ప్రతి గ్రామంలోనూ శివాలయం ఉంటుంది. అసలు తొలిసారిగా శివుడు ఎక్కడ వెలిశాడో తెలుసా? అసలు శివుడికి కూడా సొంత ఊరు అనేది ఒకటి ఉందని తెలుసా? తమిళనాడులోని ఒక కుగ్రామంలో వెలిసిందని చెబుతారు. అదెక్కడుందంటే.. రామేశ్వరం నుంచి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరి పేరు “తిరుఉత్తర కోసమాంగై”. మధురై వెళ్లే దారిలో ఈ ప్రదేశం ఉంటుంది. ఈ ప్రదేశంలోనే శివుడు తొలిసారిగా లింగ రూపంలో ఉంటుందని నమ్మకం.
3000 సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయం నిర్మించారు.
శివభక్తురాలైన మండోదరి శివుడిని ప్రార్ధించి తనకొక ఒక గొప్ప శివభక్తుడిని భర్తగా ప్రసాదించమని పరమేశ్వరుడిని ప్రార్థించిందట. అప్పుడు మండోదరికి శివుడు తన భక్తుడైన రావణబ్రహ్మతో ఇక్కడే వివాహం జరిపించాడని ఆలయ స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయం 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉంటుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఆలయ ప్రాంగణంలో 3000 ఏళ్ల నాటి రేగి పండు చెట్టు ఉంది. రేగిచెట్టు ఇంతకాలం ఉండటం అనేది నిజంగానే వండర్. అత్యంత ప్రాచీనమైనది.. అలాగే శివుడు తొలిసారిగా వెలిసిన ఈ ప్రాంతాన్ని సందర్శించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తారు.
