కాశీ పట్టణం హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రం. కాశీలో మరణిస్తే చాలు మోక్షం లభిస్తుందని విశ్వాసం. కాశీలో మరణించడం కోసమే అక్కడ ఎందరో స్థిరనివాసం ఏర్పరుచుకుని జీవిస్తుంటారు. అలాంటి పవిత్ర కాశీపట్టణంలో ఎన్నో ఆలయాలు, మరెన్నో పుణ్య స్నాన ఘట్టాలు. ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత అయినా సూర్యునికి కాశీ పట్టణంలో 12 ఆలయాలున్నాయి. ఈ కథనంలో కాశీలో వెలసిన ద్వాదశ సూర్య దేవాలయాల విశిష్టత గురించి తెలుసుకుందాం.
ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్!
‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అని శాస్త్ర వచనం. ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. కాశీ క్షేత్రం దేవాలయాల నిలయం. కాశీ క్షేత్రంలో సూర్యభగవానునికి ద్వాదశ ఆలయాలు కలవు. ఈ ద్వాదశ ఆదిత్యుల దేవాలయాలలో సూర్యభగవానుడి దివ్య శక్తి నిక్షిప్తమై ఉంది. కాశీయాత్రకు వెళ్లినవారు ఈ ఆలయాల సందర్శన వల్ల శారీరక అనారోగ్యాలతో పాటు భవ రోగాల నుంచి కూడా విముక్తులు కావచ్చు. కాశీ ఖండం ప్రకారం కాశీలో ద్వాదశ సూర్య దేవాలయాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం.
లోలార్క ఆదిత్యుడు
అస్సిఘాట్కి వెళ్లే దారిలో ఆంధ్ర ఆశ్రమం వద్ద లోలార్క ఆదిత్యుని ఆలయం ఉంది. ఈ ఆదిత్యుని దర్శనం చేత పాపాల వల్ల వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
విమలాదిత్యుడు
లోలార్క ఆదిత్యుని ఆలయం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో విమలాదిత్యుని ఆలయం ఉంది. కాశీ ఖండం ప్రకారం పూర్వం విమలుడు అనే రాజు కుష్టు రోగంతో బాధపడుతూ తన రాజ్యాన్ని విడిచి కాశీకి చేరుకొని, కాశీలో సూర్యుడిని ప్రతిష్టించి ప్రతిరోజు పూజించేవాడు. విమలుడి పూజకి మెచ్చి ప్రత్యక్షమైన సూర్యుడు అతనిని కుష్టురోగం నుంచి విముక్తుడిని చేశాడు. విమలుడు పూజించిన సూర్యుడు కాబట్టి ఈ సూర్యుని విమలాదిత్యుడని అంటారు. విమలాదిత్యుడిని పూజించిన వారికి సకల రోగములు నుంచి ఉపశమనం ఉంటుందని విశ్వాసం.
సూర్యకుండం
విమలాదిత్యుని ఆలయం నుంచి కొంచెం దూరంలో సూరజ్ కుండ్ అనే ప్రాంతం ఉంది. ఇక్కడ వెలసిన సూర్యుని సాంబాదిత్యుడు అంటారు. కాశీ ఖండం ప్రకారం పూర్వం నారదుడి శాపం వలన శ్రీకృష్ణుని కుమారుడు సాంబునికి కుష్టువ్యాధి వస్తుంది. అప్పుడు సాంబుడు శాప విమోచనం కోసం కాశీకి వచ్చి ఒక కుండం ఏర్పాటు చేసుకొని ఆ కుండానికి దగ్గరలోనే సూర్యుణ్ణి ప్రతిష్ఠించి పూజించసాగాడు. అలా కొంత కాలానికి కుష్టురోగం పోగొట్టుకుని తన సహజ సౌందర్య రూపం పొందుతాడు. అప్పటినుండి ఆ కుండమునకు సూర్యకుండమని పేరు వచ్చింది. సాంబుడు ప్రతిష్ఠించిన సూర్యునికి సాంబాదిత్యుడు అని పేరు వచ్చింది. సూర్యకుండంలో స్నానం చేసి సూర్య భగవాన్ని పూజించడం వల్ల ఎలాంటి వ్యాధులు రావని పురాణ ప్రశస్తి.
ఉత్తరార్క ఆదిత్యుడు
సాంబాదిత్యుని ఆలయం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉత్తరార్క ఆదిత్యుడు వెలసి ఉంటాడు. పూర్వం రాక్షసుల ధాటిని తట్టుకోలేకపోయిన దేవతలు, వారిని జయించే మార్గం చెప్పమని సూర్యభగవానుడిని ఆశ్రయిస్తారు. సూర్యుడు చెప్పిన ఉపాయంతో దేవతలు రాక్షసులపై విజయం సాధిస్తారు. ‘ఉత్తరం’ అంటే ఉపాయం చెప్పడం అని అర్ధం. సూర్యుడు దేవతలకి తరుణోపాయం చెప్పడం వల్లనే ఇక్కడి సూర్యభగవానుడికి ఉత్తరార్కుడు అని పేరు వచ్చిందని చెబుతారు.
కేశవాదిత్యుడు
ఉత్తరార్క ఆదిత్యుడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదికేశమందరంలో కేశవాదిత్యుడు ఉంటాడు. పూర్వం ఒకసారి సూర్యుడు ఆకాశ మార్గంలో సంచరిస్తూ కాశీలో శివలింగాన్ని పూజిస్తున్న ఆదికేశవుడిని చూసి అక్కడికి వస్తాడు విష్ణువు ద్వారా శివుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న సూర్యుడు అక్కడే ఒక స్పటిక లింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తాడు తదనంతరం అక్కడ మూర్తిగా వెలసి భక్తులని అనుగ్రహిస్తాడు. ఈ కేశవ ఆదిత్యుడిని పూజించడం వల్ల అజ్ఞానం తొలగి కోరికల నెరవేరుతాయి.
