SGSTV NEWS online
Andhra PradeshCrime

మహిళలను అక్రమ రవాణా చేస్తున్నారంటూ మేనేజర్‌‌కు ఫోన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..




రోజురోజుకి సైబర్‌ నేరగాళ్ళు రెచ్చిపోతూనే ఉన్నారు. డిజిటల్‌ అరెస్ట్‌, అసాంఘిక కార్యకలాపాలకు మీ ఎకౌంట్‌ నెంబర్‌ అనుసంధానమైందంటూ అమాయకుల దగ్గర నుంచి అధికారుల వరకు ఎవరినీ వదలకుండా బ్లాక్‌ మెయిల్‌ చేసి లక్షలు, వీలైతే కోట్లు కొల్లకొట్టేస్తున్నారు. వీరి వలలో ప్రభుత్వ అధికారులతో పాటు టీచర్లు, రిటైర్డ్‌ ఉద్యోగులు, సామాన్యులు కూడా ఉంటున్నారు.. తాజాగా ప్రకాశం జిల్లాలోని ఓ గ్రానైట్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి నుంచి 18.35 లక్షల నగదు లాగేశారు. ఇంకా డబ్బుల కోసం డిమాండ్‌ చేస్తుండటంతో తాను మోసపోయినట్టు ఆలస్యంగా తెలుసుకుని చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఒంగోలు పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం పోలీసులు ఈ సైబర్‌ చీటింగ్‌పై విచారణ చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్‌ పరిశ్రమలో మేనేజర్‌గా పనిచేస్తూ ఒంగోలులో నివాసం ఉంటున్న రాజు అనే వ్యక్తిని సైబర్‌ నేరగాళ్ళు టార్గెట్‌ చేశారు. ఆయన బ్యాంక్‌ ఖాతా వివరాలను ఎలాగోలా తెలుసుకున్నారు. ఆయన ఖాతా నుంచి లక్షల్లో నగదు లావాదేవీలు జరుగుతున్నాయని గ్రహించి పక్కా ప్లాన్‌ ప్రకారం వల వేశారు. ఈ నేపధ్యంలో ఓ ఫైన్‌ మార్నింగ్‌ అంటే ఈనెల 12వ తేది ఉదయం 10.30 గంటలకు ఒంగోలులో ఉన్న మేనేజర్‌ రాజుకు ఓ ఫోన్‌ వచ్చింది. తాము ముంబయిలోని బాంద్రా పోలీసులమని, రాజుపై వివిధ కేసులు నమోదయ్యాయన్నది ఆ ఫోన్‌ సారాంశం..

దీంతో భయపడిపోయిన రాజును మరింత భయపెట్టి భయబ్రాంతులకు గురిచేసి పలు విడతలుగా అతని నుంచి 18.35 లక్షలు డ్రా చేసుకున్నారు. రాజు ఫోన్‌ నెంబర్‌ ముంబయిలోని ఓ బ్యాంకు ఖాతాకు అనుసంధానం అయి ఉందని, ఆ బ్యాంకు ఖాతా ద్వారా అసాంఘిక కార్యకలాపాలు, మహిళల అక్రమ రవాణా ద్వారా సంపాదించిన నగదు జమైనట్లు తమ దర్యాప్తులో తేలిందని బెదరగొట్టేశారు.. కొద్ది సేపటి తరువాత తిరిగి వాట్సాప్ కాల్ చేసి మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు నిర్వహిస్తూ 3 కోట్లు కమీషన్ మీ ఖాతాలో జమ అయిందని మరింత భయభ్రాంతులకు గురిచేశారు.. మనీ లాండరింగ్‌, ఈడీ కేసులు నమోదైతే నేరుగా జైలుకే వెళతారని, బెయిల్‌ కూడా రాదని చెప్పారు.

ఈ క్రమంలోనే రాజు భయపడ్డాడని గ్రహించిన సైబర్ కేటుగాళ్లు వెంటనే రూటుమార్చారు.. నిజంగా మీరు తప్పు చేయలేదని మాకు తెలుసు, అయితే అధారాలు అన్నీ మీరే దోషులుగా నిరూపిస్తున్నాయని నమ్మబలికారు. పూర్తి భయంతో తమ ట్రాప్‌లో పడ్డ రాజును ఈ కేసుల నుంచి బయట పడాలంటే కొంత సొమ్ము ముట్టజెప్పాలని నెమ్మదిగా రంగంలోకి దించి లక్షలకు లక్షలు వసూలు చేశారు. మూడు విడతలుగా నిందితులు చెప్పిన ఖాతాలకు 18.35 లక్షలు జమ చేశాడు రాజు.. అనంతరం ఇక రాజు దగ్గర డబ్బులు లేవని తెలుసుకున్న సైబర్‌ నేరగాళ్లు తమ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశారు. అంతా అయిపోయాక ఇక తాను మోసపోయానని గ్రహించి ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు రాజు.. రాజు ఫిర్యాదు అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read

Related posts