SGSTV NEWS online
Andhra PradeshCrime

Kottavalasa: ఓవర్ నైట్ కోట్లకు పడగెత్తుదామని ఈ తహశీల్దార్ ఎంత పని చేశాడో తెలుసా..?



విజయనగరం జిల్లా కొత్తవలస మండల తహసిల్దార్ అప్పలరాజు సస్పెన్షన్ సంచలనంగా మారింది. సస్పెన్షన్ తరువాత ఆయనపై జరుగుతున్న విచారణలో త్రవ్వేకొద్దీ భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మార్కెట్ ధర ప్రకారం వందల కోట్ల విలువైన భూ అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగంతో జిల్లా కలెక్టర్ రామ్‌సుందర్ రెడ్డి ఆయనపై చర్యలకు దిగారు. తహసిల్దార్ అప్పలరాజు చేసిన భూ అక్రమ వ్యవహారాల్లో అనేక కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గత మూడు నెలలు క్రితం జరిగిన సాధారణ బదిలీల్లో పార్వతీపురం మన్యం జిల్లా నుంచి వచ్చిన అప్పలరాజు కేవలం మూడు నెలల్లోనే కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను పక్కదారి పట్టించడానికి ప్రయత్నించాలన్న అభియోగాలతో ఆయనపై చర్యలకు పూనుకున్నారు అధికారులు. జిల్లాలో కొత్తవలస ఒక విలువైన ప్రాంతం. విశాఖ నగరంతో కలిసి ఉండటంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశానంటుతున్నాయి. దీంతో అప్పలరాజు విలువైన ప్రభుత్వ భూమిని పలువురు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. మండలంలోని చిన్నిపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 95 నీటి చెరువుగా ఉన్న పొరంబోకు భూమిని అక్రమంగా సర్వే నంబర్లు సబ్ డివిజన్ చేసి 3.71 సెంట్లను ఒక ప్రవేట్ వ్యక్తి పేరుపై ఎంట్రీ చేసినట్టు విచారణలో బయటపడింది. అలాగే కొత్తవలస గ్రామం సర్వే నెంబర్ 165-1 పొరంబోకు భూమిని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పేర్లకు మ్యూటేషన్ చేసినట్లు తేలింది. అలా మండలంలోని పలు చోట్ల కొత్త సబ్ డివిజన్లు సృష్టించి, కనీసం ఎలాంటి దరఖాస్తు కూడా లేకుండానే ఆన్‌లైన్‌లో ఎంట్రీలు చేసినట్టు అధికారులు నిర్ధారించారు. అదే విధంగా చింతలపాలెం గ్రామంలో Sy.Nos. 52-4P, 52-7, 52-12, 52- 13, 52-14, 52-15P, 52-18, 52-8 & 53-1 సర్వే నెంబర్లను అక్రమ మ్యూటెషన్లు చేసినట్లు తేల్చారు. జాయింట్ కలెక్టర్ ఆమోదం లేకుండానే వెబ్‌ల్యాండ్‌లో సబ్‌డివిజన్ చేసినట్టు నివేదికల్లో తేలింది.

ప్రాథమిక విచారణలో అవకతవకలు నిజమని తేలడంతో.. తహసిల్దార్ అప్పల రాజును తక్షణమే సస్పెండ్ చేశారు. అయితే అప్పలరాజు కొత్తవలస తహశీల్దార్ గా విధులు నిర్వహించిన సమయంలో ప్రస్తుతానికి వెలుగులోకి వచ్చిన భూ అక్రమ వ్యవహారాలు కాకుండా ఇంకా ఏమైనా ఇలాంటి అవకతవకలకు పాల్పడ్డారా అన్న కోణంలో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు ఉన్నతాధికారులు. కేవలం మూడు నెలల వ్యవధిలో వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నించిన తహశీల్దార్ వెనుక ఎవరున్నారు అనే కోణంలో ఇప్పుడు విస్తృత చర్చ నడుస్తుంది. అయితే ఈ వ్యవహారం తాహసిల్దార్ సస్పెన్షన్ తో ఆగకుండా అతనితోపాటు ప్రైవేట్ వ్యక్తులు పాత్ర పై విచారించి క్రిమినల్ కేసులు ఫైల్ చేయాలని కోరుతున్నారు కోరుతున్నారు స్థానికులు. అయితే అప్పలరాజు పై విచారణ పూర్తయ్యే వరకు ఆయనపై సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపారు. అలాగే అప్పలరాజు సస్పెన్షన్ లో పలు షరతులు కూడా విధించారు. తహసిల్దార్ హెడ్‌క్వార్టర్ అయిన కోత్తవలసలోనే ఉండాలని, అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్‌ను వదిలి వెళ్లకూడదని ఆదేశించారు. ప్రస్తుతం కొత్తవలస మండల డిప్యూటీ తహసిల్దార్‌కు తాత్కాలికంగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల్లో తెలిపారు. అయితే ప్రస్తుతం ఈయన పై మరింత లోతైన దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో మరెన్నో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి అని తెలుస్తుంది. అయితే ఇతన్ని సస్పెన్షన్ వేటుతో వదలకుండా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జిల్లావాసులు

Also Read

Related posts