శ్రీశైలంలో మల్లన్న భ్రమరాంబిక ఆలయాలతో పాటుగా నల్లమల్ల అడవుల్లో చాలా మందికి తెలియని ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ చూడాల్సిన ఆలయాల్లో ఇష్టకామేశ్వరి ఆలయం ఒకటి. చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ ఆలయ విషయాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఇష్ట కామేశ్వరి ఆలయం
మన భారత దేశంలో ఎన్నో పురాతన ఆలయాలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఆకర్షిస్తున్న ప్రదేశాలలో శ్రీశైలం కూడా ఒకటి. చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చి శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటారు. శ్రీశైలం క్షేత్రం గురించి తెలియని వారు ఉండరు. ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత వుంది.
శ్రీశైలంలో మల్లన్న భ్రమరాంబిక ఆలయాలతో పాటుగా నల్లమల్ల అడవుల్లో చాలా మందికి తెలియని ఎన్నో ఆలయాలు ఉన్నాయి. సుమారు 500 శివలింగ ఆలయాలు ఇక్కడ వున్నాయట. ఇక్కడ చూడాల్సిన ఆలయాల్లో ఇష్టకామేశ్వరి ఆలయం ఒకటి. ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్తే, మన కోరికలు కచ్చితంగా నెరవేరుతాయట.
ఇష్టకామేశ్వరి ఆలయం గురించి విన్నారా?
ఇష్టకామేశ్వరి దేవి పేరుతో ఇక్కడ తప్ప ఎక్కడ మనకి ఆలయం కనపడదు. శ్రీశైలానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకోలేరు. కేవలం అదృష్టవంతులకి మాత్రమే ఇంతటి భాగ్యం కలుగుతుందట. ఈ ఆలయానికి వెళ్లి మనస్ఫూర్తిగా భక్తులు వారి కోరికలను అమ్మవారికి చెప్తే, ఖచ్చితంగా అవి నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
అమ్మవారి నుదుట బొట్టు పెట్టి
ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారిని ఎదుట బొట్టు పెట్టి కోరికల్ని కోరుతారు. అమ్మవారికి బొట్టు పెట్టే సమయంలో ఆమె నుదుట మెత్తగా మానవ శరీరాన్ని తాకినట్లు ఉంటుందట.
ఇది వరకు అటవీ ప్రాంతాలలో సిద్ధులు మాత్రమే ఈ అమ్మవారిని ఆరాధించేవారు. కానీ ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఎంత కోరిక అయినా సరే అమ్మవారు తీరుస్తారని, అందుకనే ఇష్టకామేశ్వరి దేవిగా కొలుస్తారని తెలుస్తోంది.
విశేష పూజలు
మంగళవారం, శుక్రవారం, ఆదివారం నాడు ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు కొంతమంది చీర, సారెలను బహుకరిస్తారు. ధర్మబద్ధంగా కోరే ఏ కోరిక అయినా సరే నెరవేరుతుందని చెప్తారు.
అమ్మవారి విగ్రహం
భూగర్భంలో ఒక చిన్న దేవాలయంలో ఇష్టకామేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు. కిటికీలో ఉండే చిన్న ముఖద్వారం నుంచి మోకాళ్ళ మీదగా ఒక్కొక్కరు అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తారు.
అమ్మవారిని దర్శించుకోవడానికి ముందు ఇక్కడ కొలువైన వినాయకుడిని దర్శించుకుని ఆ తర్వాత అమ్మ వారిని దర్శించుకుంటారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వారు, బ్రమరాంబ దేవి వెలసినప్పుడే ఇష్టకామేశ్వరి అమ్మవారి కూడా వెలసినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి.
శివుడు, పార్వతీదేవిల ప్రతిరూపం
శివుడు, పార్వతీదేవిల ప్రతిరూపంగా ఈ అమ్మవారిని భావిస్తారు. శ్రీశైలంలో ఉన్న రహస్యాలలో ఇష్టకామేశ్వరి ఒకటి. ఇష్టకామేశ్వరి దేవికి చతుర్భుజాలు. రెండు చేతులతో తామర మొగ్గలని, మూడవ చేతిలో శివలింగాన్ని, నాల్గవ చేతిలో రుద్రాక్ష మాలలతో తపస్సు చేస్తున్నట్లు అమ్మవారు కనపడతారు. ఇక్కడికి వెళ్లి కాసేపు ధ్యానం చేస్తే ఎంతో ప్రశాంతత కలుగుతుంది.
ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి?
శ్రీశైలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడికి ప్రయాణం చేయడం అంత సులువు కాదు. ఎంతో సాహసంతో కూడుకున్నది. కార్లలో వెళ్లడం కుదరదు. శ్రీశైలం నుంచి పరిమిత సంఖ్యలో జీపులు ఉంటాయి.
డోర్నాల్ మార్గంలో సుమారు 12 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆలయానికి కిలోమీటర్ దూరంలో జీపులను నిలిపివేస్తారు. అక్కడ నుంచి నడిచి వెళ్ళాలి. సాయంత్రం ఐదు తర్వాత అడవిలోకి జీపులని అనుమతించరు.
..