ప్రకాష్, సత్య భార్యా భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. హాయిగా సాగిపోతున్న సంసారం. అంతలో చిన్న కుదుపు. భర్తపై భార్యకు అనుమానం మొదలైంది. అది పెను భూతంగా మారింది. చివరకు ఆమె ఏం చేసిందంటే..?
అనుమానం పెనుభూతం అంటుంటారు పెద్దలు. ముఖ్యంగా సంసారంలో దీనికి తావునివ్వకూడదు. నమ్మకం అనే నావ మీద నడిచే కాపురంలో అనుమానాలు, అపార్థాలు పుట్టుకు వస్తే.. పచ్చని కాపురం నిలువునా ముక్కలు అవుతుంది. మానసికంగా క్షోభ మిగులుతుంది. ముఖ్యంగా భర్త విషయంలో భార్యకు ఒక్కసారి అనుమానం ఏర్పడిందా.. జీవితాంతం వెంటాడుతుంది. అటు భర్తతో ఉండలేక.. పిల్లల్ని విడిచి పెట్టి వెళ్లలేక.. ఆ ఇంటి ఇల్లాలు ఆవేదన వర్ణనాతీతం. ఇవే అనార్థాలకు దారి తీస్తుంటాయి. పుట్టింట్లో చెప్పుకోలేక.. భర్తను కాదనలేక సతమతమౌతూ ఉంటుంది. ఈ విషయంపై తీవ్రంగా ఆలోచించి దారుణ నిర్ణయాలు తీసుకుంటుంది. కడకు అనుమానం ఆ ఇంట్లో ఆవేదన మిగులుస్తుంది.
ఇప్పుడు ఇదే జరిగింది సత్య విషయంలో కూడా. భర్తపై అనుమానంతో ఆత్మహత్య చేసుకుంది. భార్యను బెడ్ రూంలో అలా చూసేసరికి తట్టుకోలేకపోయిన భర్త కూడా తనువు చాలించాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. చెన్నైలోని అన్నామలై నగర్ పిల్లియార్ కోవిల్ వీధిలో జీవిస్తున్నారు భార్యా భర్తలు ప్రకాష్, సత్య. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడికి 16 ఏళ్లు, కూతురికి 14 ఏళ్లు. ప్రకాష్ స్థానికంగా కూరగాయల మార్కెట్‌లో పనిచేసేవాడు. ఈ క్రమంలో భర్తపై సత్యకు అనుమానం ఏర్పడింది. అతడు మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భావించింది. ఈ విషయంలో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అలాంటిది ఏమీ లేదని చెప్పినా.. సత్య మాత్రం నమ్మలేదు. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని నెరుపుతున్నాడన్న అనుమానంతో మానసిక క్షోభను అనుభవించింది.
ఎప్పటిలాగానే భోజనం చేసేందుకు మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు భర్త ప్రకాష్. మళ్లీ ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. అంతలో తన బెడ్రూమ్‌లోకి వెళ్లిన సత్య.. ఉరి వేసుకుని చనిపోయింది. ఆమెను అలా చూసేసరికి వెంటనే కొడుక్కి కాల్ చేసి చెప్పాడు. మీ అమ్మ లేని జీవితం తనకు వద్దంటూ ఫోన్ కట్ చేసేశాడు. వెంటనే అతడు కూడా వంటగదిలోకి వెళ్లి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు ఏక కాలంలో కోల్పోయిన కొడుకు కన్నీరుమున్నీరుగా విలపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా ప్రకాష్, సత్య వేర్వేరు గదిలో ఉరివేసుకుని కనిపించారు. ఆవడి పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో భార్యా భర్తలు దారుణ నిర్ణయాలు తీసుకుని.. పిల్లల్ని అనాధలు చేశారు.