SGSTV NEWS online
Andhra PradeshCrime

Andhra Pradesh: ఎంత పనిచేశావ్ శ్యామలా.. పెళ్లై ఏడాది కాకముందే ఘోరం..



వరకట్న వేధింపులు ఓ వివాహిత ప్రాణం తీశాయి. పెళ్లై సరిగ్గా ఏడాది కూడా కాకముందే విజయశ్యామల అనే వివాహిత వరకట్న వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు గత సంవత్సరం వేపాడ దిలీప్‌ శివకుమార్‌తో వివాహం జరిగింది. పోలీసులు ఘటనా స్థలంలో సూసైడ్ లేఖతో పాటు ఒక చిన్నారి ఫోటోను కూడా స్వాధీనం చేసుకున్నారు.


పెళ్లై ఏడాది కూడా తిరగకముందే వరకట్న వేధింపుల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన గోపాలపట్నంలోని రామకృష్ణనగర్‌లో చోటుచేసుకుంది. అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిని భర్తే చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది. గోవాడ పంచాయతీకి చెందిన వేపాడ దిలీప్‌ శివకుమార్‌, అచ్యుతాపురానికి చెందిన విజయశ్యామల వివాహం గత ఏడాది డిసెంబరు 6న జరిగింది. పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు ఇచ్చారు. ఉద్యోగ రీత్యా ప్రస్తుతం వీరు జీవీఎంసీ 91వ వార్డు పరిధిలోని రామకృష్ణనగర్‌లో నివాసం ఉంటున్నారు.

దిలీప్‌ శివకుమార్‌ గత కొద్ది నెలలుగా అదనపు కట్నం తీసుకురావాలంటూ విజయశ్యామలను తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేకపోయిన శ్యామల, భర్త లేని సమయం చూసి తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించగా, మృతదేహం పక్కనే విజయశ్యామల రాసినట్లు భావిస్తున్న సూసైడ్ లేఖతో పాటు ఒక చిన్నారి ఫొటో కూడా పోలీసులకు లభించింది. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తల్లిదండ్రుల సంచలన ఆరోపణలు
ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విజయశ్యామల ముఖంపై గాయాలు ఉన్నాయని గమనించిన తల్లిదండ్రులు, ఇది ఆత్మహత్య కాదని, తమ కూతురిని అల్లుడు దిలీప్ శివకుమారే చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాడు అని ఘటనా స్థలంలోనే ఆరోపించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వెంటనే వరకట్న వేధింపులు, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి.. భర్త దిలీప్‌ శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. “ఎంత పనిచేశావ్‌ శ్యామలా…” అంటూ తల్లి రోజారమణి రోదించిన తీరు అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది

Also Read

Related posts