April 16, 2025
SGSTV NEWS
CrimeNational

స్కూల్‌ ప్రిన్సిపల్ పైత్యం.. లేడీ టీచర్‌ను మద్యం తాగాలని, స్మోక్‌ చేయాలని బలవంతం! తర్వాత జరిగిందిదే

 

పాఠశాలకు మద్యం సేవించి వచ్చిన ఓ స్కూల్ ప్రిన్సిపల్ అక్కడి మహిళా టీచర్ తో అసభ్యంగా ప్రవర్తించాడు. తనతో కూర్చుని మద్యం తాగాలని, సిగరేట్ కాల్చాలని బలవంతం చేశాడు. ఇలా గత రెండు సంవత్సరాలుగా ఆమెను రకరకాలుగా వేధిస్తున్నా.. ఎక్కడ ఉద్యోగం పోతుందోనన్న భయంతో పట్టి బిగువున భరించింది. కానీ అతని అసభ్య ప్రవర్తనతో విసిగిన ఆమె తాజాగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది..


భోపాల్‌, డిసెంబర్‌ 5: అతడొక బాధ్యత కలిగిన స్కూల్‌ ప్రిన్సిపల్. బాధ్యత మరచి స్కూల్‌కి మద్యం తాగిరావడమే కాకుండా అక్కడే టీచర్‌గా పని చేస్తున్న మహిళను ప్రిన్సిపాల్‌ వేధించసాగాడు. తనతో కలిసి మందు తాగాలని, సిగరెట్‌ కాల్చాలని బలవంతం చేశాడు. తన మాట వినలేదని ఆ మరునాడు కూడా వేధించాడు. విద్యార్ధుల ముందు మోకాళ్లపై కూర్చోవాలని హుకూం జారీ చేసి అవమానించాడు. ప్రిన్సిపల్‌ వేధింపులు భరించలేని ఆ మహిళా టీచర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో బుధవారం (డిసెంబర్ 5) చోటుచేసుకుంది.


జబల్‌పూర్‌లోని సాలివాడలో ఓ కాన్వెంట్ స్కూల్‌కు క్షితిజ్ జాకబ్ అనే వ్యక్తి ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. పని సాకుతో అదే స్కూల్లో ఉన్న మహిళా టీచర్‌ను బయటకు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవించిన అతడు ఆమెను కూడా మందు తాగాలని, స్మోక్‌ చేయాలని బలవంతం చేశాడు. ఆమె అభ్యంతరం చెప్పడంతో ఆమెపై కక్ష్య సాధించాలని సదరు కీచక ప్రిన్సిపల్‌ పన్నాగం పన్నాడు. మరునాడు స్కూల్‌లో అందరి ముందు అవమానించాడు. మోకాళ్లపై కూర్చొవాలంటూ వేధించాడు.

అతడి వేధింపులకు తాళలేక బాధిత టీచర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్లుగా ఆ ప్రిన్సిపాల్‌ తనను వేధిస్తున్నాడని, తనతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఆమె ఆరోపించింది. ఎవరికైనా చెబితే ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరించడంతో ఇన్నా్‌ళ్లు మౌనంగా ఉన్నానని, వేధింపులను భరించలేక పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పింది. దీంతో ప్రిన్సిపాల్ క్షితిజ్ జాకబ్‌పై ఖమారియా పోలీస్ స్టేషన్ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అడిషనల్ ఎస్పీ సూర్యకాంత్ శర్మ తెలిపారు. పోలీసులు ఆ స్కూల్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు, ఇతర సిబ్బంది నుంచి సాక్ష్యంగా వాంగ్మూలాలను సేకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఆరోపణలు నిజమని తేలితే స్కూల్‌ ప్రిన్సిపాల్‌పై తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్‌ అధికారి వెల్లడించారు.

Also read

Related posts

Share via