April 19, 2025
SGSTV NEWS
Spiritual

క్షిర సాగర మథనం నుంచి విషం, అమృతమే కాదు.. ఇవి కూడా పుట్టాయని మీకు తెలుసా?



Kshira Sagara Mathanam: సాగర మథనం నుంచి విషం, అమృతమే కాదు.. ఇవి కూడా పుట్టాయని మీకు తెలుసా?


హిందూ పురాణాలలో సముద్ర మథనానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అత్యంత ఆసక్తికరమైన సంఘటనల్లో సముద్ర మథనం కూడా ఒకటి. దేవతలు, రాక్షసుల పోరాటాన్ని ముగించేందుకు సముద్రం మధనం జరిగినట్టు చెప్పుకుంటారు. ఈ సముద్రమథనం సమయంలో ఎన్నో వస్తువులు పుట్టుకొచ్చాయి. వాటిలో విషం, అమృతం గురించే ఎక్కువ మందికి తెలుసు. కానీ సముద్రం మథనంలోనే అనేక జీవులు, ఉత్పత్తులు కూడా పుట్టాయి.



దేవతలకు శక్తులు ఎక్కువగా ఉన్నప్పటికీ అసురులు వారిని అధిగమించారు. విశ్వంపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నించారు. ఈ స్థితిలో దేవతలు సహాయం కోసం విష్ణువు వద్దకు వెళ్లారు. అప్పుడు విష్ణువు అమృతాన్ని పొందమని సూచించాడు. ఆ అమృతం మీకు విజయాన్ని అందిస్తుందని చెబుతాడు.

సముద్రం మథనంలో భాగంగా మందరగిరిని కవ్వంగా వాడమని, దానికి కట్టే తాడుగా వాసుకి అని సర్పాన్ని వినియోగించమని విష్ణువు చెబుతాడు. క్షీర సాగరంలో మందరగిరిని పర్వతాన్ని పెట్టి దానికి వాసుకిని తాడులా కట్టి రాక్షసులు, దేవతలు చెరో వైపు కవ్వంలా చిలకడం మొదలుపెడతారు.



అలా మంధరగిరిని చిలుకుతుండగా హాలాహలం పుడుతుంది. అంటే విషం. దాన్ని శివుడు తన గొంతులో దాచుకుంటాడు. ఆ తరువాత కామధేనువు, ఐరావతం, కల్పవృక్షము, అప్సరసలు, చంద్రుడు, శ్రీ మహాలక్ష్మి ఇలా ఎన్నో పుట్టుకొచ్చాయి.

పైన చెప్పిన వాటితో పాటు క్షీరసాగరం మధనం సమయంలోనే 13 రత్నాలు కూడా పుట్టుకొచ్చాయి. అప్పట్నుంచి రత్నాలను వాడడం వినియోగించారని చెప్పుకుంటారు. అలాగే అందమైన రెక్కలతో కూడిన ఏడు తలల గుర్రం కూడా బయటికి వస్తుంది. ఇంద్రుడు వాడుతున్న ఐరావతం, కోరిన కోరికలను తీర్చే కామధేనువు కూడా క్షీరసాగరం మధనంలోనే పుడతాయి. కామధేనువును విష్ణువు రుషులకు అందిస్తాడు. ఐరావతాన్ని దేవతల రోజైన ఇంద్రుడికి ఇస్తాడు.

క్షీరసాగర మధనంలోనే అరుదైన రత్నమైన కౌస్తభ మణి వస్తుంది. అలాగే పారిజాతం అనే చెట్టు కూడా బయటకు వస్తుంది. దీన్ని ఇంద్రుడు స్వర్గానికి తీసుకువెళ్తాడు. ఇది ఏడాది పొడవునా విరబూస్తూనే ఉంటుంది. ఆ తర్వాత సారంగా అని పిలిచే విల్లు బయటికి వస్తుంది. ఇది రాముడు వాడిన విల్లుగా చెప్పుకుంటారు. ఆ తర్వాత చంద్రుడు వస్తాడు. చంద్రుడిని శివుని తలపై ఉంచుతారు.




క్షీరసాగర మథనంలోని మహాభారత యుద్ధానికి వాడిన పాంచ జన్యం అనే శంఖం కూడా వస్తుంది. మథనం సమయంలో బయటకు వచ్చిన అప్సరసలను స్వర్గానికి పంపిస్తారు. చివరికి దివ్యమైన అమృతం బయటికి వస్తుంది. ఈ అమృతం కుండతో పాటు ఖగోళ వైద్యుడైన ధన్వంతరి కూడా బయటికి వస్తాడు. దేవతలు అమృతాన్ని తాగి అమరులవుతారు. రాక్షసులను ఓడించేంత బలాన్ని పొందుతారు. చివరికి అసురులను పాతాళానికి  నెట్టేస్తారు. క్షీరసాగర మథనంలో వచ్చిన వస్తువుల జాబితా పెద్దదే. కానీ కొన్నింటి గురించే ఎక్కువమందికి తెలుసు.

Related posts

Share via