ఫేర్వెల్ ముసుగులో నైతిక పతనం
నీలకంఠాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలలో ఘటన
కురుపాం : విద్యార్థులకు విద్యాబుద్ధులు, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలు నేర్పాల్సిన ఉపాధ్యాయులే విచ్చలవిడిగా ప్రవర్తించి విద్యా వ్యవస్థను అపహాస్యం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం నీలకంఠాపురంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల పదో తరగతి విద్యార్థుల కోసం నిర్వహించిన ఫేర్వెల్ డే వేడుకల్లో సంబంధిత వార్డెన్ హిజ్రాలను ఆహ్వానించి, రికార్డింగ్ డ్యాన్సులతో పాటు అశ్లీల హావభావాలతో కూడిన నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. చిన్న వయసులో ఉన్న విద్యార్థుల ముందే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల వారి మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపేలా చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయుల సమక్షంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళనకరమని అంటున్నారు. తమ పిల్లలను నమ్మకంతో పాఠశాలకు పంపితే, అక్కడ ఇలాంటి అనుచిత కార్యక్రమాలు జరగడం బాధాకరమని వాపోతున్నారు.
విచారణ చేపట్టాలని డిమాండ్ : ఎస్ఎఫ్ఐ
ఈ ఘటనపై గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి అనిల్ డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని శిక్షించకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతాయని హెచ్చరిస్తున్నారు.
ఈ విషయాన్ని గిరిజన సంక్షేమ శాఖ డిడి విజయశాంతి పాఠశాలలో విచారణ జరిపారు. నివేదికను ఐసిడిఎ పిఒకు అందజేస్తామన్నారు.
ఈ సంఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, గిరిజన సంక్షేమ శాక మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పందించి వార్డెన్ చంద్రమోహన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి వార్డెన్ సంస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Also read
- Suryapet: అర్ధరాత్రి అబ్బాయిలతో ఇద్దరు అమ్మాయిలు..
- చీర చూపించి పెళ్లి ఆహ్వానించిన ప్రియురాలు.. తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య
- ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య!
- మద్యం మత్తులో గొడవపడ్డ యువకులు..పెట్రోల్ పోసి యువకుడి హత్య
- మహిళా అధికారిణి బెడ్రూంలో రహస్య కెమెరాలు..





