*దెందులూరు* 13.07.2024
*మార్కెట్లో పారేసే కూరగాయలు తెచ్చి ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు పెడుతున్నారా – మీ ఇంటి పిల్లలకు అయితే ఇలా పెడతారా – ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులు అంటే మన బిడ్డలతో సమానంగా చూడాలి..”: ప్రభుత్వ వసతి గృహ అధికారుల తీరుపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అసంతృప్తి.*
*ఏలూరు జిల్లా పెదవేగి మండలం పెదవేగిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను శనివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించారు.*
ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు స్థానిక నాయకులు, గురుకుల పాఠశాల సిబ్బంది మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురుకుల పాఠశాల ఆవరణలోని పరిసరాలను స్వయంగా పరిశీలించారు.
పాఠశాల ఆవరణలో పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడం , తలుపులు లేని అధ్వాన్న స్థితిలో ఉన్న విద్యార్ధుల స్నానాల గదులను చూసి చింతమనేని ప్రభాకర్ పాఠశాల నిర్వాహకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలోని వంట గదిలో పరిశీలించిన చింతమనేని ప్రభాకర్ నాణ్యతలేని కూరగాయలను సరుకులను గుర్తించారు. మార్కెట్లో తినడానికి పనికిరావంటూ పడేసే కూరగాయలను తీసుకువచ్చి కాంట్రాక్టర్లు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పంపిస్తుంటే వాటిని వండి పెట్టడం ఎంతవరకు సమంజసం అని అధికారులను సిబ్బందిని చింతమనేని ప్రశ్నించారు. ప్రభుత్వ వసతిగృహాల్లోని విద్యార్థులను తమ కుటుంబంలోని పిల్లలుగా భావించి వారికి అన్ని విధాల తోడ్పాటు అందించినప్పుడే అధికారులు తమ విధులకు న్యాయం చేసినట్లు అవుతుందని చింతమనేని ప్రభాకర్ సూచించారు. అనంతరం 10వతరగతి విద్యార్థులతో ఆయన ముఖా ముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు..
తాను ఎమ్మెల్యేగా ఉండగా గతంలో ఇదే గురుకుల పాఠశాలకు అదనపు సెక్షన్లను పెంచుకోవడానికి అనుమతులు తీసుకు వచ్చినా కూడా గత వైసీపీ పాలకుల పాపం వల్ల ఆ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని త్వరలోనే అదనపు తరగతి గదుల నిర్మాణాలుతోపాటు నియోజకవర్గంలో అదనపు పాఠశాలల ఏర్పాటుకు కూడా చర్యలు చేపడుతున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపిఈఐడీసీ డి ఈ కోటేశ్వరరావు, డి సి ఓ ఎన్ భారతి, ప్రిన్సిపాల్ ఎం వెంకటేశ్వరరావు, టిడిపి మండల ప్రెసిడెంట్ బొప్పన సుధాకర్, గ్రామ సర్పంచి మేక కనకరాజు, నాయకులు తాత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.