October 17, 2024
SGSTV NEWS
SpiritualSri Ganesha Puranam

శ్రీ గణేశ పురాణం | Sri Ganesha Puranam ఎనిమిదవ అధ్యాయము

శ్రీ గణేశపురాణం  ఎనిమిదవ అధ్యాయము

ఉపాసనాఖండము మొదటి భాగము
నానాపక్షి నివారణం
ఇట్లా గుణవర్ధనుడనే ఆ బ్రాహ్మణుడు ఎన్నో విధాల వేడుకున్నా వజ్రమంతటి కఠినమైన నీ హృదయమే మాత్రం కరుగలేదు! చాలాకాలంగా ఘోరకృత్యాలను జంకూగొంకులులేకుండా చేస్తూండటంవల్ల కరడు గట్టిన కాఠిన్యంతో, జాలి అన్నమాట మందుకిగూడ లేకుండా నిర్దయగా ఆ బ్రాహ్మణుడితో నీవిలాగన్నావు.

“ఓ బ్రాహ్మణోత్తమా! నీవిలా ఎంత వేడుకుంటే మాత్రం ప్రయోజనమేముంది? చెవిటివాడి చెవిన శంఖం ఊదినట్లు నా దగ్గర నీ ఉపదేశాలేం పనికివస్తాయి?త్రాగినవాడికి తత్త్వోపదేశం చెవికెక్కుతుందా? ధనార్జనే ప్రధానమైన వాడికి తల్లిదండ్రీ బంధువులూఅన్న విచారం ఉండనట్లు, కామాతరునకు సిగ్గులజ్జా మచ్చుకైనాలేనట్లు నావద్ద కూడా నీవు ఊహించే జాలీ, దయా వంటి సుగుణములేమీ లేవు! ఐనా చాలాకాలంగా పనిలేని నాచేతికి చిక్కావు! నిన్ను ఊరికే వదుల్తానా? అని పల్కుతూ, “ఓ రాజా! దయాశూన్యుడవై కుడిచేత్తో ఖడ్గంతీసి వాని శిరస్సును ఖండించావు! ఇలా లెక్కలేనన్ని బ్రహ్మహత్యలను నిస్సంకోచంగా చేశావు! ఇలా ఎంతో కాలం గడిచాక నీకు ముసలితనం కూడా వచ్చింది. శరీరంలో కఫము, శ్లేష్మము,వాతములు ఉద్రేకించి అటూ ఇటూ కదలలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నీభార్య, పుత్రులు,సేవకులూ అందరూ నిన్ను నిరాదరణతో త్రోసివైచారు.

ఎవరూలేని ఏకాకివై, ఒక రహస్య స్నేహితుడిని చేరబిలిచి అక్రమంగా సంపాదించిన నీ ధనాన్నంతటినీ దాన ధర్మములు చేసేయవలెనని సంకల్పించి ఆ అరణ్యంలో బ్రాహ్మణులందరినీ పిలిచి వారికి దానములివ్వబోగా“పతితుడ” వైన నీవద్ద దానంపట్టి తమ పుణ్యాన్ని నశింపచేసుకోలేమని నిరాకరించారు.

అంతేకాదు మహాపాపివైన నీవంటివాడితో సంభాషించటం కూడా ఎంతో దోషమని, దాని నివారణకై సచేలస్నానంచేసి, అఘమర్షణ మంత్రాలను,పవమాన సూక్తమునూ జపించి వెడలిపోయారు ఈ సంఘటనతో నీకు పశ్చాత్తాపము కల్గింది. నీ దగ్గర అన్యాయంగా ఆర్జించిన ధనాన్నంతటినీ ఖర్చుచేసేసే మార్గం తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్నావు. అప్పుడు ఆ అరణ్యంలో ఉన్న ఒక జీర్ణదేవాలయాన్ని బాగుచేయాలన్న ఆలోచనకల్గింది.

