SGSTV NEWS online
CrimeNational

వీడు మనిషి కాదు.. మానవమృగం.. భార్యను అతి కిరాతకంగా..



అనుమానం.. రాక్షసత్వానికి దారి తీసింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, వివాహేతర సంబంధంపై అనుమానం ఓ భర్తను కిరాతకంగా మార్చాయి. కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసిన ఆ వ్యక్తి.. అంతటితో ఆగకుండా రక్తపు మడుగులో పడి ఉన్న భార్య మృతదేహంతో సెల్ఫీ దిగి స్టేటస్ పెట్టాడు.

భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. కోయంబత్తూరులో తన భార్యను కొడవలితో నరికి చంపి, రక్తపు మడుగులో ఉన్న ఆమె మృతదేహం పక్కన కూర్చుని సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం స్థానికంగా, పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. తిరునెల్వేలి జిల్లాకు చెందిన బాలమురుగన్ శ్రీ ప్రియ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరూ కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. శ్రీ ప్రియ కోయంబత్తూరు నగరంలోని ఒక మహిళా హాస్టల్‌లో ఉంటూ అక్కడే పని చేసుకుంటోంది.


శ్రీ ప్రియ మరొక వ్యక్తితో సంబంధంలో ఉందని బాలమురుగన్ చాలాకాలంగా అనుమానం పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అనుమానమే ఈ భయంకరమైన ఘటనకు దారి తీసింది. సంఘటన జరిగిన రోజు బాలమురుగన్ నేరుగా శ్రీ ప్రియ ఉంటున్న హాస్టల్‌కు వెళ్లాడు. ఆమెను తనతో పాటు తిరిగి ఇంటికి వచ్చేయమని బలవంతం చేశాడు. ఆమె అందుకు నిరాకరించడంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఈ ఘర్షణ తారాస్థాయికి చేరిన సమయంలో బాలమురుగన్ తనతో తెచ్చుకున్న కొడవలితో ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

మృతదేహంతో భయంకరమైన సెల్ఫీ హత్య చేసిన తర్వాత బాలమురుగన్ అక్కడి నుంచి పారిపోలేదు. స్థానికులు లేదా పోలీసులు వచ్చే వరకు మృతదేహం పక్కనే కూర్చున్నట్లు సమాచారం. అయితే, ఈ భయంకరమైన ఘటనలో అత్యంత కలవరపరిచే విషయం ఏమిటంటే.. నిందితుడు రక్తపు మడుగులో పడి ఉన్న శ్రీ ప్రియ మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ సెల్ఫీని తన సోషల్ మీడియా స్టేటస్‌గా అప్‌లోడ్ చేస్తూ దానిపై ‘‘ద్రోహానికి పరిహారం మరణం’’ అనే క్యాప్షన్ జత చేశాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాలమురుగన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దంపతుల మధ్య ఉన్న మనస్పర్థలు, వివాహేతర సంబంధంపై అనుమానమే ఈ ఘోరానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముగ్గురు పిల్లలున్న ఈ దంపతుల జీవితంలో జరిగిన ఈ విషాదం తిరునెల్వేలి, కోయంబత్తూరు ప్రాంతాల్లో చర్చనీయాంశమైంది.

Also Read

Related posts