June 29, 2024
SGSTV NEWS
Lok Sabha 2024

అవన్నీ ఫేక్ వార్తలు: సురేశ్ గోపి





తిరువనంతపురం: ప్రధాని మోదీ నేతృత్వంలోని కొత్తగా ఏర్పడిన కేంద్ర కేబినెట్ లో కొనసాగడం ఇష్టం లేదంటూ తనపై వచ్చిన ఆరోపణలపై త్రిస్సూర్ బీజేపీ ఎంపీ, నటుడు సురేశ్ గోపి స్పందించారు. అదంతా తప్పుడు సమాచారమని కొట్టిపారేశారు. మోదీ ప్రభుత్వంలోని మంత్రి మండలిలో ఉండటం, కేరళ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని చెప్పారు. ప్రధానితో సహా కేబినెట్ మంత్రిగా సురేశ్ గోపి ఆదివారం ప్రమాణం చేశారు.

ఈ నేపథ్యంలోనే తనకు కేంద్రమంత్రి పదవిపై ఆసక్తి లేదని.. ఎంపీగా కొనసాగడమే ఇష్టమని ఆయన కామెంట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. తన అభిప్రాయాన్ని హైకమాండ్ కు తెలియజేశానని.. తుది నిర్ణయం పార్టీకే వదిలేస్తున్నానని ఆయన మాట్లాడినట్లు ఫేక్ సమాచారం ప్రచారమైంది. తనపై వచ్చిన ఊహాగానాలు చర్చనీయాంశంగా మారడంతో వాటిపై సురేశ్ గోపి క్లారిటీ ఇచ్చారు.

కేబినెట్ నుంచి వైదొలిగే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. “ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రిమండలికి నేను రిజైన్ చేస్తానంటూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు సమాచారం ప్రచారం చేశాయి. నాకు అలాంటి ఉద్దేశం లేదు. మోదీ నాయకత్వంలో కేరళ అభివృద్ధి, శ్రేయస్సుకు కట్టుబడి ఉన్నా” అని తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. తన ఎఫ్బీ పేజీలో మోదీతో ఉన్న ఫోటోను జత చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో త్రిస్సూర్ లో గెలవడంతో కేరళలో తొలిసారి బీజేపీ ఖాతా తెరిచింది. ఆ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటుడు సురేశ్ గోపి 74 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయనకు కేంద్రమంత్రి పదవి దక్కింది.

Also read

Related posts

Share via