December 19, 2024
SGSTV NEWS
CrimeTelangana

రైతు బీమా రూ.11.50 లక్షలు స్వాహా!.. చేసిన ఏఈవో



మృతి చెందిన రైతు కుటుంబాలకు బీమా కింద మంజూరైన సొమ్మును ఓ ఏఈవో తన ఖాతాలోకి మళ్లించుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో బయటపడింది.

కురవి, : మృతి చెందిన రైతు కుటుంబాలకు బీమా కింద మంజూరైన సొమ్మును ఓ ఏఈవో తన ఖాతాలోకి మళ్లించుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో బయటపడింది. ఇలా ముగ్గురి సొమ్ము రూ. 13 లక్షలు తన ఖాతాకు మళ్లించుకున్న ఏఈవో.. ప్రశ్నించిన ఒకరికి రూ. 1.5 లక్షలు తిరిగి ఇచ్చినట్లు తెలుస్తోంది. కురవి మండలం గుండ్రాతిమడుగు(వి)కు చెందిన వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) కల్యాణ్ చేసిన ఈ అక్రమాలపై బాధితులు మండల వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది. గుండ్రాతిమడుగుకు చెందిన షేక్ హుస్సేన్ అక్టోబరు 12న మృతి చెందారు. రైతుబీమా సొమ్ము రూ.5 లక్షలు అతడి భార్య మైబ్ బ్యాంకు ఖాతాలో నవంబరు 13న జమయ్యాయి. ఏఈవో ఆమెతో సంతకాలు చేయించి రూ.3 లక్షలు తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. మిగిలిన రూ.2 లక్షలు ఆమెకు ఇచ్చాడు. మిగతా రూ.3 లక్షలు తర్వాత వస్తాయని నమ్మబలికాడు. 15 రోజులకు విషయం తెలిసిన మైబ్.. ఏఈవోను ప్రశ్నించగా రూ.1.50 లక్షలు ఇచ్చాడు. ఇదే గ్రామానికి చెందిన రైతు  కేతం లక్ష్మణ్ మృతి చెందగా.. నామినీగా ఉన్న అతని తల్లి వెంకట మల్లమ్మ ఖాతాలో అక్టోబరు 25న రూ.5 లక్షలు జమయ్యాయి. ఈ సొమ్మును ఏఈవో తన ఖాతాలోకి మళ్లించుకోవడంతో ఆమె ఎంఈవోకి ఫిర్యాదు చేశారు. గేటుతండాకు చెందిన బానోతు బాలు సెప్టెంబరు 6న మృతి చెందగా.. అక్టోబరు 18న అతని భార్య ఇరాని ఖాతాలో రూ.5 లక్షలు జమయ్యాయి. ఈమె సొమ్మును కూడా ఏఈవో తన ఖాతాలో వేసుకున్నాడు. 15 రోజుల తర్వాత ఆమె నిలదీయగా.. చెక్కు రాసిచ్చాడు. దాన్ని బ్యాంకులో వేస్తే చెల్లలేదని ఇరాని తెలిపారు.



నిజమే.. నివేదిక పంపాం: ఎంఏవో

ఈ వ్యవహారాలపై ఏఈవో కల్యాణ్ను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా.. బాధితులను అడిగి.. వారి నుంచి అప్పుగా ఆ సొమ్ము తీసుకున్నట్లు చెప్పారు. మండల వ్యవసాయాధికారి (ఎంఏవో) నర్సింహారావును వివరణ కోరగా.. బాధితుల ఖాతాల్లోంచి ఏఈవో కల్యాణ్ సొమ్మును తీసుకున్నది వాస్తవమేనని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపామన్నారు. కురవి ఎస్సై సతీశ్ను సంప్రదించగా.. తమకు ఫిర్యాదులేవీ అందలేదన్నారు.

Also read

Related posts

Share via