ఖఖోల్క ఆదిత్యుడు
ఖఖోల్క ఆదిత్యుడు త్రిలోచన ఘాట్ వద్ద ఉన్న కామేశ్వర్ మహాదేవ ఆలయంలో ఉన్నాడు. కాశీఖండం ప్రకారం కశ్యప ప్రజాపతి భార్య వినత ఇక్కడ సూర్యుని ప్రతిష్టించి పూజించినట్లుగా తెలుస్తోంది. ఖఖోల్క ఆదిత్యుని దర్శనం చేత విఘ్నాలు పోయి సర్వ పాపముల నుంచి విముక్తులౌతారని విశ్వాసం. వినత ప్రతిష్ఠించిన సూర్యుడు కనుక వినతాదిత్యుడు అని కూడా అంటారు.
అరుణాదిత్యుడు
ఖఖోల్క ఆదిత్యునికి కొంచెం దగ్గరలో ఉన్న త్రిలోచన మహాదేవ ఆలయంలో అరుణాదిత్యుడు ఉంటారు. గరుత్మంతుని సోదరుడు అరుణుడు ఇక్కడ సూర్యుని ప్రతిష్టించి పూజిస్తాడు. అతని తపస్సుకు మెచ్చి సూర్యుడు అరుణుని తన రథసారథిగా చేసుకుంటాడు. అరుణుడు ప్రతిష్ఠించిన ఆదిత్యుడు కనుక అరుణాదిత్యుడని అంటారు. ఈ అరుణాదిత్యుడిని దర్శించడం వలన భయము, దుఃఖము, దారిద్య్రం, పాపములు, వ్యాధుల బాధలు తొలగుతాయని విశ్వాసం.
మయూఖాదిత్యుడు
అరుణాదిత్యుని దగ్గర నుంచి ఒక కిలోమీటర్ దూరంలో బాలాజీ ఘాట్ వద్ద మయూఖాదిత్యుని ఆలయం ఉంటుంది. కాశీ ఖండం ప్రకారం పూర్వం సూర్యభగవానుడు ఇక్కడ శివలింగాన్ని, మంగళగౌరీదేవిని ప్రతిష్ఠించి పూజించాడట. ఆయన తపస్సుకు మెచ్చిన పరమశివుడు అమ్మవారితో పాటు ప్రత్యక్షమై, ‘మయూఖాదిత్యుడు’ అనే వరాన్ని ప్రసాదించాడట. ఎవరైతే ఈ మయూఖ ఆదిత్యుడిని పూజిస్తారో వారికి వ్యాధి మరియు దరిద్ర బాధలు ఉండవని విశ్వాసం.
యమాదిత్యుడు
మయూఖాదిత్యుని ఆలయం నుంచి 400 మీటర్ల దూరంలో యమాదిత్యుని ఆలయం ఉంది. కాశీఖండం ప్రకారం పూర్వం యమధర్మరాజు స్వయంగా యమ తీర్థంలో యమేశ్వర లింగాన్ని, యమాదిత్యుడిని ప్రతిష్ఠించి తపస్సు చేసాడు. ఈ యమతీర్థంలో స్నానం చేసి ఈ యమాదిత్యుని దర్శించడం వలన యమలోక దర్శనం ఉండదని విశ్వాసం.
గంగాదిత్యుడు
యమాదిత్యుని ఆలయం సమీపంలోనే గంగాదిత్యుని ఆలయం ఉంది. కాశీ ఖండం ప్రకారం ఇక్కడ సూర్యభగవానుడు గంగాదేవిని ప్రతిష్ఠించి పూజించాడంట! ఈ ఆదిత్యుని దర్శనం వలన మానవులు పునీతులు అవుతారని విశ్వాసం.
వృద్ధాదిత్యుడు
పూర్వం ‘హారితుడు’ అనే భక్తుడు అనునిత్యం సూర్యభగవానుడిని పూజిస్తూ వచ్చాడట. వృద్ధుడు అయిన అతనికి ఇంకా సూర్యభగవానుని ఆరాధనలో సంతృప్తి లభించలేదు. దాంతో యవ్వనాన్ని ప్రసాదించమని ఆ స్వామిని వేడుకున్నాడు. వృద్ధ బ్రాహ్మణుడు సూర్యుడిని ప్రతిష్ఠించి పూజించాడు కనుక ఈ ఆదిత్యుడు వృద్ధాదిత్యుడిగా ప్రసిద్ధిగాంచాడు.
ద్రుపదాదిత్యుడు
కాశీ విశ్వనాథ్ ఆలయంలో ద్రుపదాదిత్యుని ఆలయం ఉంటుంది. కాశీఖండం ప్రకారం పూర్వం ద్రౌపది దేవి సూర్య భగవానుడిని ప్రార్ధించి ఆయన అనుగ్రహంతో అక్షయ పాత్రను పొందుతుంది. ద్రౌపది ప్రతిష్ఠించి పూజించిన సూర్యుడు కాబట్టి ఇక్కడ సూర్యుని ద్రుపదాదిత్యుడు అంటారు.
మహిమాన్వితమైన కాశీలో వెలసిన దివ్య శక్తి కలిగిన ద్వాదశ ఆదిత్యుల దర్శనం సకల శుభప్రదం.
ఓం ఆదిత్యాయ నమః
