మహిళను ప్రెగ్నెంట్ చేస్తే చాలు.. రూ. 25 లక్షలు మీ సొంతం అని ఓ ప్రకటన చూశాడు. ఠక్కున ఆ ప్రకటన నమ్మేశాడు.. వెంటనే ఫోన్ చేశాడు. ఇంత మొత్తంలో డబ్బు కట్టాలని చెప్పేసరికి.. చిన్న చిన్న మొత్తాల కింద కట్టాడు. తీరా చూస్తే షాక్ అయ్యాడు.
ప్రతి చిన్న పనికి ఇంటర్నెట్పై ఆధారపడే ఈ రోజుల్లో సైబర్ నేరాలు నిరంతరం పెరుగుతున్నాయి. మోసగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పుణేలో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక 44 ఏళ్ల కాంట్రాక్టర్ సోషల్ మీడియాలో వచ్చిన ఒక మోసపూరిత ప్రకటనను నమ్మి ఏకంగా రూ. 11 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ ప్రకటన ప్రకారం.. ఒక మహిళ తనను తల్లిని చేయగల ఆరోగ్యవంతుడైన పురుషుడు కావాలని, అందుకు రూ. 25 లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించింది. ఆసక్తి ఉన్నవారు కాల్ చేయాలని ఒక ఫోన్ నెంబర్‌ను కూడా షేర్ చేసింది. ఈ భారీ ఆఫర్ చూసి కాంట్రాక్టర్ వెంటనే ఆ నెంబర్‌కు కాల్ చేశాడు. కాల్ చేసినప్పుడు ఒక వ్యక్తి మాట్లాడి, అది ఒక ప్రెగ్నెంట్ జాబ్ సంస్థ అని, తాను అసిస్టెంట్‌గా పని చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. మహిళతో కలిసేందుకు ముందుగా సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, కంపెనీ ఐడెంటిటీ కార్డు తీసుకోవాలని కాంట్రాక్టర్‌కు సూచించాడు.
మోసగాళ్లు తెలివిగా రిజిస్ట్రేషన్ ఫీజు, ఐడెంటిటీ కార్డు ఫీజు, జీఎస్టీ, టీడీఎస్, ప్రాసెసింగ్ ఫీజు వంటి అనేక రకాల చార్జీల పేరుతో డబ్బు వసూలు చేశారు. రూ. 25 లక్షల పెద్ద మొత్తం దక్కుతుందనే ఆశతో ఆ కాంట్రాక్టర్ 100 కంటే ఎక్కువసార్లు చిన్న చిన్న మొత్తాలను ఆన్లైన్ ద్వారా పంపుతూ వచ్చాడు. ఈ విధంగా మొత్తం రూ. 11 లక్షల వరకు డబ్బును బదిలీ చేశాడు. ఇంత డబ్బు పంపినా తన పని పూర్తి కాకపోవడంతో అతనికి అనుమానం వచ్చింది. దీంతో బాధితుడు వారిని నిలదీయడం, ప్రశ్నించడం ప్రారంభించాడు. అప్పటివరకు డబ్బులు వసూలు చేసిన మోసగాళ్లు వెంటనే అతని ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేశారు.
అప్పుడే తాను మోసపోయానని గ్రహించిన ఆ కాంట్రాక్టర్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. వెంటనే పుణేలోని బనేర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మోసంలో ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో ఈ ప్రెగ్నెంట్ జాబ్ స్కామ్ కేవలం పుణేకు మాత్రమే పరిమితం కాలేదని, ఇది దేశవ్యాప్తంగా చురుకుగా ఉన్న ఒక పెద్ద సైబర్ నేరాల నెట్‌వర్క్‌లో భాగమని తేలింది. ముఖ్యంగా ఈ మోసాలు బీహార్‌లోని నవాదా జిల్లా కేంద్రంగా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల అత్యాశ, వ్యక్తిగత బలహీనతలను ఆసరాగా చేసుకుని మోసగాళ్లు ఈ నకిలీ ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ప్రజలు నకిలీ ఆఫర్లకు, ఆన్లైన్ ప్రకటనలకు స్పందించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జీఎస్టీ, టీడీఎస్ వంటి ప్రభుత్వ పన్నుల పేర్లతో వ్యక్తిగత లావాదేవీలకు డబ్బు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండడం ద్వారా ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండవచ్చు
Also Read
- కార్తీక పౌర్ణమి 2025 తేదీ.. పౌర్ణమి తిథి, పూజకు శుభ ముహూర్తం ఎప్పుడంటే?
 - శని దృష్టితో ఈ రాశులకు చిక్కులు.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది
 - సాక్షాత్తు ఆ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం! పెళ్లి కావాలా? వెంటనే ఈ గుడికి వెళ్లండి!
 - ఆ విషయాన్ని పట్టించుకోని అధికారులు.. కలెక్టరేట్లో పురుగుల మందు తాగిన రైతు..
 - Viral: ఆ కక్కుర్తి ఏంటి బాబాయ్.! ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఇలా
 





