శ్రీ మద్ది ఆంజనేయస్వామి దేవస్థానం గురవాయిగూడెం
ఆంజనేయస్వామి అనగానే అందరికీ భయాలు పోయి ఎక్కడలేని ధైర్యమూ వస్తుందికదా. భయం వేసే సమయంలో ఆయనని తలుచుకోని వారుండరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా చిన్న పిల్లలకి ఆయన ఆరాధ్య దైవము. భక్తులకీ భగవంతునికీ అవినాభావ సంబంధం వుంటుంది. కొందరు భక్తులు భగవంతునికి సేవచేసి తరిస్తే, భగవంతుడు కొందరి భక్తులకు సేవ చేసి వారిని తరింపచేస్తాడు.
ఆ రెండో కోవకి చెందిన భగవంతుడు, భక్తుడు, వారు వెలసిన క్షేత్రంగురించి ఈ రోజు తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెం మండలం, గురవాయి గూడెం ఊళ్ళో వున్నది ఈ ఆంజనేయస్వామి ఆలయం. ప్రతి నిత్యం భక్త జన సమూహాలతో కళ కళలాడే ఈ సుప్రసిధ్ధ క్షేత్రం ఎఱ్ఱకాలవ ఒడ్డున వున్నది.
తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువుడై వెలసిన స్వామి చరిత్ర గర్గ సంహిత, పద్మ పురాణము, శ్రీ రామాయణములలో చెప్పబడింది. ఆ కధేమిటంటే త్రేతాయుగంలో రావణాసురుడి సైన్యంలో మధ్వాసురుడనే రాక్షసుడు వుండేవాడు. ఆయన జన్మతో రాక్షసుడైనా రాక్షస ప్రవృత్తిలేక ఆధ్యాత్మకి చింతనతో వుండేవాడుట.
రామ రావణ యుధ్ధంలో శ్రీరామచంద్రుని వైపు పోరాడుతున్న హనుమంతుణ్ణి చూసి భక్తి పారవశ్యంతో అస్త్ర సన్యాసం చేసి హనుమా, హనుమా అంటూ తనువు చాలించాడు. తర్వాత ద్వాపరయుగంలో మధ్వికుడుగా జన్మించాడు.
అప్పుడుకూడా సదాచార సంపన్నుడై, సద్భక్తితో జీవితం గడిపేవాడు. ఆ సమయంలో వచ్చిన కురు పాండవ యుధ్ధంలో కౌరవుల పక్షాన పోరాడుతూ, అర్జనుని జెండాపైన వున్న పవనసుతుని చూసి, పూర్వజన్మ స్మృతితో ప్రాణ త్యాగం చేశాడు. తర్వాత కలియుగంలో మధ్వుడిగా జన్మించాడు.
ఆంజనేయస్వామి గురించి తపస్సు చేసుకుంటూ పలు ప్రదేశాలు తిరుగుతూ ఎర్రకాలువ ఒడ్డుకు వచ్చి అక్కడ తపస్సు చేసుకోవటానికి నివాసం ఏర్పరచుకున్నాడు. ప్రతి నిత్యం ఎర్ర కాలువలో స్నానం చేసి శ్రీ ఆంజనేయస్వామి గురించి తపస్సు చేసి మహర్షి అయ్యాడు. వయోభారం మీదపడ్డా మధ్వ మహర్షి తన నిత్యకృత్యాలైన ఎర్ర కాలువ స్నానం, ఆంజనేయస్వామి గురించి తపస్సు విడువలేదు.
భక్తుడి కోరికతో చెట్టులోనే వెలసిన హనుమ
లంకలో ఉన్నవాళ్లందరూ రాక్షసులు కాదు. రావణుడి చర్యలను వ్యతిరేకించిన విభీషుణుడి గురించి మాత్రమే అందరికీ తెలుసు. కానీ రావణుడి సేనలోని మధ్వాసురుడనే రాక్షసుడు మాత్రం తాను కత్తి పట్టను, జీవ హింస చేయననేవాడు. దీంతో రావణుడు అతడిపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేసేవాడు. వీటికి తోడు ఆధ్యాత్మిక చింతనతో ఉంటే శివుడి చెంతకు చేరుకుంటామని ప్రతి ఒక్కరికీ హితబోధ చేసేవాడు.
