SGSTV NEWS online
CrimeTelangana

హెచ్ఐవీ రాకున్నా.. సూటిపోటి మాటలు చంపాయి




వైరస్ ఉన్న రక్తం ఎక్కించిన ఘటనలో బాధితురాలి ఆత్మహత్య.

హైదరాబాద్; ఘట్కేసర్, : ప్రేమించిన వ్యక్తితో కలిసి బతకాలనుకుంది. అతడికి హెచ్ఐవీ ఉన్నట్లు తెలియడంతో ఇంట్లో పెళ్లికి నిరాకరించారు. భరించలేని అతడు కక్షగట్టి ప్రేమించిన అమ్మాయికి తన రక్తాన్ని ఎక్కించాడు. ఈ ఘటనతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. హెచ్ఐవీ సోకనప్పటికీ సూటిపోటి మాటలతో కలత చెంది నెలరోజుల తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీకారిడార్ ఠాణా పరిధిలో శుక్రవారం జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లాకు చెందిన మనోహర్ (26) కుటుంబం పాతికేళ్ల క్రితం నగరానికి వచ్చి ఘట్కేసర్ మండలం అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉంటోంది. యువకుడు ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్. అతని తల్లిదండ్రులకు హెచ్ఐవీ ఉంది. తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించాడు. అతను తమ ఇంటికి సమీపంలో ఉంటున్న మరదలు రమణి(24)ని ఇష్టపడ్డాడు. పెద్దలు సమ్మతించటంతో ప్రేమగా మెలిగారు.

వివాహానికి సిద్ధమయ్యే సమయంలో మనోహర్కు యువతి తండ్రి రక్తపరీక్షలు చేయించగా హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. దీంతో వివాహం రద్దు చేసుకున్నారు. చిన్ననాటి నుంచి ప్రేమించిన యువతి.. దూరం కావటంతో భరించలేకపోయాడు. ఆమెకూ హెచ్ఐవీ పాజిటివ్ ఉంటే తనతోనే వివాహం చేస్తారని క్రూరంగా ఆలోచించాడు. మార్చి 11న సిరంజీ కొని తన రక్తాన్ని ఎక్కించాడు. తర్వాత యువతి ఇంటికి వెళ్లి ఆమెకు బలవంతంగా అదేరక్తం ఎక్కించి పారిపోయాడు. బాధితురాలు విషయం రహస్యంగా ఉంచింది. కొద్దిరోజుల తరువాత ఆమెకు జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లినపుడు విషయం బయటపడింది. వైద్యపరీక్షలో యువతికి హెచ్ఐవీ సోకలేదని తేలింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు గతనెల 14న నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం నిందితుడు జైలులో ఉన్నాడు.

మనోవేదనతో కుమిలిపోయి..

తన జీవితంలో ఊహించని మార్పును యువతి తట్టుకోలేకపోయింది. ప్రేమించిన వ్యక్తే… తనకు హెచ్ఐవీ రక్తం ఎక్కించిన విషయం బయటకు రాగానే.. స్నేహితులు దూరమయ్యారు. బంధువులు ముఖం చాటేశారు. బయటకెళితే సూటిపోటి మాటలు. దారెంట నడుస్తుంటే పక్కకు జరిగే ఇరుగుపొరుగు. ఎక్కడికెళ్లినా వింతగా చూడటంతో తల్లడిల్లిపోయింది. ఈ మనోవేదనతో ఉరివేసుకుంది. తల్లిదండ్రులు ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

అమ్మా.. నన్ను క్షమించు…

“అతడితో పెళ్లి వద్దని అమ్మానాన్న చెప్పారు. నా జీవితం ఆగమవుతుందన్నారు. హెచ్ఐవీ అంత ప్రమాదమని నాకు తెలియదు. ఇంట్లోవాళ్లంతా చెప్పాక హెచ్ఐవీ ఎంత సీరియసో తెలిసింది.. అమ్మా క్షమించు.. నువ్వు కష్టపడి చదివించినా నా జీవితం నాశనం చేసుకున్నా. మరో జన్మ ఉంటే నీ కడుపులోనే పుట్టాలని కోరుకుంటున్నా. చిన్నా, మున్నా అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోండి. వాళ్లు చెప్పినట్లు వినండి. నన్ను క్షమించండి.. గౌరవం, విలువ పోయాక బతకడం బాగాలేదు” అంటూ లేఖలో తన వేదన పంచుకుంది.

Also read

Related posts