లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడ్డారు.. జల్సాలలో మునిగితేలారు.. అందుకు కావలసిన డబ్బు కోసం జూదం, బెట్టింగులకు దిగారు. చివరికి అప్పులపాలై, చేసిన రుణం తీర్చేందుకు తప్పటడుగులు వేసి కటకటలపాలయ్యారు ఇద్దరు యువకులు. శ్రీకాకుళం జిల్లా పూసపాటిరేగ ప్రాంతానికి చెందిన భార్గవ్ అనే యువకుడు చదువులో బాగా రాణించాడు. డిగ్రీలో మంచి మార్కులు వచ్చాయి. తరువాత ఎంబీఏలో కూడా టాపర్‌గా నిలిచాడు
కుటుంబ పరిస్థితుల నేపధ్యంలో కొన్నాళ్ల నుండి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇంటి వద్ద ఉన్నా తన కాళ్లపై తాను నిలబడాలన్న ఆలోచనతో స్థానికంగా ఉన్న విద్యార్థులకు ట్యూషన్స్ చెబుతూ కాలం గడుపుతున్నాడు. అందరితో కలివిడిగా ఉండే భార్గ కు అదే ప్రాంతానికి చెందిన సత్యకుమర్ పరిచయం అయ్యాడు. సత్యకుమార్ ఏడవ తరగతి వరకు చదివి తరువాత పెయింటింగ్ వృత్తిలో స్థిరపడ్డాడు. సత్యకుమార్‌కు మద్యం, జూదం వంటి దురలవాట్లు ఉన్నాయి. ఇలా సత్యకుమార్ తో స్నేహం మొదలైన తరువాత నెమ్మదిగా భార్గవ్ కూడా మద్యంతో పాటు ఇతర చెడు అలవాట్లకు దగ్గరయ్యాడు. వీరిద్దరికున్న చెడు అలవాట్ల కోసం బెట్టింగ్స్ వైపు అడుగులు వేశారు.
అలా బెట్టింగ్స్ మొదలుపెట్టిన వీరిద్దరు చాలా నష్టపోయారు. అప్పులు కూడా పెరిగాయి. ఒక వైపు పెరిగిన అప్పుల ఒత్తిడి, మరోవైపు జల్సాలకు అలవాటు పడిన స్నేహితులిద్దరూ డబ్బు లేకుండా ఉండలేకపోయారు. దీంతో ఎలాగైనా అప్పులు తీర్చాలి. మళ్లీ లగ్జరీ లైఫ్ కావాలి అని దొంగతనాల వైపు దృష్టి సారించారు. అలా మొదలైన వీరి ప్రవృత్తి ఒంటరి మహిళలు, వృద్ధులే టార్గెట్ గా సాగింది. పక్కా ప్రణాళికలు వేస్తూ చోరీలకి దిగేవారు.
అలా ఫిబ్రవరి నెలలో విజయనగరం జిల్లా కేంద్రంలోని పలుచోట్ల దొంగతనానికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే మార్చి 21న తోటపాలెంకు చెందిన గురుమూర్తమ్మ అనే మహిళ ఆవులను మేపుతుండగా ఆమె దగ్గరకు వచ్చి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. కొద్దిసేపు మాయమాటలు చెప్పి నమ్మకంగా ఆమె దగ్గరే ఉన్నారు. ఆ తరువాత కొంతసేపటి తరువాత గురుమూర్తమ్మ పరధ్యానంలో ఉండటం గమనించిన ఆ ఇద్దరు యువకులు ఆమె మెడలో ఉన్న బంగారాన్ని లాక్కొని పరారయ్యారు. దీంతో లబోదిబోమంటూ పెద్దపెద్దగా కేకలు వేసింది. అయినా సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే కుటుంబసభ్యుల సహాయంతో బాధితురాలి ఇచ్చిన పిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బాధితురాలు ఇచ్చిన ఆధారాల మేరకు ఎట్టకేలకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును రికవరీ చేసి రిమాండ్ కు పంపారు. జూదం, బెట్టింగ్ తో పాటు ఆదాయానికి మించిన ఖర్చు, జల్సాలతో పెడదారి పట్టి జీవితాలు నాశనం చేసుకోవద్దని యువతకు సూచిస్తున్నారు వన్ టౌన్ పోలీసులు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..