సీత జాడ వెదుక్కొంటూ లంకలోకి ప్రవేశించిన హనుమంతుడి విధేయతను మెచ్చిన మధ్వాసురుడు అతడికి వీరభక్తుడిగా మారిపోయాడు. ప్రహ్లాదుడు శ్రీహరిని స్మరించినట్లు ఇతడు కూడా నిరంతరం హనుమాన్ నామాన్ని జపించేవాడు. రామరావణ యుద్ధం ఖాయమవడంతో అందులో పాల్గోవాలని మధ్వాసురుడుకి పిలుపొచ్చింది. దీంతో ఏంచేయాలో పాలుపోక అస్త్ర సన్యాసం చేసి, హనుమంతుడి నామాన్ని ఉచ్చిరిస్తూ ఆత్మత్యాగం చేశాడు.
ద్వాపర యుగంలోనూ మళ్లీ మధ్వికుడిగా జన్మించిన మధ్వాసురుడు దురదృష్టవశాత్తు కౌరవుల తరఫున పోరాడాల్సి వచ్చింది. కురుక్షేత్రంలో అర్జునుడి రథంపై ఉన్న ఆంజనేయుడి జెండాను చూసి గత జన్మ గుర్తుకొచ్చి ప్రాణత్యాగం చేశాడు. కలియుగంలో మద్యుడనే మహర్షి రూపంలో పుట్టిన మధ్వాసురుడు హనుమంతుడి కోసం తపస్సు చేశాడు. ఒకరోజు పక్కన ఉన్న కాల్వలో స్నానం చేసి వస్తూ దారిలో సొమ్మసిల్లి పడిపోతే ఓ వానరం అతడిని లేపి సేవలు చేసి, తినడానికి మామిడి పండు ఇచ్చింది.
అప్పటి నుంచి రోజూ ఆ వానరం వచ్చి సపర్యలు చేయడం, పండు ఇవ్వడంతో నీ రుణం ఎలా తీర్చుకోవాలి…. నీవు ఎవరో నాకు తెలియదు, నాపై ఎందుకింత ప్రేమని మద్యుడు అడిగాడు.
దీంతో వానర రూపంలో ఉన్న ఆంజనేయుడు ఆయనకు ధర్శనం ఇచ్చాడు. దీనికి పులకించిన మద్యుడు స్వామీ నిన్ను ఒకే ఒక్కటి కోరతాను… దీన్ని నెరవేరుస్తావా అని అడిగితే ఆంజనేయుడు కోరుమన్నాడు. మద్యుడు స్వామీ నిన్ను విడిచి ఉండలేను, నీతోనే ఉండేలా వరం ప్రసాదించమని కోరాడు.
దీనికి సరేనన్న హనుమంతుడు నీవు మద్ది చెట్టుగా అవతరిస్తే దీని కింద నేను శిలారూపంలో వెలుస్తానని అన్నాడు. అలా వెలసిన దేవాలయమే మద్ది ఆంజనేయస్వామి ఆలయం. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరుకి సమీపాన ఉంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ ఆలయంలోని ఆంజనేయుడు ఓ చేతిలో పండు, మరో చేతిలో గదతో స్వయంభువుగా వెలిశాడు.
హనుమంతుడు మద్ది క్షేత్రం లో తెల్ల మద్ది వృక్షపు తొర్రలో వెలిసిన దైవం. ఈ దేవాలయం బయనేరు నదీ తీరంలో ఎర్రకాలువ డాం కు సమీపంలో ఉంది. మద్దిచెట్టే గర్భాలయానికి గోపురంగా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత.
కుడి చేతిలో గద, ఎడమ చేతిలో ‘అరటిపండు’.. ఆంజనేయస్వామి
జంగారెడ్డిగూడెం(పశ్చిమ గోదావరి): భారతదేశంలోనే విశిష్టమైన హనుమ దివ్యక్షేత్రం. శిఖరం లేని ఆలయం. తెల్ల మద్ది చెట్టే శిఖరం. స్వయంభూ క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామిహనుమ కుడి చేతిలో గద, ఎడమ చేతిలో అరటిపండు ఉండి అడుగు ముందుకు వేసినట్టు ఉండటం విశేషం. గద భక్తునికి అభయం, అరటిపండు ఫలప్రదం, ముందుకు వేసే అడుగు తక్షణ అనుగ్రహం ఇచ్చే అంశాలుగా భక్తుల అనుభవం. స్వామి శిరస్సుపై ఐదు శిరస్సుల సర్పరాజంగా మద్దిచెట్టు తొర్ర. భక్తుల పాలిట కొంగుబంగారం మద్ది హనుమ.
