంలో పెన్నానది తీరంలో కామాక్షి అమ్మవారు కొలువుతీరి ఉన్నారు. 1150లో నిర్మించిన ఈ ఆలయంలో కామాక్షితాయితో పాటు శ్రీ మల్లికార్జున స్వామి కూడా కొలువై ఉన్నారు. జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు ఇక్కడ “శ్రీచక్రం” ప్రతిష్ఠించారని ఆలయ స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. అలాగే కామాక్షిదేవి సన్నిధిలో భక్తులు తమ సమస్యలను విన్నవించుకుని, ఆలయంలో నిద్రిస్తే వారి సమస్యలు తీరిపోతాయని విశ్వాసం.

ఆలయ స్థల పురాణం
పూర్వం కశ్యప ముని లోక కళ్యాణం కోసం పౌండరీక యాగం నిర్వహించదలచాడు. అందుకు తగిన ప్రదేశం కోసం వెతుక సాగాడు. ఈ క్రమంలో పినాకినీ నదీ తీరం చేరుకుని ఈ ప్రదేశం యాగానికి సరైనదని భావించాడు. అక్కడే తూర్పు, నైరుతి, వాయవ్యాల్లో యాగకుండాలను స్థాపించి యాగాన్ని పూర్తి చేశాడు.
యాగకుండం నుంచి నరసింహుని ఆవిర్భావం
నైరుతి దిశలో ఏర్పాటు చేసిన యాగ కుండం నుంచి శ్రీ లక్ష్మీ సమేతుడైన నరసింహ స్వామి ఆవిర్భవించి వేదగిరిలో కొలువై ఉన్నాడు. జొన్నవాడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో వేదగిరి పుణ్యక్షేత్రం ఉంది.
లింగాకారంలో శివుడు
వాయువ్యాన ఉన్న యోగ కుండం నుంచి పరమ శివుడు లింగాకారంలో ఆవిర్భవించాడు. ఈ యుగ వాటికను రజతగిరి అని పిలిచే వారు అదే కాలక్రమేణా జొన్నవాడగా ప్రసిద్ధి చెందింది.
కామాక్షిగా పార్వతి
ఇక కైలాసంలో శివుడు కనబడక పోవడంతో పార్వతి కంగారు పడింది. తన మనో నేత్రంతో జరిగినది తెలుసుకొని శివుడు ఉన్న చోటే తనకు కైలాసమని పేర్కొంటూ ఈ జొన్నవాడకు వచ్చి కామాక్షిగా కొలువై ఉందని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది.
ఉగ్రస్వరూపిణిగా కామాక్షి
ఇక్కడ అమ్మవారు తొలుత ఉగ్రస్వరూపిణిగా ఉండేది. అయితే కొంతకాలం తరువాత జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు ఈ విషయం తెలుసుకుని జొన్నవాడ వచ్చి ఒక రాత్రి దేవాలయంలో పడుకొంటాడు. అర్థరాత్రి ఉగ్రస్వరూపంతో బయటకు వెళ్తున్న అమ్మవారిని ఆపి అనేక విధములుగా ప్రార్ధించి శాంతింపజేస్తాడు.
శ్రీచక్ర ప్రతిష్ఠాపన
అటుపై ఆదిశంకరులు తన శక్తినంతటినీ ధారపోసి శ్రీ చక్రాన్ని అమ్మవారి పాదాల చెంత ప్రతిష్ఠిస్తారు. అమ్మవారిని తన ఉగ్ర స్వరూపాన్ని విడిచి భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా జొన్నవాడలోనే వెలసి ఉండాలని వరం కోరుతాడు. అప్పటి నుంచి అమ్మవారు కామాక్షితాయిగా పూజలందుకుంటోంది. ‘తాయి’ అంటే ద్రావిడ భాషలో ‘తల్లి’ అని అర్ధం. ఆనాటి నుంచి జొన్నవాడ కామాక్షిదేవిని తల్లిగా భావించి పూజలు జరపడం సంప్రదాయం మారింది.
ఆలయ విశేషాలు
కామాక్షి దేవి ఆలయంలోపలికి ప్రవేశించగానే ముందు ఎడమవైపు ఉన్న మార్గంలో వెళితే పినాకిని నదికి చేరుకోవచ్చు. ఆలయ ప్రవేశ ద్వారంలో దేవి కామాక్షి సన్నిధి వైపు వెళ్లే మార్గంలో రెండు వైపులా శూలాన్ని చేతబూనిన ద్వారపాలకులు దర్శనమిస్తారు. లోపల ఉన్న విశాలమైన లోగిలి దాటి ముందుకు వెళ్తే కల్యాణ మండపం కనిపిస్తుంది. కల్యాణ మండపానికి కుడివైపు కామాక్షి దేవి గర్భ గుడికి వెళ్లే దారిలో బలిపీఠం, ధ్వజస్తంభం ఉంటాయి. ధ్వజస్తంభం ముందు ఒక పెద్ద నంది, దాని పక్కనే చిన్న నంది ఉంటాయి. లోపలికి వెళ్లగానే అర్ధమండపంలో చాలా స్తంభాలుంటాయి.
