SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: బస్సు అద్దం ధ్వంసం చేసి.. కండక్టర్ పైకి పాము విసిరి.. మత్తులో వృద్ధురాలి దుశ్చర్యలు

చెయ్యెత్తినా ఆర్టీసీ బస్సును ఆపలేదంటూ.. మద్యం మత్తులో ఓ మహిళ ఖాళీ బీరు సీసాతో బస్సు అద్దం పగలగొట్టింది.

హైదరాబాద్ విద్యానగర్ ఘటన

నల్లకుంట, : చెయ్యెత్తినా ఆర్టీసీ బస్సును ఆపలేదంటూ.. మద్యం మత్తులో ఓ మహిళ ఖాళీ బీరు సీసాతో బస్సు అద్దం పగలగొట్టింది. తన వెంట తీసుకొచ్చిన పాముతో కండక్టర్ను బెదిరిస్తూ హైదరాబాద్ విద్యానగర్ లో ప్రధాన రహదారిపై గురువారం గందరగోళం సృష్టించింది. సీఐ జగదీశ్వర్రావు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని దమ్మాయిగూడకు చెందిన బేగం అలియాస్ ఫాతిమా బీబీ అలియాస్ అసీం (65) గురువారం సాయంత్రం విద్యానగర్ చౌరస్తాలో దిల్సుఖ్నగర్ డిపో 107 వీ/ఎల్ నంబర్ బస్సును ఆపాలంటూ చెయ్యెత్తింది. స్థానికంగా మూలమలుపు ఉండడం, రద్దీ కారణంగా డ్రైవర్ అక్కడ బస్సు ఆపలేదు. దీంతో ఆగ్రహించిన మహిళ.. తన వద్ద ఉన్న ఖాళీ బీరు సీసాతో బస్సు వెనుక అద్దం పగలగొట్టింది.



అనంతరం డ్రైవర్ బస్సును ఆపడంతో.. కండక్టర్ స్వప్న బస్సు దిగి బేగం వద్దకు వెళ్లి పారిపోకుండా గట్టిగా పట్టుకుంది. వదిలించుకోవాలని ఆమె ప్రయత్నించినా సాధ్యపడకపోవడంతో.. తన వద్ద ఉన్న సంచిలో పాము ఉందంటూ కండక్టర్ను బెదిరించింది. ఆ తర్వాత నాలుగు అడుగుల పొడవున్న పామును (జెర్రిపోతు) బయటికి తీసి కండక్టర్పైకి విసిరింది. అది స్వప్న ఒంటిమీద పడి నేలపైకి జారిపోయింది. ప్రయాణికులు, స్థానికులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బేగంను అదుపులోకి తీసుకున్నారు. పాము కోసం వెతికినా దొరకలేదు. ఆమె మద్యం మత్తులో ఉందని నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Also read

Related posts

Share this