జాతకం లేని వారు గ్రహ దోషాలు ఎలా పోగొట్టుకోవాలి?
How to Know Horoscope : భూత, వర్తమానంతో పాటు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. సాధారణంగా మనం జీవితంలో జరగబోయే మంచి చెడులను గురించి తెలుసుకుని, ఏవైనా గ్రహ దోషాలుంటే పరిహారం చేయించుకోవడం కోసం జ్యోతిష్య శాస్త్ర పండితులను ఆశ్రయిస్తుంటాం. అయితే కచ్చితమైన ఫలితాలు తెలుసుకోవాలంటే వ్యక్తిగత జాతకం తప్పనిసరి అని పండితులు చెబుతారు. జాతకం ఉన్నవారి సంగతి సరే! మరి లేనివారి మాట ఏమిటి? ఈ ఆసక్తికరమైన విషయాలు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
జాతకం అంటే?
మన జీవితంలో విద్య, ఉద్యోగం, వివాహం, ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యం వంటివి అంశాల గురించి తెలుసుకోడానికి జ్యోతిష్య శాస్త్ర పండితులను ఆశ్రయిస్తుంటాం. అయితే పండితులు వ్యక్తిగత జాతకం ఉంటేనే కచ్చితమైన ఫలితాలు చెప్పగలమని అంటారు. ఒక వ్యక్తి ఏ రోజు, ఏ తిథి, ఏ నక్షత్రం, ఏ వారంలో పుట్టాడో తెలిపి వాటి ఆధారంగా రాబోయే కాలంలో ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయో తెలిపేదే జాతకం. హిందూ సంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన వెంటనే జాతకాన్ని పండితుల చేత వ్రాయిస్తారు. దీనినే జన్మకుండలి అంటారు. అయితే కొందరికి అలాంటి ఆనవాయితీ ఉండదు.
జన్మకుండలి అంటే?
జన్మకుండలి ఆధారంగా జాతకాలు తెలుసుకునేందుకు వ్యక్తి జన్మించిన తేదీ నెల, సంవత్సరంతో సహా, సమయం, పుట్టిన ప్రదేశం తప్పనిసరి. ఇవన్నీ కచ్చితంగా ఉంటే జాతకం కూడా కచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుంది. జనన సమయం సరిగా ఉండాలి. ఇదే లగ్నం నిర్ణయించేందుకు ముఖ్య ఆధారం. ఈ లగ్నాన్ని బట్టే ఫలితాలు నిర్ధరించడం సాధ్యమవుతుంది.
జాతకం లేకపోతే ఏమి చేయాలి?
కొందరికి జన్మించిన తేదీ, సమయం తెలియదు. వారి పెద్దలు చెప్పే కొండ గుర్తుల ద్వారా కొంతవరకు సంవత్సరం, తేదీ, నక్షత్రం వంటివి నిర్ధరించవచ్చు. అయితే, జన్మ కుండలి వేయడం దీనివల్ల సాధ్యం కాదు. కేవలం రాశి ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. జాతకం లేని వారికి జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏ గ్రహానికి ఎలాంటి పరిహారం చేయాలో చెప్పడం కష్టం అవుతుంది. అలాంటి వారికి అద్భుతంగా ఉపయోగపడే పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యం, విజయం కోసం!
ఇది సూర్యునికి సంబంధించినది. ఈ ఆదిత్య హృదయం రామ రావణ యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి రామునికి ఉపదేశించాడు. దీనిని రోజూ ప్రాతః సమయమున పఠించడం వల్ల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు పొందవచ్చు. ముఖ్యంగా ఆదిత్య హృదయం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. జాతకం ఉన్నా లేకపోయినా ప్రతి రోజు ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు ఈ పఠనం మనిషిలో దాగి ఉన్న కామ,క్రోధాది అంతః శత్రువులను నాశనం చేస్తుంది. ప్రతి నిత్యం ఆదితాయ్ హృదయం జపిస్తే విజయం తప్పక లభిస్తుంది. శ్రీరాముడు ఆదిత్య హృదయం పఠించిన పిదపనే రావణుని పై విజయం సాధించాడు.