ఉపాలయాలు
గర్భాలయంలో మొదటగా లక్ష్మీ గణపతి, ఎడమవైపు చిన్న మహాలక్ష్మి విగ్రహం ఉంటాయి. మరో చిన్న గర్భగుడిలో మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు. అమ్మవారికి కుడి వైపున ఉన్న గర్భగుడిలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు.
అపురూపం కామాక్షి దేవి దర్శనం
సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దాటగానే అఖిల జగత్తును కాపాడే కామాక్షిదేవి ఈ క్షేత్రంలో నిల్చున్న భంగిమలో దర్శనమిస్తుంది. చిరునవ్వుతో ఉన్న ముఖారవిందం, కరుణ భరితమైన నయనాలతో, సర్వాలంకారాలతో దర్శనిమిస్తుంది. నాలుగు హస్తాలతో ఉన్న అఖిలాండేశ్వరి పై రెండు చేతుల్లో అంకుశం, పాశం ఉంటాయి. కింది రెండు చేతుల్లో ఒకటి అభయ హస్తంగాను, మరొకటి శరణాగతి పొందమని చూపినట్లు ఉంటాయి. ఆ తల్లిని చూడడానికి రెండు కళ్లు చాలవు. ఆ దేవి ఎదుటనే శ్రీ చక్రం స్థాపించిన ఆదిశంకరులు చేతిలో దండంతో దర్శనమిస్తాడు.
మానసిక ప్రశాంతత
ఈ క్షేత్ర దర్శనానంతరం బయటికి వచ్చేటప్పుడు మానసికంగా ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆలయంలో ఒక్కరాత్రి నిద్రిస్తే అన్ని రకాల సమస్యలు నుంచి ఉపశమనం పొందుతారని విశ్వాసం. అందుకే జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో నిద్ర చేయడానికే భక్తులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. అంతేకాదు సంతానం లేనివారు ఈ ఆలయంలో ఒక్కరోజు నిద్రిస్తే సత్సంతానం కలుగుతుందని విశ్వాసం.
పూజోత్సవాలు
ప్రతి శుక్రవారం అమ్మవారి సన్నిధికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని కుంకుమ పూజలు, నిమ్మకాయ దీపాలు వంటి క్రతువులు జరపడం విశేషం.
నవావరణ పూజ
ప్రపంచంలో ఏ ఆలయంలోనూ జరగని నవావరణ పూజ ఇక్కడ జరుగుతుంది. ఈ పూజకి ఎంతో శక్తి ఉందని భక్తుల నమ్మకం. అందుకే ఈ పూజ జరిపించుకోవడానికి ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా వస్తుంటారు.
శివ సహస్రనామ పూజ
జొన్నవాడలో వెలసిన మల్లిఖార్జునస్వామికి జరిపే సహస్రనామం కూడా మరే దేవాలయంలోనూ జరపరు. సాక్షాత్తు వేదవ్యాసుడు ఈ దేవాలయంలో పూజారులకు దర్శనమిచ్చి వేదాల్లోని సారమంతా క్రోడీకరించి ఈ సహస్రనామాలను ఉపదేశించాడని ప్రతీతి. అందుకే ఈ సహస్రనామ పూజ వల్ల నాలుగు వేదములు పారాయణం చేసినంత ఫలితం ఉంటుంది. అయితే ఇక్కడి అర్చకులకు మాత్రమే ఆ సహస్రనామ విధానం తెలుసు. వంశపారంపర్యంగా మాత్రమే ఈ విద్య ఒకరి నుంచి మరొకరికి వస్తోంది. వీరు ఇతరులకు ఈ సహస్రనామం చెప్పరు. అంతేకాదు ఏ గ్రంథంలో ఈ సహస్రనామం వ్రాసి లేదు.
కోల్పోయిన పదవి పొందిన ఇంద్రుడు
ద్వాపర యుగంలో ఇంద్రుడు వశపర్వుడనే రాక్షసుడి వల్ల తన పదవిని కోల్పోతాడు. తరువాత నారదుడి సూచన మేరకు ఇంద్రుడు ఈ క్షేత్రంలో అమ్మవారిని సందర్శించి ఆమె చల్లని చూపుతో తిరిగి ఇంద్ర పదవిని పొందుతాడు.
కుష్టు వ్యాధి పోగొట్టుకున్న అశ్వత్థామ
ఒకానొకసారి అశ్వత్థామకు కుష్టు వ్యాధి సోకగా జొన్నవాడ కామాక్షమ్మ సన్నిధిలోని పెన్నా నదిలో స్నానం చేసి అమ్మవారిని సేవించడంతో కుష్టు వ్యాధి నుంచి విముక్తి పొందాడని చెబుతారు. భక్తితో తనను సేవించిన వారి కోర్కెలను అమ్మవారు తప్పక తీరుస్తారని స్థానికులు చెబుతారు.
ఎలా చేరుకోవాలి?
దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి నెల్లూరుకు చేరుకోడానికి రైలు, బస్సు సౌకర్యాలున్నాయి. నెల్లూరు నుంచి జొన్నవాడకు చేరుకోడానికి బస్సులు, ఆటోలు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్నాయి. పిలిస్తే పలికే చల్లని తల్లి కామాక్షమ్మ దర్శనంతో తీరని కోరికంటూ ఉండదు.
ఓం శ్రీ కామాక్షిదేవ్యై నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