మద్ది అంజన్న దర్శనం తోనే జన్మ లగ్నాత్ శనిదోషాలు, రాహుకేతు దోషాలు, నవగ్రహ దోషాలు పోతాయి అని భక్తుల విశ్వాసం మరియు నమ్మిక. మంగళవారం, శనివారం ప్రదక్షిణలు విశేష ఫలప్రదం. మూడు యుగాలతో ముడిపడిన స్థలపురాణం. గర్గ సంహిత, శ్రీమద్ రామాయణం, పద్మ పురాణంలో స్థలపురాణ అంశాలు. భక్తుడి దివ్యకధకు రూపం. భక్తవరదుడై అనుగ్రహించిన అంజన్న కోరికలు తీర్చే కొంగుబంగారం.
ఇలా ఎన్నో, ఎన్నెన్నో విశిష్టతలు తో కూడిన ఆంజనేయ సన్నిధి శ్రీమద్దిఆంజనేయస్వామి వారి ఆలయం. జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో ఎర్రకాలువఒడ్డున పచ్చని పొలాల మధ్య అర్జున వృక్షం (తెల్లమద్ది చెట్టు) తొర్రలో కొలువైఉన్న ఆంజనేయస్వామివారి సన్నిధి శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి దివ్యాలయం.
స్థలపురాణం
ఆలయ స్థలపురాణం ప్రకారం మూడు యుగాలకు అనుబందంగా స్థలపురాణం చెప్పబడింది. సీతాన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమ పరాక్రమాన్నీ, బుద్ధి బలాన్నీ ప్రత్యక్షంగా చూసిన రావణుడి సైన్యంలోని మధ్యుడు అనే అసురుడు స్వామికి భక్తుడయ్యాడు. నిత్యం అంజనీసుతుడినే ఆరాధిస్తూ జీవనం సాగించేవాడు.
శత్రు పక్షంలో ఉన్నందువల్ల స్వామిని నేరుగా దర్శించే భాగ్యం అతడికి లేకపోయింది. వచ్చే జన్మలోనైనా ఆయన సాక్షాత్కారం పొందాలన్న ఉద్దేశంతో హనుమ సేనకు ఎదురెళళ్లి మధ్యుడు వీరమరణం పొందాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ అంశతోనే కలియుగంలో మధ్యుడు జన్మించాడనీ అతడిని అనుగ్రహించేందుకే మద్ది వృక్షంలో ఆంజనేయ స్వామి అవతరించాడని ప్రతీతి.
ఓ భక్తురాలి స్వప్నంలో సాక్షాత్కారమైన ఆంజనేయుడు మద్దిచెట్టు తొర్రలో ఉన్న తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడట. దీంతో చెట్టు దగ్గరకి వెళ్లి చూడగా అక్కడ ఆంజనేయస్వామి రాతి విగ్రహం కనిపించిందట. అలా సా.శ. 1166వ సంవత్సరంలో ఆ వూరివారికి స్వామి మొదటి దర్శనం లభించిందని పూర్వీకులు చెబుతున్నారు. తొలుత చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రమే కట్టారు. తర్వాత 1978వ సంవత్సరంలో పూర్తిస్థాయి ఆలయాన్ని నిర్మించారు. అయితే మధ్యుడే మద్ది చెట్టుగా వెలిశాడన్న నమ్మకంతో ఆ చెట్టునే గర్భాలయ గోపురంగా ఉంచేశారు.
వైష్ణవ సంప్రదాయంలో మద్ది ఆంజనేయస్వామికి నిత్యపూజలూ, అభిషేకాలను వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి శనివారం స్వామివారి మూలవిరాట్‌కు పంచామృత అభిషేకం శాస్త్రòక్తంగా జరుపుతారు. ప్రతి నెలా స్వామి జన్మ నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రంలో సువర్చలా సమేత ఆంజనేయస్వామి కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం స్వామివారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.
