SGSTV NEWS online
CrimeTelangana

Hyderabad: ఫ్లైఓవర్‌ కింద కదలకుండా ఆగిపోయిన ఆటో.. పోలీసులు వెళ్లి చూడగా షాక్!


హైదరాబాద్‌ పాతబస్తీ చాంద్రాయణగుట్టలో మృతదేహాల కలకలం రేగింది. ఫ్లైఓవర్‌ కింద ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంతకీ వాళ్లెవరు? నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఎలా చనిపోయారు? అనే దానిపై విచారణ చేపట్టారు.

చాంద్రాయణగుట్ట ఫైఓవర్ బ్రిడ్జి కింద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదస్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. రోమన్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న ఫైఓవర్ కింద ఓ ఆటోలో ఇద్దరి విగతజీవులుగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. మృతులను జహంగీర్‌ (24), ఇర్ఫాన్‌ (25)గా గుర్తించారు. ఒకరిది పహాడీషరీఫ్‌.. మరొకరిది పిసల్‌బండ ప్రాంతానికి చెందిన వారుగా నిర్థారించారు.

మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే అధిక మోతాదులో డ్రగ్స్‌ తీసుకోవడం వల్లే ఇద్దరు యువకులు మృతిచెందినట్లు అనుమానిస్తున్నారు. వీరితోపాటు మరోక యువకుడు కూడా ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనాస్థలంలో క్లూస్‌ టీమ్‌ ఆధారాలను సేకరించింది. అక్కడ వారికి మూడు సిరంజీలు లభ్యమయ్యాయి. మరో వ్యక్తి ఆటోను మృతదేహాలను వదిలి పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో మృతదేహాలు దొరకడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

Also Read

Related posts