SGSTV NEWS online
CrimeTelangana

ఒంటరిగా ఉన్న మహిళ.. ఇంట్లోకి వెళ్లిన ఓ యువకుడు.. ఆ తర్వాత, ఏం జరిగిందంటే..

జోగులాంబ గద్వాల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన వడ్డీ వ్యాపారి లక్ష్మీ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. నిందితుడు కాళ్ల రామిరెడ్డిని అరెస్టు చేసి రూ.2.33లక్షలు, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఘాతుకానికి నిందితుడు రామిరెడ్డి ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనమే ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. బెట్టింగ్ లో నష్టపోయి చేసిన అప్పులు తీర్చే క్రమంలోనే హత్య చేశాడని చెప్పారు. ధరూర్ మండలం గార్లపాడుకు చెందిన కాళ్ల రామిరెడ్డి గద్వాల్ మార్కెట్ యార్డులో కమిషన్ మర్చంట్‌లో తండ్రి కాళ్ల శ్రీనివాస్ రెడ్డితో కలిసి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే రామిరెడ్డి కొన్నాళ్ల క్రితం నుంచి ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసయ్యాడు. వ్యాపారంలో వచ్చిన డబ్బులతో పాటు.. స్నేహితులు, అక్కడ ఇక్కడ తెలిసిన వారి దగ్గర అప్పులు చేశాడు. చివరకు భార్య నగలు సైతం కుదవ పెట్టాడు.

అప్పు చెల్లించేందుకు మరో అప్పు:
రోజులు గడుస్తున్నా కొద్ది ఓవైపు అప్పులు ఇచ్చిన వారి నుంచి మరోవైపు నగలు తనకా పెట్టడంతో భార్య నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో భార్య నగలు విడిపించడం, స్నేహితుడి అప్పు తీర్చేందుకు పరిచయస్తురాలైన వడ్డీ వ్యాపారి గద్వాల్ పట్టణంలోని శేరెల్లివీధికి చెందిన బలిజ లక్ష్మీ(55)ని ఆశ్రయించాడు రామిరెడ్డి. ఈ నెల 2వ తేదిన ఆమె వద్దకు వెళ్లి అప్పు ఇవ్వాలని కోరాడు. అయితే ప్రస్తుతం డబ్బు లేదని సర్దుబాటు చేసి చెప్తానని తెలిపింది లక్ష్మీ..

బంగారు ఆభరణాలపై కన్ను.. దోచుకునేందుకు హత్య:
ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న లక్ష్మీ మెడలోని బంగారు అభరణాలు చూసి వాటిపై కన్నేసాడు రామిరెడ్డి. ఎలాగైన బంగారాన్ని దోచుకోని.. అప్పులు చెల్లించాలని పథకం రచించాడు. లక్ష్మీని మాటల్లో పెట్టి ఒక్కసారిగా మెడలోని బంగారు నగలను గట్టిగా లాగి.. ఆమెను బలంగా వెనక్కి నెట్టాడు. దీంతో కిందపడిన లక్ష్మీ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం దోచుకున్న బంగారు అభరణాలతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక చోరి చేసిన సొత్తుతో శంషాబాద్ లో బంగారం వ్యాపారం చేస్తున్న స్నేహితుడు ఉమేశ్ ను కలిశాడు. తన భార్య, కుటుంబ సభ్యుల ఆభరణాలని చెప్పి వాటిని కరిగించి బిస్కెట్ రూపంలోకి మార్పించుకున్నాడు. అనంతరం ఆ బంగారు బిస్కెట్ ను హైదరాబాద్ లోని ఉప్పరగూడలో రూ.4.66లక్షలకు విక్రయించి నగదు తీసుకున్నాడు. ఇక వచ్చిన నగదులో కొంత భార్యకు చెవి రింగులు, వస్త్రాలు కొనుగోలు చేశాడు. అలాగే గద్వాల్ లో తాకట్టులో ఉన్న తన భార్య బంగారాన్ని విడిపించేందుకు 1.65లక్షలు ఖర్చు చేశాడు. ఇక స్నేహితుడి వద్ద చేసిన రూ.1.20 లక్షల అప్పును చెల్లించేశాడు. మిగిలిన 1,33,500 ను ఎవరికి తెలియకుండా స్కూటీలో దాచుకున్నాడు.

నిందితుడిని పట్టించిన సీసీ కెమెరాలు:..
ఇక తన భార్య అనుమానాస్పద మృతిపై భర్త మల్లికార్జున్(63) గద్వాల్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన రోజన వడ్డీ వ్యాపారి లక్ష్మీని కలిసిన వారిని, ఆమె నివాస ప్రాంతాల సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. నిందితుడు రామిరెడ్డి సదరు మహిళ నివాసానికి వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. వెంటనే అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఈజీ మనీ, బెట్టింగ్ లకు అలవాటు పడి నిందితుడు రామిరెడ్డి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు. చేసిన అప్పులు చెల్లించలేక బంగారు అభరణాలు అపహరించాడని పోలీసుల విచారణలో తేలింది

Also Read

Related posts