ఇందిరా ఏకాదశి 2025 సెప్టెంబర్ 17న వచ్చింది. ఈ రోజు ముహూర్తం, పారాయణ సమయం, ఈ వ్రతం ఆచరించడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు తెలుసుకోండి.
Indira Ekadashi 2025 : ఇందిరా ఏకాదశి పితృ పక్షంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి. ఏటా భాద్రపద మాసం అమావాస్య ముందు వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశిగా జరుపుకుంటారు. ఇది పూర్వీకులను సంతోషపెట్టడానికి , శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి అనువైన రోజు అని పండితులు చెబుతారు.
ఈ రోజున పెద్దలకు తర్పణం, శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు.. తద్వారా పితృదేవతల ఆత్మలకు శాంతి లభిస్తుందని నమ్ముతారు.
ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల గతంలో చేసిన పాపాలు తొలగిపోతాయని, పితృదేవతల అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం
ఇందిరా ఏకాదశి 2025 తేదీ
భాద్రపద మాసం అమావాస్య ముందు వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు. 2025లో ఈ ఏకాదశి తిథి సెప్టెంబర్ 17 బుధవారం వచ్చింది. వాస్తవానికి ఏకాదశి తిథి సెప్టెంబర్ 16 మంగళవారం అర్థరాత్రి 2 గంటల 43 నిముషాలకు మొదలైంది. బుధవారం సూర్యోదయానికి తిథి ఉంది.. బుధవారం అర్థరాత్రి ఒంటిగంట 15 నిముషాల వరకూ ఉంది. అందుకే సెప్టెంబర్ 17 బుధవారమే ఇందిరా ఏకాదశి.
ఇందిరా ఏకాదశి 2025 శుభ ముహూర్తం
బ్రహ్మ ముహూర్తం: ఉదయం 4:33 – 5:20
సూర్యోదయం: ఉదయం 6:07
సూర్యాస్తమయం: సాయంత్రం 6:24
విజయ ముహూర్తం: మధ్యాహ్నం 2:18 – 3:07
గోధూళి ముహూర్తం: సాయంత్రం 6:24 – 6:47
నిశిత ముహూర్తం: రాత్రి 11:52 – 12:39
ఇందిరా ఏకాదశి 2025 పారణ సమయం
సాధారణంగా ఏ ఏకాదశికి ఉపవాసం ఆచరించినా దశమి రోజు రాత్రి నుంచి నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఏకాదశి మొత్తం ఉపవాసం ఉండి.. ఆ మర్నాడు ద్వాదశి ఘడియలు పూర్తికాకముందు పూజ పూర్తిచేసి, శక్తి కొలది దానధర్మాలు చేసి ఉపవాసం విరమించాలి. పారాయణం చేయాలి అనుకునేవారు సెప్టెంబర్ 17 ఏకాదశి, సెప్టెంబర్ 18 ద్వాదశి ఈ రెండు రోజులు ఉదయం, సాయంత్రం సమయాల్లో విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. భగవద్గీత పఠించడం కూడా మంచిది
ఈ ఏడాది ఇందిరా ఏకాదశి 2025 రెండు శుభ యోగాలతో కలిసి వస్తోంది
పరిఘ యోగం: తెల్లవారుజామున 10:55 వరకు
శివ యోగం: 10:55 తరువాత
ఈ రోజున పునర్వసు నక్షత్రం ఉదయం 9:37 వరకు ఉంటుంది, తరువాత పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది.
ఇందిరా ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు
ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది..సకల పాపాల నుంచి విముక్తి కల్పిస్తుంది
ఇందిరాఏకాదశి వ్రతం మోక్షాన్నిస్తుంది
పితృపక్షంలో వచ్చే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పూర్వీకులు అనుభవిస్తున్న బాధలనుంచి విముక్తి పొంది స్వర్గానికి వెళతారని నమ్మకం
పద్మ పురాణంలో ఇందిరా ఏకాదశి గురించి ఉంది. ఇంద్రసేన మహారాజు ఒకప్పుడు నారద మహర్షి మార్గదర్శకత్వంలో ఇందిరా ఏకాదశిని ఆచరించి తన పూర్వీకులను విముక్తి కల్పించాడని చెబుతారు
ఇందిరా ఏకాదశి 2025 కేవలం ఉపవాసం ఉండే రోజు మాత్రమే కాదు, భక్తిని చాటుకోవడానికి, పూర్వీకులను గౌరవించడానికి , జీవితంలో శాంతిని ఆహ్వానించడానికి ఒక దైవిక అవకాశం.
సెప్టెంబర్ 17 ఇందిరా ఏకాదశి మాత్రమే కాదు.. ఇదే రోజు కన్యా సంక్రాంతి (సూర్యుడు సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు), దేవతల వాస్తు శిల్పి అయిన విశ్వకర్మ జయంతి కూడా ఇదే రోజు.
