July 5, 2024
SGSTV NEWS
CrimeTelanganaTrending

ఆబ్కారీ అధికారి.. అక్రమార్జనలో ఆరితేరి

ఆబ్కారీశాఖలో ఓ సూపరింటెండెంట్ స్థాయి అధికారికి ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంపై ఓ దర్యాప్తు సంస్థ ఆరా తీస్తోంది.

*  ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆస్తులపై సమగ్ర వివరాలతో ఫిర్యాదు

*   రూ.వందల కోట్ల స్థిరాస్తులు, వ్యాపారాలపై దర్యాప్తు సంస్థ ఆరా

హైదరాబాద్: ఆబ్కారీశాఖలో ఓ సూపరింటెండెంట్ స్థాయి అధికారికి ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంపై ఓ దర్యాప్తు సంస్థ ఆరా తీస్తోంది. అడ్డగోలుగా సంపాదించిన ఆస్తులను ఎక్కడెక్కడ కూడబెట్టారు..? ఎవరెవరిని బినామీలుగా ఏర్పాటు చేసుకున్నారు..? స్థిరాస్తి, నిర్మాణరంగాలతోపాటు మద్యం దందాల్లో ఎవరి పేరిట పెట్టుబడులు పెట్టారు..? వంటి సమగ్ర వివరాలతో ఆయనపై ఫిర్యాదు అందింది. ఈ మొత్తం ఆస్తుల విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని ఫిర్యాదులో పేర్కొనడంతో దర్యాప్తు సంస్థ లోతుగా విచారిస్తోంది. వాటికి సంబంధించిన దస్తావేజుల్ని సేకరించే పనిలో నిమగ్నమైంది. ఇటీవలే వివాదంలో చిక్కుకున్న ఓ ప్రముఖ లిక్కర్ గ్రూపులోనూ అతడి కుటుంబసభ్యులకు వాటాలున్నట్లు పేర్కొనడం గమనార్హం. గడిచిన పదేళ్లకాలంలో ఆబ్కారీశాఖలో కీలకమైన పోస్టింగులతో ఓ వెలుగు వెలిగిన ఆ అధికారి ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దు జిల్లాలో పనిచేస్తున్నారు. అప్పట్లో మరికొందరు ఉన్నతాధికారులతో ప్రత్యేక కోటరీ ఏర్పాటు చేసుకొని క్రియాశీలకంగా వ్యవహరించారనే  పేరుంది. మునుగోడు ఉపఎన్నిక సమయంలో అక్కడ ఓ మామిడితోటలో ప్రత్యేక క్యాంపు నిర్వహించి ఓ ప్రముఖ పార్టీ తరపున మంత్రాంగం నెరిపారనే ఆరోపణలున్నాయి. తాజాగా ఆయనపై ఫిర్యాదు రావడం ఆబ్కారీశాఖలో చర్చనీయాంశంగా మారింది.

వెంచర్లలో.. మద్యం వ్యాపారంలో వాటాలు 

*  ఫిర్యాదులోని వివరాల మేరకు.. మహేశ్వరం మండలంలో 500కు పైగా ఎకరాల్లో వెలసిన ఓ వెంచర్లో మిర్యాలగూడకు చెందిన వ్యాపారితో కలిసి ఎక్సైజ్ సూపరింటెండెంట్కు భాగస్వామ్యం ఉంది. ఇదే వ్యాపారితో ఎల్బీనగర్ ప్రాంతంలోని మరో 100 ఎకరాల వెంచర్లోనూ భాగస్వామిగా ఉండటంతోపాటు తుక్కుగూడ, నార్సింగిలలో రూ.5 కోట్ల విలువైన విల్లాలు, సంగారెడ్డిలో 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు పేర్కొన్నారు.

• గ్రేటర్ హైదరాబాద్లో గ్రూపుగా నిర్వహిస్తున్న మద్యం వ్యాపారంలో అధికారి కుటుంబ సభ్యుల పేరిట 25శాతం వాటా(రూ.10 కోట్లు) ఉన్నట్లు పేర్కొన్నారు.

• చంపాపేటలో మరో ఎక్సైజ్ సీఐతో కలిసి రెస్టారెంటు ఏర్పాటు చేయడంతోపాటు మరో విశ్రాంత సబజిస్ట్రార్తో కలిసి పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున ఆస్తులు కొన్నట్లు చెప్పారు.

• నల్గొండ, సూర్యాపేట, బాన్అంబర్పేట, మన్సూరాబాద్లలో ఓపెన్ప్లేట్లతోపాటు నల్గొండ జిల్లా తిప్పర్తి, వేములపల్లి, నకిరేకల్, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, కందుకూరు, భువనగిరి జిల్లా బొమ్మలరామారం, చౌటుప్పల్, సంగారెడ్డిలలో వ్యవసాయ భూములు సమకూర్చుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

బినామీలుగా తోటి అధికారుల కుటుంబసభ్యులు..

అబ్దుల్లాపూర్మెట్లో బార్ అండ్ రెస్టారెంట్, చేవెళ్ల, షాద్నగర్లలో కల్లు దుకాణాలు నిర్వహించే వ్యక్తితోపాటు అతడి కుటుంబసభ్యులు సదరు ఎక్సైజ్ సూపరింటెండెంటు బినామీలుగా ఉన్నారు.

• గతంలో ఎక్సైజ్ డీపీఈవోగా పనిచేసినప్పుడు తన వాహన డ్రైవర్ పేరిట నాలుగైదు ప్రాంతాల్లో ఆస్తులు కొన్నారు.

• ఆయనకు నమ్మకస్తుడిగా ఉన్న ఓ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు టాస్క్ ఫోర్స్ కానిస్టేబుళ్లు, ఓ ఎక్సైజేస్టేషన్ డ్రైవర్ కుటుంబ సభ్యులను బినామీలుగా పెట్టుకున్నారు. నల్గొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను కూడా బినామీలుగా పెట్టుకొన్నట్లు ఫిర్యాదులో వివరించారు.

Also read

Related posts

Share via