SGSTV NEWS online
CrimeTelangana

Hyderabad: ఆటో ఓవర్‌హీట్ అయ్యిందన్నాడు.. తీరా ప్రయాణీకులంతా దిగేసరికి ఊహించని విధంగా..


నవంబర్ 4న సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో 65 ఏళ్ల విజయలక్ష్మి అనే వృద్ధురాలు మెహదీపట్నం నుంచి ఆమీర్‌పేట్‌కు వెళ్తూ ఒక ఆటోలో ఎక్కింది. ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఆటో ఎక్కారు. లక్డీకపూల్ వద్ద ఆటోకు ఓవర్‌హీట్ అయ్యిందని చెప్పి, ప్రయాణికులను కిందికి దింపిన తర్వాత, ఆ ముగ్గురు ఆటోతో పాటు వృద్ధురాలి పర్సు, బంగారు గొలుసు, నగదు, మొబైల్ ఫోన్, దుస్తులు తీసుకుని పరారయ్యారు. వృద్ధురాలు వెంటనే సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పక్కా సమాచారంతో నవంబర్ 10న పోలీసులు మెహదీపట్నం బస్‌స్టాప్ వద్ద నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మహ్మద్ ఓమర్(22, ఆటో డ్రైవర్), మహ్మద్ సమీర్(19, మొబైల్ రిపేర్ మెకానిక్), సయ్యద్ జహూర్ అలియాస్ ముషూ(22, సెంటరింగ్ వర్కర్)గా గుర్తించారు.

నిందితులు అందరూ గుడిమల్కాపూర్, ఆసిఫ్‌నగర్ ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. పట్టుబడ్డ నిందితుల వద్ద నుంచి దొంగతనం చేసిన బంగారు గొలుసు(24 గ్రాములు), రూ. 12 వేల నగదు, ఒక సామ్‌సంగ్ ఫోన్, బ్రౌన్ లేడీస్ హ్యాండ్‌బ్యాగ్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో నిందితులు ఇంతకుముందు కూడా దొంగతనం కేసుల్లో భాగంగా ఉన్నట్టు తేలింది. మహ్మద్ ఓమర్ 2024లో అంబర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితుడిగా ఉన్నాడు. మహ్మద్ సమీర్‌ కూడా రాజేందర్‌నగర్ పోలీస్‌స్టేషన్, అంబర్‌పేట్‌లో కేసులు ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు ఈ సందర్భంగా ప్రజలకు, ముఖ్యంగా వృద్ధ ప్రయాణికులకు, ఆటోల్లో ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆటో నెంబర్‌ను గుర్తించుకోవడం, విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవడం ద్వారా ఇలాంటి ఘటనలను నివారించవచ్చని హెచ్చరించారు. సీనియర్ సిటిజన్లు ఇలాంటి మోసగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సైఫాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Also read

Related posts