అప్పుడు కొందరు విప్రులు నీకిలా సలహాయిచ్చారు. “ఓయీ! అతి ప్రాచీనమైన ఈ ఆలయంలో ఒక గణేశుని మూర్తిఉన్నది. నీవు సకలాంగ సుందరంగా ఈ ఆలయాన్ని పునర్నిర్మించి ప్రాయశ్చిత్తం చేసుకోవటమే నీకు తగిన పని!” అప్పుడు నీవు వారి మాటవిని నాలుగు తోరణాలతోనూ, నాలుగుద్వారాలతోనూ అనేక స్థంభాలతో, వేదికలతో విలసిల్లే దివ్యమైన గణేశమందిరాన్ని, ముత్యాలు పగడాలతో తాపబడిన వాకిళ్ళతోనూ, నానారకాల ఫలవృక్షాలతో నిండివున్న దానిని నిర్మించి, అందులో నాలుగు దిక్కులలోనూ నీటివసతికని దిగుడు బావులనూ సదుపాయంగా త్రవ్వించి ఒక బ్రహ్మాండమైన గణేశ దేవాలయాన్ని కట్టించి నీవు ఆర్జించిన ధనాన్నంతటినీ ఖర్చుచేశావు! నీవార్జించిన దానిలో కొంత ధనాన్ని నీ భార్యాపుత్రులూ, సేవకులూ మోసంతో హరించినారు. అనంతరం కొద్దికాలానికి నీవు మరణించావు! అప్పుడు యమదూతలు నిన్ను తమ పాశాలతో బంధించి,కొరడాలతో కొడుతూ, ముళ్ళతో గుచ్చుతూ సూదులవంటి రాళ్ళపై పడదోస్తూ ఘోరమైన మహానరకాలలో పడద్రోశారు! ఇలా యమదూతలతో హింసించబడుతూ యముడి సన్నిధికి వెళ్ళగా యముడిలా నిన్ను ప్రశ్నించాడు. ఓరీ! నీవు ముందుగా చేసిన పాపాన్ని అనుభవిస్తావా? లేక పుణ్యాన్ననుభవిస్తావో చెప్పు” అనగా నీవు ముందుగా పుణ్యాన్నేఅనుభవిస్తానన్నావు!
అప్పుడు నీవు జీర్ణమైన గణేశ దేవాలయాన్ని ఉద్ధరించిన నీపుణ్య విశేషంచేత చంద్రుడివంటి శరీరకాంతితో భయంకర సోమకాంత మహారాజుగా పుట్టావు. అలా నీ పుణ్యఫలంఅంతా ఖర్చు అయిపోయినాక,పాపఫలంవల్ల నీకీ కుష్టువ్యాధి సంభవించింది!

అని భృగుమహర్షి సోమకాంతమహారాజుతో అతని పూర్వజన్మ వృత్తాంతం చెబుతూండగా ఓమహర్షులారా!ఆ మహారాజుకు హృదయంలో ‘ఇదంతా నిజమా?’ అన్న సంశయం కలిగింది. వేదశాస్త్రాలలో నిధివంటివాడూ, త్రికాలవేదీయైనటువంటి ఆ మహనీయుని వాక్కులను సంశయించిన దోషానికి వెంటనే ఆ ఋషి శరీరంలోంచి ఒక పక్షులగుంపు వెలువడి ఆ సోమకాంతరాజుయొక్క శరీరాన్ని ఖండఖండాలుగా పొడుచుకు తినసాగాయి!” అంటూ సూతమహర్షి అక్కడి మహర్షులతో కధాగమనాన్ని ఇలా కొనసాగించాడు.

“ఆ బాధకు తట్టుకొనలేని సోమకాంతమహారాజు భరించరాని బాధతో వలవలా ఏడుస్తూ తనను రక్షించమంటూ ఆ భృగుమహర్షిని శరణువేడి, దీనంగా యిలా ప్రార్ధించాడు.

“ఓ మహాత్మా! ఎంతో కూృరస్వభావంగల మృగాలు సైతం తమ దుష్టత్వాన్ని వీడి, మీ ఆశ్రమంలో ఎంతో స్నేహంగా వెలుగుతున్నాయి.కదా? అటువంటి పావనమైన ఈఆశ్రమంలోనే,మీ సమక్షంలోనే ఈ పక్షుల గుంపులిలా నన్ను బాధిస్తున్నాయెందుకనో? ఇవి నన్ను పొడిచి పొడిచి మరీ చంపుతున్నాయి! నీ పావన చరణాలను ఆశ్రయించి శరణు

వేడినవాడిని! పైగా దీనుడను! కనుక నీవు నాపై దయతో అభయాన్ని ప్రసాదించి కాచి, రక్షించు!” అంటూ వేడుకున్నాడు. అప్పుడు ఆతరువాత జరిగిన కధావృత్తాంతాన్ని సూతులవారిలా తెలియ జేసారు.“ఇలా ఆ సోమకాంతమహారాజు దీనుడై ప్రార్ధించగా భృగుమహర్షి ఇలా బదులిచ్చాడు.“ఓ రాజా! నీవు నావాక్యములను సంశయించటం వలన ఇటువంటి ఆపద కలిగింది! దీనికి ప్రతిక్రియ చేస్తాను నీవొక క్షణకాలం ఊరుకో!” అని ఆ మహర్షి ఒక ‘హుం’కారం చేయగానే ఆ.పక్షులగుంపులన్నీ అంతర్ధానమై పోయినాయి!” అంటూ సూతుడు చెప్పాడు. ఆ కరుణాభరితమైన మహర్షి చర్యకు సోమకాంత మహారాజూ ఆయన భార్యయైన సుధర్మా ఎంతో సంతోషించారు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ”నానాపక్షి నివారణం” అనే 8-వ అధ్యాయం. సంపూర్ణం.

Related posts

Share via