SGSTV NEWS
CrimeTelangana

తెలంగాణ : దళిత యువకుడిపై అమానుషం.. కర్రలతో చావగొట్టి, గాయాలపై కారం చల్లి చిత్రహింసలు

కొత్తగూడ, మార్చి 31: చోరీకి పాల్పడ్డాడనే అనుమానంతో ఓ దళిత యువకుడి పట్ల గ్రామస్థులు అమానుషంగా ప్రవర్తించారు. కర్రలతో చావకొట్టి, రక్తం కారుతున్న గాయాలపై కారం చల్లి చిత్ర హింసలు పెట్టారు. ఈ అమానవీయఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో శనివారం (మార్చి 30) వైరల్‌ కావడంతో వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం జంగవానిగూడెం(రాంపూర్‌) గ్రామానికి చెందిన వంకాయల కార్తీక్‌ అనే యువకుగు అదే మండలం పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన టెంట్‌హౌస్‌ యజమాని వద్ద పని చేస్తున్నాడు. ఈ క్రమంలో డీజే (సౌండ్‌ బాక్స్‌)లో ఉపయోగించే యాంపిప్లయర్‌ చోరీకి గురైంది. దానిని ఖానాపూర్‌లో విక్రయించినట్లు యజమాని అశోక్‌ గుర్తించాడు. దీంతో అశోక్‌ కొందరు వ్యక్తులను కూడగట్టుకుని మార్చి 19వ తేదీన జంగవానిగూడెంలోని కార్తీక్‌ ఇంటికి వెళ్లారు. అతనితో పని ఉందని చెప్పి కారులో ఎక్కించుకుని పొగుళ్లపల్లి సమీప అటవీప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం కర్రలతో చితకబాదారు. దెబ్బలకు తాళలేక తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయడగా.. దొరకబుచ్చుకుని విచక్షణా రహితంగా చావకొట్టారు. అతన్ని పొగుళ్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి కిటికీ చువ్వలకు కట్టేసి మళ్లీ చితకబాదారు. దీంతో తీవ్రంగా గాయపడిన కార్తీక్‌ గాయాల నుంచి రక్తస్రావం అవుతుంటే.. అశోక్‌ ఆ గాయాలపై కారం చల్లుతూ చిత్రహింసలకు గురిచేశాడు.



బాధకు తాళలేక స్పృహ కోల్పోయిన కార్తీక్‌ను ఇంటి వద్ద పడేసి వెళ్లిపోయారు. గాయాలతో రక్తం ముద్దలా పడిఉన్న కార్తీక్‌ను బంధువులు నర్సంపేట పట్టణంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. కార్తీక్‌పై దాడికి పాల్పడిన వారిపై అశోక్‌తోపాటు అతని సహచరులపై మార్చి 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు టెంట్‌హౌస్‌ యజమాని అశోక్‌ కూడా పోలీసులకు కార్తీక్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కార్తీక్‌పై చోరీ కేసు నమోదు చేశారు. కానీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. వీడియో వైరల్‌ కావడంతో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహబూబాబాద్‌ డీఎస్పీకి శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేయడంతో దాడి ఘటన బయటకు పొక్కింది.

Also read

Related posts