SGSTV NEWS online
Andhra PradeshCrime

Andhra Pradesh: మీరేం మనుషులు రా.. ఉమ్మి వేశాడని దారుణంగా కొట్టి.. చివరకు..



చిన్న వాగ్వాదం ప్రాణాలను తీసింది. ఉమ్మి వేయడంపై మొదలైన గొడవలో నలుగురు వ్యక్తులు ఓ యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రాంబాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేయగా.. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు.


ఒక చిన్నపాటి వాగ్వాదం చిలికి చిలికి గాలివానై ఒక యువకుడి ప్రాణం తీసిన హృదయ విదారక సంఘటన గుంటూరు జిల్లా వినుకొండలో చోటు చేసుకుంది. నలుగురు వ్యక్తులు విచక్షణా రహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వినుకొండలోని ఓబయ్య కాలనీలో నివసించే రాంబాబు అనే కూలీ ఈ నెల 10న కాలనీలో వెళ్తుండగా ఒక ఇంటి వద్ద ఉమ్మేశాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన మరియబాబు అనే వ్యక్తి ఆ ఉమ్మి తనను చూసే వేశాడని భావించి వెంటనే రాంబాబుతో గొడవకు దిగాడు. “నన్ను చూసి ఉమ్మి వేస్తావా?” అంటూ ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణగా మారింది.

నలుగురి దాడి.. చికిత్స పొందుతూ..
ఈ వాగ్వివాదం జరుగుతున్న సమయంలోనే మరియబాబు స్నేహితులు అక్కడికి చేరుకున్నారు. మరియబాబుతో పాటు మరో ముగ్గురు కలిసి రాంబాబుపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిని ఆపడానికి కొంతమంది మహిళలు ప్రయత్నించినా, నలుగురు నిందితులు పట్టించుకోకుండా దాడిని కొనసాగించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాంబాబును కుటుంబ సభ్యులు వెంటనే గుంటూరులోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాంబాబు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుల్లో ఇద్దరు మైనర్లు
రాంబాబు మృతి చెందడంతో పోలీసులు ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన మరియబాబుతో సహా నలుగురిని పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. ఈ దాడి మద్యం మత్తులో జరిగినట్లుగా డీఎస్పీ హనుమంత రావు పేర్కొన్నారు. అరెస్టు అయిన నలుగురిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. వారిని జువైనల్ హోంకి పంపుతున్నట్లు డీఎస్పీ హనుమంత రావు వెల్లడించారు. చిన్న వివాదం కారణంగా ఒక యువకుడి ప్రాణం పోవడం పట్ల స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read

Related posts