SGSTV NEWS
CrimeTelangana

Telangana: భార్య కామం.. మంత్రగాడి మోహం.. కట్ చేస్తే, భర్తను ఎలా లేపేశారో తెలుసా..?




పాలమూరు జిల్లాలో ఓ మాంత్రిక మరాఠీ పెద్ద మాయే చేయబోయాడు. బంగారం పోయిందని వచ్చిన ఓ దంపతుల పచ్చని సంసారంలో చిచ్చు పెట్టాడు. మాయమాటలు చెప్పి మహిళను లొంగ దీసుకొని.. ఆ తర్వాత అడ్డుగా ఉన్నాడని ఆమె భర్త అడ్డును తొలగించుకునేందుకు ఘాతుకానికి పాల్పడ్డాడు. మద్యం పేరుతో మర్డర్ స్కెచ్ వేసి.. యాక్సిడెంట్ కేసు గా చిత్రీకరించాడు. ఎక్కడో తేడా కొట్టి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాంత్రిక మరాఠీ మర్డర్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.


నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లి శివారులో రోడ్డు ప్రమాద ఘటనలో వ్యక్తి మృతి మిస్టరీ వీడింది. జరిగింది రోడ్డు ప్రమాదం కాదని.. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని పోలీసుల విచారణలో తేలింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడుతో కలిసి భార్యే ఈ దారుణానికి స్కెచ్ వేసింది. ఇక చేసిన హత్య నుంచి తప్పించుకునేందుకు యాక్సిడెంట్ గా మార్చారు. నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన మైనగాని రాముకు పెద్దకొత్తపల్లి మండలం వెనచర్ల గ్రామానికి చెందిన మానసతో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. గడచిన కొన్నాళ్లుగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటూ ప్లంబర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు, ఒక కూతురు సంతానం. పిల్లలను నాగర్ కర్నూల్ లోనే చదివించుకుంటూ సాఫీగా సాగుతున్న వీరి సంసారంలో భార్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది.

సంసారంలో మలుపుతిప్పిన బంగారం చోరి:
సుమారు ఆరు నెలల క్రితం రాము నివాసంలో చోరి జరిగింది. ఇంట్లో ఉన్న బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే ఎవరు ఎత్తుకెళ్లారో తెలుసుకునేందుకు భర్త రాముతో కలిసి భార్య మానస నాగర్ కర్నూల్ మండలం పెద్దముదునూరు గ్రామంలోని మంత్రగాడు సురేష్ గౌడ్ ని సంప్రదించింది. అనంతరం ఇదే విషయంలో తరచూ మానస సురేష్ ను కలవడంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ముడిపడింది. ఈ విషయం భర్త రాముకు తెలియడంతో అనేక మార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో తమ వివాహేతర బంధానికి భర్త రాము అడ్డుగా ఉన్నాడని అంతమొందించాలని ప్లాన్ వేసుకున్నారు భార్య మానస, ప్రియుడు సురేష్.. ఇందుకోసం ప్రియుడు సురేష్ వద్ద పనిచేసే పాలేరు, అతని బావమరిది తో ఒక్కొక్కరికి రూ.2.80లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మొత్తాన్ని సైతం రాము మరణాంతరం వచ్చే రైతు బీమా ద్వారా వచ్చే డబ్బులను ఇచ్చేందుకు మానస అంగీకారం తెలిపింది. ఇక రాము ను హత్య చేసేందుకు అదును కోసం నిందితులతో కలిసి భార్య మానస, ప్రియుడు ఎదురుచూశారు..


భర్తను అంతమొందించేందుకు ఇదే సరైన సమయం..
బంధువుల పెళ్లి నిమిత్తం నాలుగు రోజులు నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లికి వెళ్తున్నాం అని.. ఈ సమయంలోనే భర్త రాముని హత్య చేయాలని ప్రియుడు సురేష్ కు తెలిపింది భార్య మానస.. ఇక ఇదే అదునుగా భావించిన సురేష్… రాముకు కాల్ చేసి మద్యం సేవిద్దామని తన ఫామ్ హౌస్ కి రావాలని పిలిచాడు. రాము, సురేష్ తో పాటు నిందితులు బాల పీరు, హనుమంతు సైతం మద్యం పార్టీలో ఉన్నారు. అయితే ఎక్కువ మొత్తంలో మద్యం రాముకు తాగించారు. ఫామ్ హౌస్ నుంచి సమీపంలోని KLI కాల్వ వద్దకు వెళ్లిన అందరూ… అక్కడ మరోసారి మద్యం తాగారు.. చివరకు రాము మత్తులోకి జారుకోగానే.. ఊపిరి ఆడకుండా ప్యాకింగ్ టేప్ ను ముక్కు, నోరుకు అంటించారు. ఇక శ్వాస అందకపోవడంతో కాసేపటికి రాము అక్కడే మృతి చెందాడు. చేసిన హత్య నేరాన్ని తప్పించుకునేందుకు యాక్సిడెంట్ డ్రామా కు సిద్ధం అయ్యారు. రాము డెడ్ బాడీకి గాయాలు చేసి.. బైక్ ను అక్కడక్కడ డ్యామేజ్ చేసి సమీపంలోనే ఉన్న రహదారి పక్కన పడేసి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా సీన్ క్రియేట్ చేశారు. అయితే మొదట రోడ్డు ప్రమాదంగానే భావించినా.. రాము కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. బైక్ డ్యామేజ్ కు, రాము గాయాలకు సంబంధం లేకపోవడంతో అనుమానస్పదంగా భావించారు. ఇదే సమయంలో మానస వివాహేతర సంబంధం తెర మీదకు రావడంతో రాము తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అనుమానం వ్యక్తం చేసిన రాము భార్య మానస, ప్రియుడు సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో జరిపిన విచారణలో హత్య నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో హత్యకు సహకరించిన సురేష్ పాలేరు బాల పీరు, అతని బావమరిది హనుమంతును అరెస్టు చేశారు. మొత్తం నలుగురు నిందితులను రిమాండ్ కు తరలించారు. భార్య వ్యామోహానికి.. మంత్రగాడి మాయకు అమాయక కుటుంబం చెల్లాచెదురైంది. అటు తండ్రి మరణం, ఇటు తల్లి జైలుకు వెళ్లడంతో ముగ్గురు పిల్లలు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Also read

Related posts