SGSTV NEWS online
CrimeTelangana

Hyderabad: 45 ఏళ్ల పాత సమాధిలో మరో మృతదేహాన్ని పాతిపెట్టారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..



మనిషి బతికున్నప్పుడే ప్రశాంతత లేదనుకుంటాం.. కానీ, చచ్చాక కూడా ప్రశాంతత లేదంటే నిజమే అనిపిస్తుంది ఈ సంఘటన చూస్తుంటే.. తెలుసుకున్నాక మీరు కూడా నేను చెప్పిన మాట నిజమేనని ఖచ్చితంగా ఒప్పుకుని తీరుతారు. సమాధిలో పాతిపెట్టిన మృతదేహాన్ని తవ్వించి మళ్లీ వేరే దగ్గర పాతిపెట్టారు.. అది కూడా 42 ఏళ్ల పాత సమాధిని.. వినడానికే చాలా వింతగా, ఆశ్చర్యంగా ఉంది కదూ.. పైగా ఇది ఎక్కడో కాదు.. మన భాగ్యనగరంలోనే. అసలు ఏంటి దీని కథ, ఏం జరిగిందనే విషయాలను పూర్తిగా పరిశీలిస్తే..

హైదరాబాద్ నగరం లంగర్‌హౌస్‌లో చోటు చేసుకున్న ఈ ఖబరస్తాన్ (శ్మశానము) వివాదం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. ఓ ముస్లిం స్మశానంలో జరిగిన అరుదైన ఘటన ఏంటంటే.. 1983 సంవత్సరంలో పాతిపెట్టిన ఓ వ్యక్తి సమాధి ఇప్పుడు పాతదైపోవడంతో, స్మశాన నిర్వాహకులు ఇటీవల ఆ ప్రదేశాన్ని మళ్లీ తవ్వించి, ఇంకో మృతదేహాన్ని అక్కడ పాతిపెట్టారు. అయితే ఈ చర్య స్థానికంగా పెద్ద వివాదానికి దారితీసింది. అంతకు ముందు ఆ చోట మరో మృతదేహాన్ని పాతిపెట్టిన సమాధి కావడంతో అందుకు సంబంధించిన కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. ఆ పాత సమాధిలో తమ కుటుంబ సభ్యుడిని 45 ఏళ్ల క్రితం పాతిపెట్టి సమాధి నిర్మించుకున్నామని, అలాంటి చోటును తవ్వి మరో మృతదేహాన్ని ఎలా పాతిపెడతారని ప్రశ్నించారు. తమ కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు అదే సమాధి స్థలంలో పాతిపెట్టాలని ఏళ్లుగా ఒక సంప్రదాయం పాటిస్తున్నామని.. అంత ముఖ్యమైన చోటులో వేరే వ్యక్తిని ఎలా పాతిపెట్టగలరు అంటూ స్మశాన నిర్వాహకులపై తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై వివరణ ఇవ్వాలని.. సమాధి తవ్వకానికి పాల్పడిన వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపడంతోపాటు పోలీసుల వరకు చేరింది.

ఈ వివాదం చెలరేగిన ఐదు రోజుల తర్వాత.. చివరికి పాత సమాధి వారసులు పోలీసుల సమక్షంలో శవాన్ని తవ్వించి బయటకు తీసి, వేరే ప్రదేశంలో పాతిపెట్టారు. ఇది తమ మనోభావాలకు, కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసిన ఘటనగా చెప్తూ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఈ ఘటన కారణంగా రెండు రోజుల పాటు స్మశానంలో పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. వివాదం మరింత ముదరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ముస్లిం మత పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ఇస్లాం మతపరంగా అనుచితమని విమర్శించారు. పాత సమాధులను తవ్వడం, వాటిలో కొత్తగా మరో మృతదేహాన్ని పాతిపెట్టడం మతపరంగా సరికాదని.. ఇది మరణించినవారి గౌరవానికి అవమానమని స్పష్టం చేశారు.

మరోవైపు, ఈ ఘటనపై స్థానికులతో పాటు హైదరాబాద్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్మశానాల నిర్వహణపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని..వక్ఫ్ బోర్డు, సంబంధిత అధికారులు స్పష్టమైన నియమాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటివి మరోసారి జరగకుండా స్మశానాల నిర్వహణపై తగిన చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రజల మనోభావాలను దెబ్బతీసే పనులు మళ్లీ మళ్లీ జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Also Read

Related posts