SGSTV NEWS online
Andhra PradeshCrime

యువతి సజీవ దహనం కేసు కీలక మలుపు



నేరం జరిగి మూడేళ్లు కావస్తుంది. 19 ఏళ్ళ వయస్సులోనే ఒక యువతి మృతి చెందింది. ఆమె హత్య చేయబడిందని ఆరోపణలు ఉన్నా.. పోలీసులు ఆ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. అయితే తాజా వచ్చిన ఫోరెన్సిక్ నివేదిక యువతి మరణానికి గల కారణం తేల్చి చెప్పటంతో పోలీసులు హంతకులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అసలు హత్య ఎలా జరిగింది, చేసింది ఎవరు.?



పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురం గ్రామానికి చెందిన బిటెక్ విద్యార్థిని ముళ్లపూడి నాగహరిత(19) అనుమానాస్పద రీతిలో చనిపోయింది. గదిలో నిద్రిస్తున్న ఆమె షార్ట్ సర్క్యూట్ కారణంగా సజీవదహనమైనట్లు ఆమె తండ్రి చెప్పటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ ఘటన 2022 నవంబర్‌ 12న వెలుగు చూసింది. అయితే యువతి మేనమామ, అమ్మమ్మలు మాత్రం ఇది కేవలం హత్య అంటూ అప్పట్లో ఆరోపణలు చేశారు. తాజాగా యువతి మృతి కేసులో ఫోరెన్సిక్‌ నివేదికలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతి తల పగిలినట్లు నివేదికలో వచ్చింది. ఆమె మరణానికి ముందు తలపై బలంగా కొట్టడంతో చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. చనిపోయిన తరువాత పెట్రోలు పోసి హత్య చేసినట్లుగా నివేదిక రావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని తాజాగా విచారణ ప్రారంభించారు.

ఆస్తి తగాదాలు నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అప్పట్లో కుటుంబ సభ్యుల నుంచి కాకుండా గ్రామ విఆర్వో నుంచి ఫిర్యాదు తీసుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు సరైన విచారణ చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొదట నుంచి మృతురాలి మేనమామ, అమ్మమ్మ నాగ హరితను హత్య చేశారని ఆరోపిస్తున్న క్రమంలో ఇప్పుడు పోలీసులు ఏవిధంగా కేసు ముగిస్తారనే చర్చ జరుగుతోంది. కాగా హరిత తల్లితండ్రులు గజ్జరపు వసంత, ముళ్ళపూడి శ్రీను. శ్రీను వ్యవసాయం చేస్తుంటారు. గజ్జరపు వసంత చనిపోవటంతో శ్రీను తరువాత రూపను రెండో పెళ్లి చేసుకున్నాడు. హరిత ఒక ప్రయివేట్ కాలేజ్‌లో బిటెక్ చదువుతూ ఇంటికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమె అమ్మమ్మ, మేనమామ కృష్ణయ్య పాలెంలో ఉంటారు. అయితే మారుతల్లి రూప రాజకీయాల్లోనూ ఉండటంతో అప్పట్లో ఈ ఘటన కలకలం రేపింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో జరుగుతున్న పోలీసుల విచారణలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది

Also Read

Related posts