కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బిఎస్ యడియూరప్ప చిక్కుల్లో పడ్డారు. పోక్సో కేసులో ఆయనకు బెంగళూరు కోర్టు గురువారం (జూన్ 13) నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బిఎస్ యడియూరప్ప చిక్కుల్లో పడ్డారు. పోక్సో కేసులో ఆయనకు బెంగళూరు కోర్టు గురువారం (జూన్ 13) నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 17 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యడ్యూరప్పపై పోక్సో చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 354ఏ (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని తన నివాసంలో జరిగిన సమావేశంలో ఆమె కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి
ప్రస్తుతం యడ్యూరప్ప ఢిల్లీలో ఉన్నారు. అతనిపై పోక్సో కేసును దర్యాప్తు చేస్తున్న సిఐడి, యడ్యూరప్పపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. అవసరమైతే యడ్యూరప్పను సిఐడి అరెస్టు చేయవచ్చని గతంలో హోంమంత్రి చెప్పారు. ఈ కేసులో జూన్ 12న హాజరుకావాలని యడ్యూరప్పను సీఐడీ కోరగా, తాను ఢిల్లీలో ఉన్నానని, అందుకే జూన్ 17న సీఐడీ ఎదుట హాజరవుతానని యడియూరప్ప చెప్పారు. తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ కావడం సంచలనంగా మారింది.
మే నెల 14న బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. యడ్యూరప్ప తన మైనర్ కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. తల్లి కూతుళ్లు ఏదో పని నిమిత్తం యడ్యూరప్ప ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో యడ్యూరప్ప అనుచితంగా ప్రవరించినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం సీరియస్‌గా మారడంతో కర్ణాటక ప్రభుత్వం కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించింది. ఈ కేసులో బీఎస్ యడ్యూరప్ప కూడా ఒకసారి సీఐడీ ఎదుట హాజరయ్యారు.
ఇదిలా ఉండగా, మే 26న ఫిర్యాదు చేసిన మహిళ మరణించింది. కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. దీని తర్వాత, బాధితురాలి సోదరుడు కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి, యడియూరప్పను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పోక్సో కేసును కొట్టివేయాలని బీఎస్ యడ్యూరప్ప కూడా కోర్టులో పిటిషన్ వేశారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని యడియూరప్ప పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో యడ్యూరప్పకు కష్టాలు పెరిగే అవకాశం ఉంది.