October 17, 2024
SGSTV NEWS
CrimeNational

అంగన్‌వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు.. విచారణకు ఆదేశించిన డిప్యూటీ సీఎం

ఒడిశాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ అంగన్‌వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టారు గ్రామస్తులు. బాలాసోర్‌లోని మహాపద గ్రామంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు ప్రతిరోజూ ఆహారం అందించడం లేదన్న ఆరోపణపై గ్రామస్తులు, ఊర్మిళా సమల్ అనే అంగన్‌వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ ఘటన అలస్యంగా వెలుగు చూసింది. విషయం అక్కడితో ఆగలేదు, మరో మహిళా కార్మికురాలిని కూడా దారుణంగా కొట్టారు. ఈ సంఘటన సెప్టెంబర్ 19వ తేదీన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో, చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ఒడిశా ఉపముఖ్యమంత్రి ప్రభాతి పరిదా బాధితురాలు ఊర్మిళా సమల్‌ను కలుసుకుని ఆమెకు పూర్తి వైద్య సహాయం మరియు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. పరిదా చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ (CDMO), పోలీసు సూపరింటెండెంట్‌తో పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయంపై సత్వర చర్యలు, సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు.

పోలీసుల సమాచారం మేరకు గ్రామస్తులు అంగన్‌వాడీ కేంద్రంలోకి ప్రవేశించి ఊర్మిళను దుర్భాషలాడారు. అంతేకాదు ఆమెను బయటకు ఈడ్చుకొచ్చి చెట్టుకు కట్టివేసి, దారుణంగా కొట్టారు. అక్కడ నిలబడిన కొంతమంది స్థానికులు ప్రేక్షకులుగా మాత్రమే ఉండిపోయారు. ఆ మహిళకు సహాయం చేయడానికి ఎవరూ రాలేదు. మహిళపై కొందరు గుడ్లు కూడా విసిరినట్లు సమాచారం. తమ పిల్లలకు సక్రమంగా ఆహారం అందడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊర్మిళ తమ పిల్లలకు భోజనం పెట్టడం లేదని, దీనిపై గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేశామని స్థానిక మహిళలు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సిడిపిఓ) పార్బతి ముర్ము సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఎలాగోలా మహిళను విడిపించి బస్తా ఆసుపత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆమెను బాలాసోర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో విషయం పోలీసులకు చేరడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే కొట్టడానికి స్పష్టమైన కారణం ఇంకా వెల్లడి కాలేదు. ఈ దాడి సుభద్ర యోజనకు సంబంధించినది కావచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనతో కార్మికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన ఇతర కార్మికుల్లో భయాందోళనకు గురి చేసింది.

Also read

Related posts

Share via