SGSTV NEWS online
Andhra PradeshCrime

సిఎం పేషీ పేరుతో భారీ మోసం



ఉద్యోగాల ఆశ చూపి రూ. లక్షలు వసూలు చేసిన ముఠా గుట్టురట్టు


అనకాపల్లి : ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నత స్థాయి పరిచయాలున్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి సామాన్యులను మోసం చేస్తున్న అంతర్‌ జిల్లా మోసగాళ్ల ముఠాను అనకాపల్లి జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ కేసు వివరాలను ఎస్‌పి తుహిన్‌సిన్హా శుక్రవారం మీడియాకు వెల్లడించారు. రోలుగుంట మండలానికి చెందిన ఒక మహిళ డిఎస్‌సి పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎరగొర్ల శ్రీను ఆమె భర్తకు పరిచయమయ్యారు. తనకు సిఎం పేషీలో పెద్దవారితో సంబంధాలు ఉన్నాయని, రూ.15 లక్షలు ఇస్తే ఫిబ్రవరి 2025 డిఎస్‌సిలో ఎస్‌జిటి పోస్టు ఇప్పిస్తానని నమ్మబలికారు. బాధితులకు నమ్మకం కలిగించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నట్లుగా రూపొందించిన ఒక నకిలీ ఆడియో క్లిప్పింగ్‌ను పంపారు. బాధితులకు అనుమానం వచ్చినప్పుడల్లా మంత్రి నారా లోకేష్‌, పిఎ భార్గవ్‌ చౌదరి మాట్లాడుతున్నట్లుగా మరొక వ్యక్తితో కాన్ఫరెన్స్‌ కాల్‌ మాట్లాడించారు. ఉద్యోగం పేరుతో నిందితులు బాధితుల నుంచి విడతల వారీగా దాదాపు రూ.12.13 లక్షలు వసూలు చేశారు. ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో బాధితులు రోలుగుంట పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు ఎరగొర్ల శ్రీనును ఈ నెల 16న అరెస్ట్‌ చేశారు. ఆయన గతంలో విజయవాడలో లైన్‌మ్యాన్‌ పోస్ట్‌ పేరుతో రూ.2.50 లక్షలు, అద్దంకిలో ఎస్‌ఐ పోస్ట్‌ పేరుతో రూ.11 లక్షలు వసూలు చేసిన పాత నేరస్తుడని విచారణలో తేలింది. రెండో నిందితుడు షేక్‌ సలీం విజయవాడకు చెందినవారు. ఆయన శ్రీను ఇచ్చిన రూ.50 వేలు కోసం మంత్రి పిఎగా నటించి బాధితులను బెదిరించారు. అతడిని విజయవాడలో ఈ నెల 22న అరెస్టు చేశారు. నిందితులను పట్టుకున్న అనకాపల్లి డిఎస్‌పి ఎం శ్రావణి, కొత్తకోట సిఐ జి.కోటేశ్వరరావు, రోలుగుంట ఎస్‌ఐ పి రామకృష్ణారావును ఎస్‌పి అభినందించారు.

Also read

Related posts