June 29, 2024
SGSTV NEWS
CrimeTelangana

తెల్లవారితే పెళ్లి చూపులు.. అంతలోనే మృత్యు ఒడికి

• జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం

• టిప్పర్ ఢీకొని యువకుడి మృతి

బంజారాహిల్స్: మరుసటి రోజే ఆ యువకుడికి పెళ్లి చూపులు..

ఉదయంలోగా ఇంటికి వెళ్లేందుకు బైక్పై బయలుదేరాడు. అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన కృష్ణమ్మ, సుధాకర్ దంపతుల కుమారుడు శివశంకర్ (30) రాయదుర్గం సమీపంలోని అడాప్స్ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్.

దుర్గం చెరువు సమీపంలోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. ఆదివారం పెళ్లి చూపులు ఉండటంతో శనివారం అర్ధరాత్రి మాదాపూర్ నుంచి బైక్పై స్వగ్రామానికి బయలుదేరాడు. రెండు నెలల క్రితమే ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న బుల్లెట్ బైక్పై హెల్మెట్ ధరించి జూబ్లీహిల్స్ అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంతో వచ్చిన టిప్పర్ శివశంకర్ బైక్ను ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Also read :

పెళ్లై, పిల్లులున్న 40 ఏళ్ల వ్యక్తితో.. 19 ఏళ్ల యువతి ప్రేమ.. చివరకు
ప్రమాదానికి కారణమైన టిప్పర్ను పోలీసులు గుర్తించారు. డ్రైవర్ పరారయ్యాడు. మరికొన్ని గంటల్లో స్వగ్రామంలో ఉండాల్సిన శివశంకర్ విగత జీవిగా మారడంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధుమిత్రులు పోలీస్ స్టేషన్ ఆవరణలో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంటికి బాధ్యతలను మోస్తున్న శివశంకరే కన్నుమూయడంతో కన్నవారు గుండెలవిసేలా రోదించారు. పెళ్లి చూపుల కోసం ఏర్పాట్లు చేసుకునే క్రమంలో ఈ దుర్ఘటన జరగడంతో శివశంకర్ పని చేస్తున్న సంస్థలో, స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

Also read :విమాననగర్‎లో వింత వింత శబ్దాలు.. అర్థరాత్రి రోడ్లపైకి జనం.. జరిగిందిదే..

Related posts

Share via