December 3, 2024
SGSTV NEWS
Crime

నకిలీ పెళ్లిళ్ల ముఠా అరెస్ట్

తుమకూరు: వయస్సు దాటినా పెళ్లి కాని పురుషులను లక్ష్యంగా చేసుకుని పెళ్లి చేసి వంచిస్తున్న ముఠాను జిల్లాలోని గుబ్బి పోలీసులు అరెస్ట్ చేశారు. గుబ్బి తాలూకా అత్తిగట్టె గ్రామానికి చెందిన దయానందమూర్తికి 37 సంవత్సరాలు దాటినా పెళ్లి కాలేదు. అతనికి పెళ్లి చేసేందుకు తండ్రి పాలాక్షి అనేక మంది పెళ్లిళ్ల పేరయ్యలను సంప్రదించినా ఫలితం లేకపోయింది. ఇలా ఉండగా కుష్టగికి చెందిన బసవరాజు ద్వారా లక్ష్మి అనే మహిళ పాలాక్షికి పరిచయమైంది.

తన కుమారుడికి కన్యను వెదికి పెట్టాలని కోరాడు. హుబ్లీలో ఒక మంచి పిల్ల ఉందని, తల్లిదండ్రులు లేరని చెప్పింది. దీంతో యువతితో పాటు ఆమె పిన్ని, బాబాయి గత ఏడాది నవంబర్ 11న పెళ్లి కుమారుడిని చూసేందుకు వచ్చారు. పిల్ల దొరికిన ఆనందంలో ముందు వెనుకా ఆలోచించకుండా దయానందమూర్తికి గ్రామంలోని గుడిలోనే పెళ్లి చేశారు. వధువుకు బంగారు గొలుసు, తాళిబొట్టు, చెవికమ్మలు పెట్టారు. సంబంధం కుదిర్చిన లక్ష్మికి రూ.1.5 లక్షలు చెల్లించారు.

పెళ్లయిన రెండు రోజుల తర్వాత సంప్రదాయం పేరిట ఆభరణాలు ధరించిన పెళ్లి కుమార్తెను వాపసు పిలుచుకెళ్లారు. వారం గడిచినా తిరిగి రాకపోవడంతో పెళ్లి కుమారుడి తండ్రి హుబ్లీకి వెళ్లి విచారించగా నకిలీలని తేలింది. పాలాక్ష ఫిర్యాదు మేరకు గుబ్బి పోలీసులు ఏడాది కాలంగా మహారాష్ట్ర, హుబ్లీలో గాలింపు చేపట్టి ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని అరెస్ట్ చేశారు. నకిలీ చిరునామాతో సృష్టించుకున్న ఆధార్కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పెళ్లికుమార్తెగా నటించిన యువతికి ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న విషయం, బాబాయి, పిన్నిగా నటించిన వారు కూడా నకిలీ బంధువులని తేలింది.

Also read

Related posts

Share via