July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

హైదరాబాద్లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు – రూ.9 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం

హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని శివారులో నిషేధిత డ్రగ్స్‌ తయారు చేస్తున్న పరిశ్రమపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. భారీగా నిషేధిత ఔషధాల ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.9 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఐడీఏ బొల్లారం ప్రాంతంలోని ఓ పరిశ్రమలో పెద్ద ఎత్తున నిషేధిత డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్టు డీఆర్‌ఐ అధికారులకు ఇంటర్‌ పోల్‌ ద్వారా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఔషధ నియంత్రణ అధికారులు, బొల్లారంలోని ఔషధ తయారీ సంస్థపై దాడులు నిర్వహించారు.

నిషేధిత మెపిడ్రిన్‌ డ్రగ్స్‌ అక్కడ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. దాడుల్లో 90 కిలోల మెపిడ్రిన్‌ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గత 10 సంవత్సరాలుగా డ్రగ్స్‌ తయారు చేసి, విదేశాలకు తరలిస్తున్నట్టు ఔషధ నియంత్రణ శాఖ విచారణలో బయటపడింది. సిగరెట్‌ ప్యాకెట్లలో డ్రగ్స్‌ విదేశాలకు తరలిస్తున్నట్టూ తేలింది. హైదరాబాద్‌లో కూడా డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో పాటు పలు దేశాలకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఆపరేషన్ గరుడలో 25 వేల కిలోల డ్రగ్స్ గుట్టు రట్టు : మరోవైపు గురువారం ఏపీలోని విశాఖ తీరంలోనూ డ్రగ్స్‌ కలకలం రేగింది. బ్రెజిల్‌ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు వచ్చిన కంటైనర్‌లో సుమారు 25 వేల కిలోల డ్రగ్స్‌ ఉన్నట్లు సీబీఐ, నార్కోటిక్స్‌ అధికారులు గుర్తించారు. ఇంటర్‌ పోల్‌ అధికారులు ఇచ్చిన సమాచారంతో దిల్లీ సీబీఐ, విశాఖలోని సీబీఐ, కస్టమ్స్‌ అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.ఈ నెల 19న నార్కోటిక్స్‌ సామగ్రి, నిపుణులతో వచ్చిన సీబీఐ అధికారులు ఆ కంటైనర్లో భారీ మొత్తంలో డ్రగ్స్‌ ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగా అధికారులు వాటిని సీజ్ చేశారు. జర్మనీలోని హ్యాంబర్గ్‌ మీదుగా ఈ నెల 16న కంటైనర్‌ విశాఖకు వచ్చినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఓ ప్రైవేటు కంపెనీ ఈ డ్రగ్స్ బ్యాగులను 25 కిలోల చొప్పున 1000 బ్యాగుల డ్రగ్స్ నింపి సరఫరా చేసినట్లు తెలుస్తోంది.

Also read

Related posts

Share via