February 24, 2025
SGSTV NEWS
CrimeTelangana

అంకుల్ మా అమ్మను.. మా నాన్నే చంపాడు

• మద్యానికి డబ్బులు ఇవ్వలేదని సుత్తితో భార్యతలపై బాదిన భర్త

• ఇంటిలోనే రక్తపు మడుగులో కుప్పకూలిన భార్య

• ముగ్గురు చిన్నారుల భవితవ్యం ఏమిటో?



కడప : భర్తే కాలయముడిగా మారి భార్య తలపై సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేసిన సంఘటన కడప నగరంలో సంచలనం కలిగించింది. మద్యం సేవించడానికి డబ్బులను ఇవ్వలేదనే నెపంతో జీవితాంతం తోడు నీడగా నిలిచి, పిల్లలకు మంచి తండ్రిగా చూసుకోవాల్సిన ఆ వ్యక్తి భార్యను కిరాతకంగా హత్య చేసిన సంఘటన హృదయవిదారకంగా మారింది. ఈ సంఘటన వారి ముగ్గురు పిల్లల జీవితాన్ని సుడిగుండంలోకి నెట్టేసింది. కడప నగరంలోని టూటౌన్ సీఐ బి. నాగార్జున, ఎస్ఐ ఎసెకెం హుసేన్, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని బెల్లమండివీధి, చిన్నమునిరావు వీధిలో గత నెల రోజులక్రిందట ఓ ఇంటిలో బాడుగకు పఠాన్ ఇమ్రాన్ ఖాన్, అతని భార్య పఠాన్ జమీల (28) చేరారు.

వీరికి ముగ్గురు సంతానం. వీరిలో షాహిదాఖానం(9), ఏజాజాఖాన్ (7), అలినాఖానం(5) ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ ఎలక్ట్రిషన్ పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. భార్యతో తరచూ గొడవపడుతూ తాను మద్యం సేవించి వచ్చి మరింత తీవ్రస్థాయిలో భార్యను వేధించేవాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం వరకు పనిచేసుకుని వచ్చిన ఇమ్రానాఖాన్ తన భార్యకు రూ. 1000 డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులో రూ.500 దాచిపెట్టి, రూ.300 తన భర్తకు మద్యం సేవించేందుకు ఇచ్చింది. రూ. 200 కూరగాయలను తీసుకుని వచ్చింది. రాత్రి 9 గంటల సమయంలో తనకు మద్యం సేవించడానికి ఇంకా డబ్బులు కావాలంటూ భార్య జమీలతో భర్త వాగ్వాదానికి దిగాడు.

ఈ నేపథ్యంలో భార్య జమీల ఈనెల అద్దె డబ్బులను కట్టాలని, అదే కట్టకుండా డబ్బులను మద్యానికి ఇవ్వమని అంటున్నావా? అనీ అరిచింది. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త తాను ఉపయోగించే ఎలక్రిషన్ కిట్లో ఉన్న సుత్తిని తీసుకుని ఆవేశంతో ఊగిపోతూ భార్య తలపై మూడు సార్లు దాడి చేశాడు. ఈ దెబ్బలకు రక్తపుమడుగులో అక్కడికక్కడే జమీల కుప్పకూలిపోయింది. తన తండ్రి తల్లిని సుత్తితో బాదిన విషయాన్ని గమనించిన పెద్దకుమార్తె షాహిదాఖానమ్ భయంతో తన బంధువుల ఇంటికి పరుగుతీసింది. వారికి చెప్పగానే జమీల బావ, అన్నదమ్ములు పరుగెత్తుకుంటూ వచ్చారు.

పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎట్టకేలకు స్థానిక ప్రజల సాయంతో జమీలను ఆటోలో రిమ్స్క తరలించారు. రిమ్స్ డాక్టర్లు ఆమె మృతి చెందిందని నిర్ధారించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. చుట్టుపక్కలా విచారించారు. తమ తల్లి దారుణంగా హత్యకు గురి కావడం, తన తండ్రే హత్య చేయడంతో ముగ్గురు పిల్లలు అనాథ«లుగా మారారు. వారి భవిష్యత్తు ఎలా వుంటుందోననీ స్థానికులు అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ సంఘటనతో ఐదుగురు జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది

Also read

Related posts

Share via