SGSTV NEWS
LifestyleSpiritual

దక్షిణ భారతీయులు ఎందుకు అరటి ఆకులో భోజనం చేస్తారో తెలుసా..?



దక్షిణ భారతదేశంలో అరటి ఆకు భోజనం ఒక ప్రత్యేకమైన సంప్రదాయం. ఇది కేవలం పండుగలు, శుభకార్యాలకే పరిమితం కాకుండా.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పద్ధతిగా కూడా ప్రాచుర్యం పొందింది. ఆయుర్వేదం ప్రకారం.. అరటి ఆకులపై భోజనం చేయడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.


దక్షిణ భారతదేశంలో పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్ల వంటి ప్రత్యేక సందర్భాల్లో అరటి ఆకుల్లో భోజనం వడ్డించడం ఒక ప్రత్యేకమైన ఆచారం. ఇది కేవలం పూర్వీకుల నుండి వచ్చిన సంప్రదాయం మాత్రమే కాదు.. పర్యావరణానికి మేలు చేసే గొప్ప పద్ధతి కూడా. ఆయుర్వేదం ప్రకారం అరటి ఆకులపై భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

సహజ రోగనిరోధక శక్తి
అరటి ఆకుల్లో పాలీఫినాల్స్ అనే సహజమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియాను నిరోధిస్తాయి. వేడి ఆహారం ఆకుపై పడ్డప్పుడు.. ఈ పోషకాలు స్వల్పంగా ఆహారంలో కలిసి మన శరీరానికి మేలు చేస్తాయి.

రుచికరమైన భోజనం
వేడి ఆహారం అరటి ఆకుపై ఉన్న మృదువైన పూతను తాకినప్పుడు.. ఒక ప్రత్యేకమైన సహజ సువాసన వస్తుంది. ఈ సువాసన వల్ల భోజనం మరింత రుచికరంగా మారుతుంది.


పర్యావరణ పరిరక్షణ
అరటి ఆకులు పూర్తిగా ప్రకృతి సిద్ధమైనవి, 100 శాతం బయోడిగ్రేడబుల్. ఇవి వాడిన తర్వాత సహజంగానే కుళ్లిపోయి భూమికి ఎరువుగా మారతాయి. ప్లాస్టిక్ లేదా ఇతర వస్తువుల మాదిరిగా ఇవి పర్యావరణానికి హానికరం కావు.

వేడి ఆహారానికి బెస్ట్
తాజాగా వండిన వేడి వేడి వంటకాలను అరటి ఆకులు సులభంగా తట్టుకుంటాయి. వాటిపై ఉండే సహజమైన మైనపు పొర వల్ల ఆహారం ఆకుకు అంటుకోదు. అలాగే వేడి వల్ల ఎలాంటి హానికర రసాయనాలు ఉత్పత్తి కావు.

జీర్ణ సమస్యలకు చెక్
అరటి ఆకులపై భోజనం చేయడం వల్ల ప్రశాంతమైన వాతావరణంలో నెమ్మదిగా తినడం అలవాటవుతుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. ఈ పద్ధతి భోజన సమయంలో శరీరంలో సానుకూల శక్తిని పెంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

Related posts

Share this