త్రేతాయుగం
రావణుని సైన్యంలోని మద్వా సురుడు అనే రాక్షసుడు సాత్విక చింతనలో రాక్షస ప్రవృత్తిలో కాక ఆధ్యాత్మిక చింతనలో ఉండేవారు. సీతామాతను అన్వేషిస్తూ హనుమ లంకను చేరినప్పుడు హనుమ పరాక్రమం ప్రత్యక్షంగా దర్శించి హనుమకు భక్తుడయ్యాడు. రామరావణ యుద్ధంలో రాముని వైపు పోరాడుతున్న హనుమను దర్శించి మనస్సు చలించి అస్త్రసన్యాసం చేసి హనుమా అంటూ తనువు చాలించారు.
ద్వాపరయుగంలో
ద్వాపరంలో మధ్వకుడు అనే పేరుతో జన్మించి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు నిలిచి యుద్ధం చేస్తూ అర్జనుని రధం పైనున్న ’జండా పై కపిరాజు’ (ఆంజనేయస్వామి వారు)ను దర్శించి తన గతజన్మ గుర్తుకొచ్చి స్వామిని త్వరితగతిన చేరే క్రమంలో అస్త్రసన్యాసం చేసి ప్రాణత్యాగం చేసుకున్నారు.
కలియుగంలో
కలిలో మద్వుడు అనే పేరుతో జన్మించి హనుమ అనుగ్రహం కోసం తపస్సు చేయాలన్న సంకల్పంతో ఎర్రకాలువ ఒడ్డున కుటీరం ఏర్పాటు చేసుకుని ప్రతీ దినం కాలువలో దిగి స్నానం చరించి ఇలా ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తున్న సందర్భంలో ఒకరోజు రోజూ లాగునే ఎర్రకాలువలో ఉదయం స్నానం చేసి పైకి వస్తున్న క్రమంలో జారి పడబోయినవుడు, ఎవరో ఆపినట్టు ఆగిపోయారు. ఒక కోతి చేయి అందించి పడకుండా ఆ క్షణంలో ఆపింది. అంతేకాక ఒక ఫలం ఇచ్చి వెళ్ళింది.
తన ఆకలి తీర్చడం కోసం ఫలం ఇచ్చిన ఈ వానరం ఎవరో అని మహర్షి ఆలోచించలేదు. అదే క్రమంలో నిత్య అనుష్ఠానం కొనసాగించడం ప్రతీ రోజూ కోతి వచ్చి ఫలం ఇవ్వడం దానిని మద్వమహర్షి స్వీకరించడం జరిగేది. ఒకరోజు తనకు రోజూ ఫలం ఇస్తున్న వానరం హనుమగా గుర్తించి ఇన్నాళ్లు మీతో సపర్యలు చేయించుకున్నానా ! అని నేను పాపాత్ముడను, జీవించి ఉండుట అనవసరం అని విలపించి బాధపడిన సందర్భంలో స్వామి హనుమ ప్రత్యక్షమై మద్వా ఇందులో నీతప్పు ఎంతమాత్రమూ లేదు నీ స్వామి భక్తికి మెచ్చి నేనే నీకు సపర్యలు చేశాను. ఏమి వరం కావాలో కోరుకోమన్నట్టు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది.
వరప్రదానం
మీరు ఎల్లప్పుడూ నా చెంతే ఉండాలి స్వామి అని మద్వమహర్షి కోరగా మద్వా నీవు అర్జున వృక్షానివై (తెల్లమద్దిచెట్టు)ఇక్కడ అవతరించు. నేను నీ సమీపంలో శిలారూపంలో నేను స్వయం వ్యక్తమవుతాను.నీ కోరిక ప్రకారం ఎల్లప్పుడూ నీ చెంతే ఉంటూ మన ఇరువురి నామాలతో కలిపి మద్ది ఆంజనేయుడుగా కొలువైవుంటాను అని వరం ఇచ్చి ఇక్కడ వెలిశారు అన్నది స్థలపురాణం.