రుణ విమోచక అంగారక స్తోత్రం
ఆర్థిక ఇబ్బందులతో అప్పులు చేయాల్సి వస్తుంది. వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటే రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని 41 రోజులు పారాయణ చేస్తూ, నవగ్రహాలకు రోజూ 27 ప్రదక్షిణలు చేయాలి. చివరి రోజు కందులు, ఎరుపురంగు వస్త్రం, దక్షిణ పెట్టి, కుజునకు అష్టోత్తరం చేయిస్తే రుణవిమోచనం కలుగుతుంది.
ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నారా?
ఎంత సంపాదించినా ధనం చేతిలో నిలవకుండా ఖర్చయి పోతుంటే విష్ణు సహస్ర నామ స్తోత్రం 41 రోజులు భక్తిశ్రద్ధలతో పారాయణ చేయాలి. ఈ పారాయణ సాయంత్రం వేళ చేస్తే ఇంకా మంచిది. చివరి రోజు విష్ణు ఆలయానికి వెళ్లి గోత్ర నామాలతో స్వామికి అష్టోత్తరం చేయిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
సంతాన ప్రాప్తి కోసం
వివాహమై చాలాకాలంగా సంతానం లేనివారు శ్రీకాళహస్తి రాహు, కేతు, కుజ గ్రహాలకు సర్ప దోష నివారణ పూజ చేయిస్తే మంచిది. అలాగే సంతాన గోపాలకృష్ణ వ్రతం నియమ నిష్టలతో జరిపించడం వల్ల కూడా తప్పక సంతానం కలుగుతుంది.
వివాహం ఆలస్యమవుతోందా?
వివాహం ఆలస్యం అవుతున్న వారు భాగవతంలోని రుక్మిణి కల్యాణం పారాయణ చేయడం మంచిది. అలాగే ఆదిదంపతులైన శివపార్వతుల కల్యాణం జరిపించడం వల్ల కూడా త్వరగా వివాహం జరుగుతుంది.
డబ్బు ఇబ్బందులా!
తరచుగా డబ్బుకు ఇబ్బందిగా ఉంటే ధన కారకుడైన దత్తాత్రేయుని జీవిత చరిత్ర అయిన గురుచరిత్రను 41 రోజులు పారాయణ చేస్తూ, ప్రతిరోజూ దత్తాత్రేయ మందిరమునకు వెళ్లి, ఆలయాన్ని శుభ్రపరుస్తూ దత్తాత్రేయుడుని దర్శించుకోవాలి. 41వ రోజు దత్తాత్రేయునికి తీపి బూంది నైవేద్యం పెట్టి, పేదలకు పంచి పెడితే ధనంకు సంబంధించిన ఇబ్బందులు తగ్గిపోతాయి.
సకల విజయాలకు హనుమాన్ చాలీసా! ఇదే తారకమంత్రం
హనుమంతుడు కల్పవృక్షం లాంటి వాడు. కల్పవృక్షాన్ని ఆశ్రయించిన అన్ని కోరికలు తీరుతాయి. అటువంటి కల్పవృక్షం అనుగ్రహం పొందటానికి సులభమైన మార్గం “హనుమాన్ చాలీసా”. ఈ హనుమాన్ చాలీసాను దినమునకు 11 పర్యాయములు చొప్పున మండలం అంటే 40 రోజులు పారాయణ చేస్తే సర్వ కార్య సిద్ధి కలుగును. ఒకసారి దీక్షతో 108 పర్యాయములు పఠించిన విశేష కార్యసిద్ధి కలుగును. రోజుకు మూడు సార్లు చొప్పున ప్రతిరోజూ పఠించిన వారి యోగక్షేమాలు శ్రీరామ భక్తుడగు హనుమంతుడు స్వయంగా చూసుకుంటాడు. జాతకం లేనివారి కోసం జ్యోతిష్య శాస్త్ర పండితులు పరిశోధించి తయారు చేసిన ఈ సులభమైన పరిహారాలు పాటిస్తే సుఖమయ జీవితం సొంతమవుతుంది. శుభం భూయాత్!
