January 28, 2025
SGSTV NEWS
CrimeUttar Pradesh

ఇద్దరు చిన్నారులతో సహా ప్రభుత్వ టీచర్‌ కుటుంబాన్ని కాల్చి చంపిన దుండగులు..!

ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగు చూసింది. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ప్రభుత్వ ఉపాధ్యాయుడిని, అతని భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి చంపారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన దుండుగులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణానికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ఈ హత్య ఘటన అమేథి జిల్లాలోని శివతంగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అహోర్వా భవాని కూడలిలో చోటుచేసుకుంది. మృతులను సునీల్ భారతి, అతని భార్య పూనమ్ భారతి, కుమార్తె దృష్టి (6), రెండేళ్ల కుమార్తెగా గుర్తించారు. మరణించిన ఉపాధ్యాయుడు సునీల్ భారతి తన కుటుంబంతో కలిసి అహోర్వ భవానీ ప్రాంతంలోని అద్దె గదిలో నివసిస్తున్నాడు. సునీల్ జిల్లాలోని సింగ్‌పూర్ బ్లాక్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో సహాయ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అతను రాయ్ బరేలీ జిల్లా జగత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుదామాపూర్ గ్రామ నివాసి.

గురువారం(అక్టోబర్ 3) సాయంత్రం సునీల్, అతని భార్య, ఇద్దరు పిల్లలను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. నేరం చేసిన అనంతరం అహోర్వా భవాని కూడలి గుండా దుండగులు పారిపోయారు. బుల్లెట్ల శబ్ధం విని జనం అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై ప్రజలు వెంటనే శివతంగంజ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.


సమాచారం అందుకున్న వెంటనే అమేథీ ఎస్పీ అనూప్ సింగ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్పీ పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని సూచించారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దృష్టి సారించారు. ఘటనపై సీఎం యోగి విచారం వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదేశించారు.

భార్యాభర్తలు, ఇద్దరు పిల్లల హత్య ఘటనతో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉపాధ్యాయుడు సునీల్‌కు ఎవరితోనైనా గొడవలున్నాయా, ఆ తర్వాత ఈ ఘటనకు పాల్పడ్డారా? సునీల్‌కి గొడవలుంటే ఆ కుటుంబం మొత్తం ఎందుకు నాశనం అయింది? సునీల్‌కు ఎవరైనా చంపేస్తామని బెదిరింపులు వస్తే, దానిపై సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశారా? దుర్మార్గుల సంఖ్య కూడా ఇంకా తెలియరాలేదు. సునీల్‌ రాయ్‌బరేలీ జిల్లా వాసి కావడంతో అతడి కుటుంబసభ్యులకు ఈ ఘటనపై సమాచారం అందించారు పోలీసులు

Also read

Related posts

Share via