స్వప్నదర్శనం
అనంతర కాలంలో 1966 నవంబర్ 1న ఒక భక్తురాలికి స్వప్నదర్శనం ఇచ్చి తాను ఇక్కడ చెట్టు తొర్రలో ఉన్నట్టు స్వామి చెప్పడంతో పాటు శిఖరం లేకుండా చెట్టే శిఖరంగా ఉత్తరోత్తరా ఆలయ నిర్మాణం చేసినా ఏర్పాటు చేయాలని చెప్పినట్టు స్థానికుల నుండి తెలిసిన స్వప్నవృత్తాంతం.
చిన్నగా గర్భాలయం
ముందు కేవలం స్వామి చుట్టూ చిన్న గర్భాలయం నిర్మించారు అనంతరం 40 సంవత్సరాల క్రితం మండపం మరియు ఆలయం నిర్మించారు. తర్వాత విశేష సంఖ్యలో భక్తుల రాకతో ఆలయం పునర్నిర్మాణం జరిగి సకల సౌకర్యాలు ఏర్పాటుచేయబడ్డాయి. మద్ది ఒక దివ్యక్షేత్రంగా భాసిల్లుతోంది.
హనుమద్ దీక్షలు
ప్రతీ సంవత్సరం భక్తులు హనుమద్ దీక్షలు మండల కాలం చేసి స్వామి సన్నిధిలో హనుమద్ వ్రతం రోజు ఇరుముడి సమర్పిస్తారు.ఈ రీతిగా ముందుగా దీక్షా స్వీకారం చేసి హనుమ కృపతో దీక్షను భక్తితో పూర్తిచేస్తారు.మద్దిక్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది. ప్రతిష్ఠితమూర్తులను భక్తులు దర్శించవచ్చు.
ప్రదక్షిణలు
స్వామి హనుమ సన్నిధిలో ప్రదక్షిణలు విశేషంగా భక్తులు ఆచరించే ధార్మిక విధి. వివాహం కానివారు,వైవాహిక బంధం లో ఇబ్బందులు ఉన్నవారు,ఆర్ధిక ఇబ్బందులు,వ్యాపారం లో నష్టాలు,ఉద్యోగంలో ఉన్నతి లేనివారు ఇలా ఒకటేమిటి అనేక ఈతిబాధలు ఉండి ఏ పని చేసినా కలిసిరాని వారు ముందుగా స్వామిని దర్శించి తమ కోరికను స్వామికి మనస్సులో విన్నవించి 7 మంగళవారాలు 108 చొప్పున ప్రదక్షిణలు చేసి వారి కోరిక యొక్క తీవ్రతను బట్టి అర్చకస్వాములు సూచించిన విధంగా కొన్నివారాలు ప్రదక్షిణలు చేసి కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయడం ఇక్కడి భక్తుల నిత్యఅనుభవం.
శనిదోషాలు,గ్రహదోషాలు నివారణకు శనివారం పూజ ఇక్కడి విశేషం. అంగారక, రాహు దోషాలు తో పాటు ఎటువంటి దోషాలు అయినా స్వామి పూజలో తొలగుతాయి అన్నది భక్తుల నమ్మిక.
ప్రత్యేకతలు, విశేషాలు
తీరని కోర్కెలు ఉన్నవారూ పలు సమస్యలతో సతమతమవుతున్నవారూ ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రధాన మండపం చుట్టూ తొలుత 21 ప్రదక్షిణలు చేసి తమ మనసులోని కోర్కెలు తీరాలని మొక్కుకుంటారు. అవి నెరవేరిన తర్వాత మళ్లీ 108 ప్రదక్షిణలు చేసి స్వామికి మొక్కు చెల్లించుకుంటారు.
దీనితోపాటు శని దోషాలూ, రాహు కేతు దోషాలూ, నవగ్రహ దోషాలూ ఉన్నవారు స్వామిని దర్శించుకుంటే అవి తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
దూరాభారాల నుంచి వచ్చే భక్తుల కోసం విశాలమైన మండపం, అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్షేత్రంలో నిత్యాన్నదానం జరుగుతుంది.
నిత్య పూజలు, ఉత్సవాలు
మద్ది క్షేత్రంలో హనుమజ్జయంతి వేడుకలను అయిదు రోజులపాటు నిర్వహిస్తారు. ఆది, సోమవారాల్లో భక్తులతో సామూహిక హనుమద్ కళ్యాణాలూ, లక్ష్మీ కుంకుమార్చనలూ జరుపుతారు. కార్తిక మాసం నెల రోజులూ ఈ క్షేత్రం పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఈ నెలలో వచ్చే మంగళవారాల్లో స్వామికి లక్ష తమలపాకులతో ఆకు పూజ నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలోనే వేంకటేశ్వరస్వామి కూడా కొలువై ఉన్నాడు.
ఆంజనేయుడిని పూజించిన భక్తులు శ్రీనివాసుడినీ దర్శింస్తారు. ఈ క్షేత్రానికి సమీపంలోనే ఎర్రకాలువ జలాశయం ఉంది. ఇందులోని బోటు షికారు పర్యటకులకు ప్రత్యేక ఆకర్షణ. మద్ది క్షేత్రానికి 4 కి.మీ. దూరంలో జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ఆనుకుని గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం ఉంది. పారిజాతగిరిపై శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడి స్వామివారిని దర్శిస్తే సాక్షాత్తు తిరుమల వేంకన్నను దర్శించిన అనుభూతి కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ఆధ్యాత్మిక వైభవం
సువర్చలా హనుమ కల్యాణం ప్రతీ నెలా పూర్వాభాద్ర నక్షత్రం రోజు, పంచామృతాభిషేకం ప్రతీ శనివారం, 108 బంగారు తామలపాకుల పూజ ప్రతీ మంగళ, శుక్ర, శనివారాల్లో, 108 వెండి తమలపాకుల పూజ ప్రతీ మంగళ, శుక్ర, శనివారాల్లో, ఇంకా నిత్యపూజలు, విశేష పర్వదినాల్లో ప్రత్యేకపూజలు, అష్టోత్తర సేవ జరుగుతాయి.
కార్తీకమాసంలో నెలరోజులూ వైభవమే
కార్తిక శుద్ధ పాడ్యమి నుండి కార్తిక అమావాస్య వరకూ కార్తికం లో ప్రతీ మంగళవారం విశేష ద్రవ్యాలతో పూజలు చూసి తరించవలసిందే వర్ణించ వీలుకాని వైభవం. అలాగే హనుమద్జయంతి 5 రోజులు పాంచహ్నిక దీక్షగా నిర్వహిస్తారు. వైశాఖ బహుళ నవమి నుండి వైశాఖ బహుళ త్రయోదశి వరకూ జరుగుతుండగా, పవిత్రోత్సవాలు భాద్రపద శుద్ధ నవమి నుండి భాద్రపద శుద్ధ ద్వాదశి వరకూ జరుగుతాయి. ప్రవచనాలు, భజనలు, శోభాయాత్ర, తెప్పోత్సవం ఇలా ఒకటేమిటి ప్రతీదీ ప్రత్యేకమే.
రవాణా
By Road
Jangareddygudem – Eluru : 50kms
Jangareddygudem – Rajamundry : 70kms
Jangareddygudem – Vijayawada : 114kms
Jangareddygudem – Bhimavaram : 97kms
By Train
Jangareddygudem – Hyderabad : 300kms
Jangareddygudem – Rajamundry : 66kms
Jangareddygudem – Vijayawada : 97kms
By Air
Jangareddygudem – Vijayawada : 32kms
Jangareddygudem – Hyderabad :138kms
Temple Timings
Morning : 5am to 12pm
Evening : 4pm to 8pm
Temple Address
Sri Maddi Anjaneya Swamy Temple,
Guruvaigudem,Jangareddygudem Mandel,
West godavari District,
Andhra Pradesh State,
Also read
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!
- Srikakulam District: ఏం మహానటివి అమ్మా… భర్తను లేపేసి భలే నాటకం
- Kolkata: ఆర్జీ కర్ ఆసుపత్రి విద్యార్ధిని ఆత్మహత్య
- కుమార్తె భవిష్యత్తు కోసం తండ్రి కిడ్నీ అమ్మేస్తే.. కానీ భార్య మాత్రం..